iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!

  • Author singhj Published - 09:03 AM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత్ కప్పు ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ మ్యాచ్​లో ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత్ కప్పు ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ మ్యాచ్​లో ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 09:03 AM, Mon - 20 November 23
వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!

140 కోట్ల మంది భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఇండియన్ క్రికెట్​ను ఎంతగానో ప్రేమించే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. 12 ఏళ్లుగా అందకుండా ఉన్న వన్డే వరల్డ్ కప్-2023 డ్రీమ్​ నెరవేరుతుందని అనుకుంటే మరోమారు మనకు నిరాశే మిగిలింది. వరుస విజయాలు వచ్చాయి, టీమ్ సూపర్బ్​గా ఉంది, అందరూ అద్భుతమైన ఫామ్​లో ఉన్నారు.. కంగారూ లేదు కింగారూ లేదు.. ఈసారి వరల్డ్ కప్ మనదేననే ధీమాలో ఉన్న అభిమానుల హృదయం ఒక్కసారిగా ముక్కలైంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్​లో ఓడిపోయి కప్పును చేజార్చుకుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన భారత్.. 50 ఓవర్లకు 240 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆసీస్ 43 ఓవర్లలోనే టార్గెట్​ను చేరుకొని ఆరోసారి ప్రపంచ కప్​ను సొంతం చేసుకుంది.

ప్రతిష్టాత్మక ఫైనల్​లో భారత్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఐదింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమికి మొదటి ప్రధాన కారణం టాస్. బ్లాక్ సాయిల్ పిచ్​పై టాస్ చాలా కీలక పాత్ర పోషించింది. చూడటానికి బ్యాటింగ్ సర్ఫేస్​గా కనిపించినా ఇది ట్రికీ పిచ్ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందే గ్రహించాడు. అందుకే టాస్ నెగ్గగానే తెలివిగా భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ తాము టాస్ నెగ్గితే బ్యాటింగ్​ చేసేవాళ్లమని అన్నాడు. దీన్ని బట్టే పిచ్​ను అర్థం చేసుకోవడంలో మన కంటే కంగారూలు ముందున్నారని అర్థమైపోయింది. ఈ పిచ్​పై బ్యాటింగ్ కష్టం కాబట్టి ఒక్క రోహిత్​ను ఔట్ చేస్తే చాలు.. మిగతావాళ్లు డిఫెన్స్​లో పడతారని ఆసీస్ అనుకుంది.

రోహిత్ శర్మ ఉన్నంత సేపు స్కోరు బోర్డు మెరుపు వేగంతో కదిలింది. అతడు వెనుదిరిగిన తర్వాత 11 నుంచి 50 ఓవర్ల మధ్యలో కేవలం నాలుగు బౌండరీలు మాత్రమే వచ్చాయి. కమిన్స్​ అంచనాకు తగ్గట్లు బాల్ రివర్స్ స్వింగ్ అవ్వడం, మధ్యలో స్పిన్నర్లకు కూడా హెల్ప్ చేయడంతో భారత బ్యాటర్లు పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ టాస్ మనకు అనుకూలంగా వచ్చి, ఆసీస్​ను రోహిత్ బ్యాటింగ్​కు దింపితే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఈ మ్యాచ్​లో భారత్ ఓటమికి మరో ప్రధాన కారణం కెప్టెన్‌ రోహిత్ శర్మ ఔట్. సింగిల్స్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డ పిచ్​ మీద హిట్​మ్యాన్ అలవోకగా 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతడు తప్ప ఏ ఇండియన్ బ్యాటర్ ఇక్కడ సిక్స్ కొట్టలేదు.

భారత ఇన్నింగ్స్​లో కేఎల్ రాహుల్ ఆడిన తీరుగానే ఆసీస్​లో లబుషేన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ రోహిత్ చేసిన పనే అక్కడ ట్రావిస్ హెడ్ చేశాడు. అయితే హెడ్ ఆఖరి వరకు ఉండి సెంచరీతో భారీ స్కోరు చేయడంతో ఆస్ట్రేలియాకు ఛేజ్ చేయడం ఈజీ అయిపోయింది. టీమిండియా ఇన్నింగ్స్​లో ఇలాగే రోహిత్ మరో 10 ఓవర్లు క్రీజులో ఉండుంటే స్కోరు 300 దాటేది. అప్పుడు ఆసీస్​పై ప్రెజర్ చాలా ఉండేది. వాళ్ల బ్యాట్స్​మెన్ రిస్క్ తీసుకొని రన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీని వల్ల వికెట్లు కోల్పోయే ఛాన్స్ ఉండేది. కానీ అలా జరగలేదు. అప్పటికే మాక్స్​వెల్​ ఓవర్​లో 10 రన్స్ వచ్చినా అనవసర షాట్​కు వెళ్లి వికెట్ ఇచ్చుకున్నాడు రోహిత్. కోహ్లీ ఉన్నాడనే ధైర్యంతో కాబోలు హిట్టింగ్​కు వెళ్లాడు. కానీ అతడి వికెట్ మ్యాచ్​కు ఎంత కీలకమో తర్వాత తెలిసింది.

ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో బ్యాటర్ల ఫెయిల్యూర్ మరొకటి. ఓపెనర్ శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపర్చారు. ఒకవైపు రోహిత్ షాట్స్ ఆడుతుంటే స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన గిల్ అనవసరంగా షాట్ ఆడే వికెట్ సమర్పించుకున్నాడు. కమిన్స్ బౌలింగ్​లో అయ్యర్ వెనుదిరిగిన తీరు కూడా ఆశ్చర్యపర్చింది. అదేమీ అద్భుతమైన డెలివరీ కాదు. కానీ బ్యాక్ ఆఫ్ లెంగ్త్​లో వేసిన బాల్​ను డిఫెన్స్ చేయాల్సింది పోయి ఎడ్జ్ ఇచ్చాడు. జడ్డూ, సూర్యకుమార్ కూడా ఆఖరి వరకు క్రీజులో నిలబడకుండా త్వరగా ఔటయ్యారు. వీళ్లిద్దరిలో ఎవరు బాగా ఆడినా మరో 30 రన్స్ వచ్చేవి. ఒక మాదిరి టార్గెట్​ను కాపాడుకోవడంలో భారత బౌలర్లు ఫెయిలవ్వడం ఓటమికి మరో ప్రధాన కారణం.

టోర్నమెంట్ మొత్తంలో మ్యాచ్ పోతుందనుకున్న ప్రతిసారి వికెట్లు తీసి గేమ్​లో కమ్​బ్యాక్ ఇచ్చేలా చేసిన బౌలర్లు.. ఆసీస్​తో మ్యాచ్​లో మాత్రం ఆ మ్యాజిక్​ను రిపీట్ చేయలేకపోయారు. బాల్ కాస్త పాతబడిన తర్వాత స్వింగ్ అయ్యే టైమ్​లో బౌలింగ్​కు వచ్చే షమీతో మొదట్లోనే బౌలింగ్ వేయించడం దెబ్బతీసింది. బాల్​పై పట్టు దొరక్క ఎక్స్​ట్రాలు, బౌండరీల రూపంలో భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు షమి. ఆసీస్ పేసర్లలా ఈజీ రన్స్ ఆపేందుకు మన బౌలర్లు ప్రయత్నించలేదు. కోచ్​ రాహుల్ ద్రవిడ్​తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన ప్లాన్స్ ఈ వరల్డ్‌ కప్​లో వరుస విజయాలకు కారణం. ఆ ప్లాన్స్​ను అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేసిన విక్టరీలు కొట్టారు. కానీ ఫైనల్ మ్యాచ్​లో ప్లాన్స్​ను సరిగ్గా అమలు పర్చకపోవడం భారత్​ను దెబ్బతీసింది. ఇది ఓటమికి మరో ప్రధాన కారణం.

అటు బ్యాటింగ్​లో రాహుల్, కోహ్లీలు క్రీజులో కుదురుకున్నాక హిట్టింగ్ చేయాలని అనుకున్నారు. కానీ హిట్టింగ్ చేద్దామనుకున్న ప్రతిసారి టీమిండియా వికెట్లు కోల్పోయింది. బౌలింగ్​లో షమీని ముందే తీసుకొస్తే అదీ దెబ్బతీసింది. గ్రౌండ్ ఫీల్డింగ్​లో రన్స్ ఆపడంలో ఫెయిలయ్యారు. ఆసీస్​లా దగ్గర పెట్టకుండా దూరంగా ఫీల్డర్లను మోహరించి ఈజీగా సింగిల్స్ ఇచ్చేశారు. బ్యాటింగ్, బౌలింగ్​లో అనుకున్న ప్లాన్స్​ను అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో. మరి.. ఫైనల్ మ్యాచ్​లో భారత్ ఓటమికి కారణాలేమని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా పాలిట విలన్‌లా మారిన అంపైర్‌! ఈ ఫైనల్‌లో కూడా..