iDreamPost
android-app
ios-app

టీమిండియా 438 ఆలౌట్‌! బ్యాటింగ్‌లో పోటీ ఇస్తున్న విండీస్‌

  • Published Jul 22, 2023 | 8:19 AM Updated Updated Jul 22, 2023 | 8:19 AM
  • Published Jul 22, 2023 | 8:19 AMUpdated Jul 22, 2023 | 8:19 AM
టీమిండియా 438 ఆలౌట్‌! బ్యాటింగ్‌లో పోటీ ఇస్తున్న విండీస్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు టీమిండియా 438 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసిన భారత్‌.. రెండో రోజు మరో 150 పైచిలుకు రన్స్‌ చేసింది. తొలి రోజు 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌లో 76వ సెంచరీని, టెస్టుల్లో 29వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేసి రన్‌ అవుట్‌ అయ్యాడు.

ఇక కోహ్లీతో పాటు తొలి రోజు నాటౌట్‌గా నిలిచి జడేజా 61 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివరి వికెట్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 78 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి రాణించాడు. ఇషాన్‌ కిషన్‌(25), జయదేవ్‌ ఉనద్కట్‌(7), సిరాజ్‌(0), ముఖేస్‌ కుమార్‌(0) పరుగులు చేసి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన వెస్టిండీస్‌ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. తొలి టెస్ట్‌లో భారత బౌలింగ్‌ ఎటాక్‌ ముందు ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ ముందు ఏ మాత్రం నిలువలేకపోయిన విండీస్‌ బ్యాటర్లు రెండో టెస్ట్‌లో మాత్రం పోటీ ఇస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 86 పరుగులు చేసి రెండో రోజును ముగించింది. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ 37 పరుగులతో, కిర్క్ మెకెంజీ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు మరో ఓపెనర్‌ చంద్రపాల్‌ 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. బ్రాత్‌వైట్‌, చంద్రపాల్‌ జోడి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించడం విషయం. టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడి విండీస్‌కు మంచి ఆరంభాన్ని అందించింది.

తొలి టెస్ట్‌లో 12 వికెట్లతో చెలరేగిన అశ్విన్‌.. ఇప్పుడు 14 ఓవర్లు వేసి కూడా ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. చంద్రపాల్‌ వికెట్‌ జడేజాకు దక్కింది. సిరాజ్‌ 7, ఉనద్కట్‌ 6, ముఖేష్‌ కుమార్‌4 ఓవర్లు వేసినా వికెట్‌ దక్కలేదు. తొలి టెస్ట్‌తో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌, భారత్‌కు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి టీమిండియా బౌలర్లు మూడో రోజు తమ సత్తా చాటుతారో? లేక విండీస్‌ బ్యాటర్లు తమ మొండితనం చూపించి టెస్ట్‌ను కాపాడుకుంటారో? చూడాలి. మరి టీమిండియాకు విండీస్‌ బ్యాటర్లు ఎదురుతిరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సన్​రైజర్స్ హెడ్ ​కోచ్​గా వీరేంద్ర సెహ్వాగ్? ఇక హైదరాబాద్​కు తిరుగుండదు!