నాలుగేళ్ల కింద జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టీర్నీలో సెమీస్‌లో భారత్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్న కివీస్ జట్టు కప్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. బెన్ స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకుంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్‌ను కొట్టి ఛాంపియన్‌గా నిలవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం కివీస్‌ను ఇబ్బంది పెడుతోంది.
వన్డే ప్రపంచ కప్-2023కి ముందు ఇద్దరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్స్ గాయాలపాలయ్యారు. అందులో ఒకరు సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కాగా.. మరొకరు ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటం గమనార్హం. ఇంగ్లండ్ జట్టుతో లార్డ్స్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో సౌథీ కుడి బొటనవేలికి దెబ్బ తగిలింది. బౌలర్ బెన్ లీస్టర్ వేసిన 14వ ఓవర్లో ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో సౌథీకి ఇంజ్యురీ అయింది. వేలినొప్పితో విలవిల్లాడిన అతడ్ని వైద్య బృందం బయటకు తీసుకెళ్లింది. అనంతరం మళ్లీ అతడు గ్రౌండ్లోకి అడుగుపెట్టలేదు. సౌథీ బొటనవేలి గాయం తీవ్రత తెలుసుకునేందుకు అతడికి మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇప్పటికైతే సౌథీ మళ్లీ గ్రౌండ్లోకి రావడం కష్టమేనని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే కుడిచేతి వాటం బౌలర్ అయిన సౌథీకి అదే హ్యాండ్‌కు ఇంజ్యురీ అవడంతో కివీస్ మేనేజ్మెంట్ భయపడుతోంది. ఇక, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ కూడా గాయపడ్డాడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పట్టిన అతడి ఎడమచేతి ఉంగరం వేలు బెణికింది. అయితే కాసేపటికే మళ్లీ గ్రౌండ్లోకి వచ్చిన మిచెల్.. వచ్చీ రావడంతోనే జోస్ బట్లర్‌ను ఔట్ చేశాడు. ఒకే మ్యాచ్‌లో సౌథీ, మిచెల్ గాయపడటం.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఇంకా ఫామ్ చాటుకోకపోవడంతో వరల్డ్ కప్‌లో కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Tim Southee doubtful for the 2023 World Cup. pic.twitter.com/4gi0csph2A
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2023
Tim Southee has left the field having injured his right thumb attempting to take a catch off Ben Lister. The injury requires further assessment and he won’t to return to the field at this stage.#ENGvNZ #CricketNation pic.twitter.com/ChjW8Z1c8J
— BLACKCAPS (@BLACKCAPS) September 15, 2023