P Krishna
P Krishna
ఇటీవల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ తో విద్యార్థులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని.. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అంటున్నప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూను ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులును తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా భీంగల్ లో కస్తూర్భా పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు 100 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థినులకు ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులతో అల్లాడిపోయారు. ఇది గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని 90 మంది విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కి కారణం విద్యార్థినులు రాత్రి తిన్న భోజనమే అని అధికారులు తేల్చారు. బాధిత విద్యార్థినులు తిన్న ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు.
ఇక భీంగల్ లో కస్తూర్భా పాఠశాలలో విద్యార్థునిలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలు పడుతున్న అవస్థలు చూసి తల్లడిల్లిపోయారు. కలుషిత ఆహారం అందించిన హాస్టల్ నిర్వహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ వసతుల సంగతి దేవుడు ఎరుగు కనీసం తమ పిల్లలకు శుభ్రమైన ఆహారం, ఆరగ్యం కూడా కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహం ఆహారం, ఇతర వసతుల గురించి అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై పట్టించుకోవాలని.. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.