మన దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా ఒక రేంజ్లో నడుస్తోంది. కరోనా వల్ల డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు జేబులో పర్సు లేకపోయినా ఫోన్ ఉంటే చాలు.. మొబైల్లో ఒక్క క్లిక్‌తో ఏదైనా కొనేయొచ్చు. ఈ ధీమా ఏర్పడటానికి కారణం ఈ రకమైన చెల్లింపులే. కొవిడ్ టైమ్‌లో డిజిటల్ పేమెంట్స్‌తో హవా నడిపించాయి ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు. ఇప్పుడు కూడా వీటి జోరు తగ్గడం లేదు. అలాంటి ఫోన్‌పే కంపెనీ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఓ కొత్త యాప్ స్టోర్‌ను తీసుకొస్తోంది. యాప్ డెవలపర్స్ కోసమని ఇండస్ యాప్ స్టోర్ అనే నూతన వేదికను మొదలుపెడుతున్నట్లు తెలిపింది.
ఇండస్ యాప్ స్టోర్‌లో తమ అప్లికేషన్లను లిస్ట్ చేయాలని డెవలపర్లను ఫోన్‌పే కోరింది. ఈ యాప్ స్టోర్ 12 స్థానిక భాషల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి పోటీగా సవాల్ విసిరేందుకు ఫోన్‌పే సిద్ధమైంది. యాప్ డెవలపర్లను ఇండస్ యాప్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఫోన్‌పే కోరింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండస్యాప్స్టోర్.కామ్ వెబ్సైట్ ద్వారా యాప్స్‌ను అప్డోల్ చేయాలని పేర్కొంది. మొదటి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయబోమని ఫోన్‌పే తెలిపింది.
తొలి ఏడాది డెవలపర్ల నుంచి ఫీజు వసూలు చేయబోమన్న ఫోన్‌పే.. మరుసటి ఏడాది నుంచి స్వల్ప మొత్తంలో మాత్రమే ఫీజు తీసుకుంటామని పేర్కొంది. అలాగే డెవలపర్స్ నుంచి ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజు గానీ, ఇన్-యాప్ పేమెంట్స్‌కు కమీషన్ గానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. తమకు నచ్చిన పేమెంట్ గేట్‌వేను ఫ్రీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. మామూలుగా ఇన్ యాప్ పర్చేజీల మీద గూగుల్, యాపిల్ స్టోర్లు 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. అలాగే పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ విషయంలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోకుండా యూజర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటి మీద యాప్ డెవలపర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: ఢిల్లీకే పరిమితమైన లోకేష్! అరెస్ట్ చేస్తారనే భయమా?