iDreamPost
android-app
ios-app

న్యూజిలాండ్​కు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్​లో ​పరిస్థితి ఏంటి?

  • Author singhj Published - 02:02 PM, Sat - 16 September 23
  • Author singhj Published - 02:02 PM, Sat - 16 September 23
న్యూజిలాండ్​కు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్​లో ​పరిస్థితి ఏంటి?

నాలుగేళ్ల కింద జరిగిన వన్డే వరల్డ్ కప్​లో న్యూజిలాండ్ టీమ్ రన్నరప్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టీర్నీలో సెమీస్​లో భారత్​పై గెలిచి ఫైనల్​కు చేరుకున్న కివీస్ జట్టు కప్​ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. బెన్ స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా వరల్డ్ కప్​ను తృటిలో చేజార్చుకుంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్​ను కొట్టి ఛాంపియన్​గా నిలవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం కివీస్​ను ఇబ్బంది పెడుతోంది.

వన్డే ప్రపంచ కప్-2023కి ముందు ఇద్దరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్స్ గాయాలపాలయ్యారు. అందులో ఒకరు సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కాగా.. మరొకరు ఆల్​రౌండర్ డారిల్ మిచెల్. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్​లో గాయపడటం గమనార్హం. ఇంగ్లండ్ జట్టుతో లార్డ్స్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో సౌథీ కుడి బొటనవేలికి దెబ్బ తగిలింది. బౌలర్ బెన్ లీస్టర్ వేసిన 14వ ఓవర్​లో ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ ఇచ్చిన క్యాచ్​ను అందుకునే ప్రయత్నంలో సౌథీకి ఇంజ్యురీ అయింది. వేలినొప్పితో విలవిల్లాడిన అతడ్ని వైద్య బృందం బయటకు తీసుకెళ్లింది. అనంతరం మళ్లీ అతడు గ్రౌండ్​లోకి అడుగుపెట్టలేదు. సౌథీ బొటనవేలి గాయం తీవ్రత తెలుసుకునేందుకు అతడికి మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇప్పటికైతే సౌథీ మళ్లీ గ్రౌండ్​లోకి రావడం కష్టమేనని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే కుడిచేతి వాటం బౌలర్ అయిన సౌథీకి అదే హ్యాండ్​కు ఇంజ్యురీ అవడంతో కివీస్ మేనేజ్​మెంట్ భయపడుతోంది. ఇక, ఇంగ్లండ్​తో మ్యాచ్​లో కివీస్​ ఆల్​రౌండర్ డారిల్ మిచెల్ కూడా గాయపడ్డాడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్​స్టో ఇచ్చిన క్యాచ్​ను పట్టిన అతడి ఎడమచేతి ఉంగరం వేలు బెణికింది. అయితే కాసేపటికే మళ్లీ గ్రౌండ్​లోకి వచ్చిన మిచెల్.. వచ్చీ రావడంతోనే జోస్ బట్లర్​ను ఔట్ చేశాడు. ఒకే మ్యాచ్​లో సౌథీ, మిచెల్ గాయపడటం.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఇంకా ఫామ్ చాటుకోకపోవడంతో వరల్డ్ కప్​లో కివీస్​కు కష్టాలు తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.