iDreamPost

14 బంతుల్లో 61 పరుగులు! పాక్‌ బౌలర్‌కు చుక్కలు చూపించిన యూసుఫ్‌ పఠాన్‌

  • Published Jul 29, 2023 | 8:12 AMUpdated Jul 29, 2023 | 8:12 AM
  • Published Jul 29, 2023 | 8:12 AMUpdated Jul 29, 2023 | 8:12 AM
14 బంతుల్లో 61 పరుగులు! పాక్‌ బౌలర్‌కు చుక్కలు చూపించిన యూసుఫ్‌ పఠాన్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్న యూసుఫ్‌ పఠాన్‌ పట్టుపగ్గాలు లేకుండా చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా తనలో ఇంకా వాడీవేడి తగ్గలేదని నిరూపించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. 18 బంతుల్లో 64 పరుగులు కావాల్సిన అసాధ్య దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నాడో కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ బాదుడు చూస్తుంటే.. సిక్సులు కొట్టడం ఇంత సింపులా అనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ బౌలర్‌ మెహమ్మద్‌ అమీర్‌ బౌలింగ్‌నైతే చీల్చిచెండాడు. ఇంతకీ యూసుఫ్‌ పఠాన్‌ ఈ విధ్వంసం ఎక్కడ సృష్టించాడు అనుకుంటున్నారా? జింబాబ్వే వేదికగా యూఏసీ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో. జోబర్గ్‌ బఫ్పాలోస్‌ టీమ్‌ తరపున ఆడుతున్న పఠాన్‌ ఒంటిచేత్తో ఆ జట్టును ఫైనల్‌ చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో పఠాన్‌ విధ్వంసం ఎంత దారుణంగా సాగిందంటే.. ఈ మ్యాచ్‌లో బోబర్గ్‌ జట్టు గెలుస్తుందని చివరి 3 ఓవర్లు మిగిలి ఉన్నంత వరకు కూడా ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే లక్ష్యం అంత కష్టసాధ్యంగా ఉంది. 18 బంతుల్లో 64 పరుగులు చేయాలి. ఈ దశలో పఠాన్‌ జూలువిదిల్చిన సింహంలా ప్రత్యర్థి జట్టుపై పడ్డాడు. ఆ 18 బంతుల్లో 14 బంతులు తనే ఆడి ఏకంగా 61 పరుగులు బాదాడు. దీంతో విజయం జోబర్గ్‌ సొంతమైంది. మొత్తం మీద కేవలం 26 బంతులు ఎదుర్కొన్న పఠాన్‌ 5 ఫోర్లు, 9 సిక్సులతో 82 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో డర్బన్‌ ఖలందర్స్‌ జట్టుపై 6 వికెట్లతో తేడాతో జోబర్గ్‌ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్‌(39), ఆసిఫ్‌ అలీ(32 నాటౌట్‌) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. 141 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన జోబర్గ్‌ యూసుఫ్‌ పఠాన్‌ విధ్వంసంతో 9.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓ దశలో 57 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జోబర్గ్‌ టీమ్‌ను యూసుఫ్‌ పఠాన్‌ ఆదుకున్నాడు. అతనికి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(14 నాటౌట్‌) అండగా నిలిచాడు. ముఖ్యంగా పఠాన్‌ ఎదుర్కొన్న చివరి 14 బంతుల్లో వరుసగా.. 6,6,0,6,2,4,6,1,6,4,6,4,6,4 బాదాడు. మరి పఠాన్‌ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న జై షా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి