iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్‌ తీర్చుకున్న ప్రతీకారం గురించి తెలుసా? 4 ఏళ్ల పగతో.. చెప్పి మరీ కొట్టాడు!

  • Published Aug 27, 2024 | 6:22 PM Updated Updated Aug 27, 2024 | 8:28 PM

Virender Sehwag, Bangladesh, 2011 World Cup: భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మరుపురాని రివేంజ్‌ ఉంది. ఓ క్రికెటర్‌కు ఓ దేశానికి మధ్య జరిగిన యుద్ధం అది. వీరేంద్రుడు ఒక్కడే తీర్చుకున్న పగ అది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Virender Sehwag, Bangladesh, 2011 World Cup: భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మరుపురాని రివేంజ్‌ ఉంది. ఓ క్రికెటర్‌కు ఓ దేశానికి మధ్య జరిగిన యుద్ధం అది. వీరేంద్రుడు ఒక్కడే తీర్చుకున్న పగ అది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 27, 2024 | 6:22 PMUpdated Aug 27, 2024 | 8:28 PM
బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్‌ తీర్చుకున్న ప్రతీకారం గురించి తెలుసా? 4 ఏళ్ల పగతో.. చెప్పి మరీ కొట్టాడు!

క్రికెట్‌లో ఎంత మంది స్టార్లు ఉన్నా.. వీరేందర్‌ సెహ్వాగ్‌ భగభగ మండే సూర్యుడిలాంటోడు. అతని పేరు విన్నా, అతని ఆట చూసినా.. క్రికెట్‌ అభిమానులకు గూస్‌బమ్స్‌ వస్తాయి. క్రికెట్‌లో కల్ట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న ఏకైక క్రికెటర్‌. సచిన్‌ను చాలా మంది క్రికెట్‌ దేవుడిగా ఆరాధిస్తారు, గంగూలీని టీమిండియా తలరాత మార్చిన కెప్టెన్‌గా అనేక మంది అభిమానిస్తారు, ది వాల్‌ అంటూ రాహుల్‌ ద్రవిడ్‌ను ఇష్టపడేవారూ ఉన్నారు, ఇక ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు కూడా మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. కానీ.. ఈ స్టార్‌ క్రికెటర్లను అభిమానించే వారంతా.. సెహ్వాగ్‌ ఆట అంటే పడిచస్తారు. వన్డేలను టీ20ల్లా, టెస్టులను వన్డేల్లా.. అసలు ఫార్మాట్‌ ఏదైనా.. బాల్‌ కనిపిస్తే కొట్టేయాలి అనే కాన్సెప్ట్‌తో బరిలోకి దిగే ఏకైక క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌. అందుకే అతనంటే.. ఓ తరం బౌలర్లకు దడ.

రేపు మ్యాచ్‌ అంటే సచిన్‌కు ముందు రోజు రాత్రి నిద్రపట్టదు, కానీ, సెహ్వాగ్‌ మాత్రం ఫుల్లుగా నిద్రపోయి.. తెల్లారి లేచి ప్రత్యర్థి మీద పడిపోతాడు. ఇవన్నీ దాదాపు అందరికీ తెలిసినవే.. కానీ, సెహ్వాగ్‌ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పగ పడితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల పాటు అవమాన భారాన్ని గుండెల్లో మోస్తూ.. టైమ్‌ వచ్చినప్పుడు చెప్పిమరీ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? కాస్త కూడా కనికరం లేకుండా.. ఓ ‘వీరు’డు పిచ్చోడిలా కత్తిపట్టుకుని మీదపడితే ఎలా ఉంటుందో తెలుసా? బంగ్లాదేశ్‌పై పగే ప్రాణంగా బతికిన వీరేందర్‌ సెహ్వాగ్‌.. 2011లో చేసిన శివతాండవం గురించి, అంతకంటే ముందు అతనికి జరిగిన అవమానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బెస్ట్‌ టీమ్‌ అంటే.. 2007 వన్డే వరల్డ్‌ కప్‌దే!

ఈ మాట సాక్ష్యాత్తు వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో పాల్గొనబోయే జట్టు.. తాను చూసిన బెస్ట్‌ టీమ్‌ అని, 2003 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన టీమ్‌ కంటే కూడా ఈ జట్టు అద్భుతంగా ఉందని అన్నాడు సెహ్వాగ్‌. కానీ, తీరా టోర్నీ ఆరంభమైన తర్వాత.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. కేవలం మూడో వన్డే వరల్డ్‌ కప్‌ ఆడుతున్న జట్టు, అంతర్జాతీయ క్రికెట్‌లో పసికూన లాంటి బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో గంగూలీ ఒక్కడే హాఫ్‌ సెంచరీ సాధించాడు. మిగతా టీమ్‌ మొత్తం ఘోరంగా విఫలమైంది. సెకండ్‌ మ్యాచ్‌లో.. బెర్మోడాపై గెలిచినా.. తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకపై ఓటమితో టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇది ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో అత్యంత దారుణమైన సంఘటన.

Sehwag

వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే వెనుదిరగడంతో ఇండియాలో క్రికెట్‌ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భారత ప్రభుత్వం క్రికెటర్ల ఇళ్లకు, కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. భారత క్రికెట్‌ అభిమానులు పడే బాధ కంటే వందరెట్ల బాధను సెహ్వాగ్‌ అనుభవించాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన ఓటమి.. సెహ్వాగ్‌ను కలచివేసింది. ఎంతలా అంటే.. శ్రీలంకపై ఓటమి తర్వాత ఇండియాకు వెళ్లాల్సిన భారత జట్టు.. ఫ్లైట్‌ ఆలస్యం అవ్వడంతో రెండు రోజులు వెస్టిండీస్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఆ రెండు రోజులు సెహ్వాగ్‌ తన హోటల్‌ రూమ్‌ నుంచి బయటికి కాలేదు. కనీసం హౌజ్‌కీపింగ్‌ వాళ్లను కూడా తన రూమ్‌లోకి రానివ్వలేదు. రెండు రోజుల పాటు ఒక్కడే రూమ్‌లో బాధపడుతూ గడిపాడు. ఆ బాధ సెహ్వాగ్‌లో కోపంగా మారి.. ఆ తర్వాత పగలా రూపాంతరం చెందింది. బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్‌ అయిపోయాడు.

టీమ్‌లో ప్లేస్‌ పోయింది..!

ఒక వైపు బంగ్లాదేశ్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న వీరేందర్‌ సెహ్వాగ్‌కు బీసీసీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిబాట పట్టడంతో భారత క్రికెట్‌ అభిమానులు.. క్రికెటర్ల పోస్టర్లు కాల్చుతూ.. నిరసనలు చేశారు. ఎక్కువగా సెహ్వాగ్‌ను టార్గెట్‌ చేశారు. ఎందుకంటే.. 2005 నుంచి వన్డేల్లో సెహ్వాగ్‌ ఫామ్‌ సరిగ్గా లేదు. 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో బెర్మోడాపై సెంచరీతో చెలరేగినా.. శ్రీలంకపై విఫలం అయ్యాడు. అందుకే క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెహ్వాగ్‌పై మండిపడ్డారు. దాంతో.. బీసీసీఐ సెహ్వాగ్‌ను టీమిండియా నుంచి తప్పించాలని డిసైడ్‌ అయింది. కానీ, ఆశ్చర్యంగా వన్డేల నుంచి కాకుండా టెస్ట్‌ టీమ్‌ నుంచి సెహ్వాగ్‌ను తప్పించింది. కానీ, అప్పటికే టెస్టుల్లో సెహ్వాగ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో.. బెస్ట్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ నిర్ణయం అందర్ని షాక్‌కి గురి చేసింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2007లో బంగ్లాదేశ్‌పై ఎదురైన ఓటమికి ప్రతీకారంగా.. టీమిండియా వరల్డ్‌ కప్‌ టోర్నీ తర్వాత బంగ్లా టూర్‌కు వెళ్లింది. సెహ్వాగ్‌ కూడా వన్డే టీమ్‌లో ఉన్నాడు. కానీ, సరిగ్గా రాణించలేదు. దాంతో.. అన్ని ఫార్మాట్స్‌లోనూ చోటు కోల్పోయాడు వీరు.

Sehwag

డొమెస్టిక్‌ క్రికెట్‌తో ఫ్రెష్‌గా మొదలెట్టాడు..!

బ్యాడ్‌ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన సెహ్వాగ్‌.. మళ్లీ భారత జట్టులో చోటు కోసం డొమెస్టిక్‌ క్రికెట్‌ను నమ్ముకున్నాడు. దేశవాళి లీగ్స్‌లో ఆడి అదరగొట్టాడు. 2007-08లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఆ టైమ్‌లో అనిల్‌ కుంబ్లే భారత టెస్ట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌ కోసం తన టీమ్‌లో సెహ్వాగ్‌ ఉండాలని పట్టుబట్టాడు అనిల్‌ కుంబ్లే. దాంతో.. సెహ్వాగ్‌ను ఆ టూర్‌ కోసం ఎంపిక చేశారు. ఆ టూర్‌ క్రికెట్‌ హిస్టరీలో ‘మంకీ గేట్‌’ సిరీస్‌గా నిలిచిపోయింది. ఆ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన సెహ్వాగ్‌.. నాలుగో టెస్టులో టీమిండియాను ఓటమి నుంచి రక్షించాడు. 72 యావరేజ్‌తో బ్యాటింగ్‌ చేసి.. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. ఆ వెంటనే సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 319 పరుగులతో తన రెండో ట్రిపుల్‌ సెంచరీ బాదేశాడు. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌లా.. మరోసారి ప్రపంచ క్రికెట్‌కు అసలైన సెహ్వాగ్‌ను పరిచయం చేశాడు. అప్పటి వరకు ప్రతి బంతిని కొట్టే సెహ్వాగ్‌.. మంచి బాల్‌కు రెస్పెక్ట్‌ ఇవ్వడం కూడా నేర్చుకున్నాడు. దాంతో.. ‘సెహ్వాగ్‌ 2.ఓ’ చూసింది ప్రపంచ క్రికెట్‌ లోకం.

2011 వన్డే వరల్డ్‌ కప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌..!

2007 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత జట్టు చోటు కోల్పోయిన ఆటగాడు.. నెక్ట్స్‌ వరల్డ్‌ కల్లా ఆ టోర్నీకే బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యాడు. అది ఒక్క సెహ్వాగ్‌కే సాధ్యమైంది. అయితే.. అంతకంటే ముందు.. అంటే 2011 వన్డే వరల్డ్‌ కప్‌ కంటే ముందు 2010 చివర్లో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఆ సిరీస్ ఆరంభానికి ముందు ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన సెహ్వాగ్‌ తన మాటలతో బంగ్లాదేశ్‌లో అగ్గిరాజేశాడు. 2007 వన్డే వరల్డ్‌ కప్‌లా బంగ్లాదేశ్‌ ఈ టెస్టు సిరీస్‌లో కూడా అప్‌సెట్‌ చేస్తుందని భావిస్తున్నారా? అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నో.. బంగ్లాదేశ్‌ వన్డేల్లో సర్‌ప్రైజ్‌ చేస్తుందేమో కానీ, టెస్టుల్లో చేయలేదు. బంగ్లాదేశ్‌ ఒక ఆర్డినరీ టీమ్‌, వాళ్లు కనీసం మా 20 వికెట్లు తీయలేరు’ అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. అది విని అక్కడున్న వారికి దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్‌ అయింది. బంగ్లాదేశ్‌కి వచ్చి, బంగ్లాదేశీల ముందు.. మీ జట్టు ఒక ఆర్డినరీ టీమ్‌ అని చెప్పడం వాళ్లకు కోపం తెప్పించింది. సెహ్వాగ్‌పై బంగ్లాదేశ్‌లో విమర్శల వర్షం కురిసింది. అప్పటి బంగ్లాదేశ్‌ కోచ్‌ జామీ సిడాన్స్ మాట్లాడుతూ.. సెహ్వాగ్‌ మైక్‌కు దూరంగా ఉంటే మంచిది అని అన్నాడు. సెహ్వాగ్‌ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తో సీన్‌ మొత్తం మారిపోయింది.

Sehwag

రెండు టెస్టుల ఫ్రెండ్లీ సిరీస్‌ కాస్తా.. రెండు దేశాల మధ్య యుద్ధంలా మారిపోయింది. బంగ్లాదేశ్‌ అభిమానులంతా సెహ్వాగ్‌పై కోపంతో ఊగిపోయారు. అప్పటి వరకు ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ అంటే ఎలా ఉండేదో.. ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ అంతకు మించి అనేలా మారిపోయింది పరిస్థితి. అందుకు కారణం సెహ్వాగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌. సెహ్వాగ్‌ చెప్పినట్లే ఇండియాకు టెస్టుల్లో బంగ్లాదేశ్‌ పోటీ ఇవ్వలేకపోయింది. 2-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది భారత్‌. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2011లో ఓపెనింగ్‌ మ్యాచ్‌గా ఉన్న ఇండియా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ను ఆపి, టోర్నీపై ఇంట్రెస్ట్‌ పెంచేలా వేరే మ్యాచ్‌ను ఓపెనింగ్‌ మ్యాచ్‌లా నిర్వహించాలని ఐసీసీ అనుకుంటోంది. కానీ, ఇండియా-బంగ్లాదేశ్‌ టెస్ట్‌ సిరీస్‌కి ముందు సెహ్వాగ్‌ చేసిన కామెంట్స్‌తో భారీ హైప్‌ వచ్చింది. దీంతో వరల్డ్‌ కప్‌ టోర్నీకి అదిరిపోయే ఓపెనింగ్‌ మ్యాచ్‌ దొరికిందంటూ.. ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఫస్ట్‌గా మ్యాచ్‌గా భారీ పబ్లిసిటీ చేసింది ఐసీసీ. ఇక పేపర్లలో, టీవీల్లో.. రివేంజ్‌ రివేంజ్‌ అంటూ వార్తలు వచ్చాయి.

చెప్పిమరీ కొట్టాడు..!

వన్డే వరల్డ్‌ కప్‌ 2011 టోర్నీ ప్రారంభానికి ముందు మరోసారి మైక్‌ అందుకున్నాడు సెహ్వాగ్‌. 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌పై ఎదురైన ఓటమిని దాదాపు అంతా మర్చిపోయారు కానీ, సెహ్వాగ్‌ దాన్ని తిరిగి గుర్తు చేశాడు. ఈ సారి బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. నేను 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో.. సెహ్వాగ్‌ 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడంటూ.. ప్రచారం హోరెత్తిపోయింది. అయితే.. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో జరిగింది. సెహ్వాగ్‌ రెచ్చగొట్టే మాటలతో.. మీర్‌పూర్‌ స్టేడియం బంగ్లాదేశ్‌ అభిమానులతో కిక్కిరిసిపోయింది. దాదాపు 25 వేల కంటే ఎక్కువ మంది స్టేడియాన్ని ముంచెత్తారు. ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వస్తున్న హైప్‌ చూసి.. బంగ్లా ప్రభుత్వం ఏకంగా 4 రోజులు సెలవు ప్రకటించింది. చూస్తుండగానే మ్యాచ్‌ స్టార్ట్‌ అయిపోయింది.

బౌలింగ్‌కు స్వర్గధామం లాంటి మీర్‌పూర్‌ పిచ్‌పై టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ వస్తుందనే నమ్మకంతో తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌. ఆ పిచ్‌పై ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ యావరేజ్‌ స్కోర్‌ 222 పరుగులు మాత్రమే. దీంతో.. అన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులు సంబరాలు మొదలెట్టేశారు. టీమిండియాలో మాత్రం.. తుఫాన్‌ వచ్చే ముందు ఉండే నిశ్శబ్ధం ఆవహించింది. కానీ, సెహ్వాగ్‌ అనే తుఫాన్‌ మీర్‌పూర్‌ను కమ్మేయనున్న విషయం పాపం.. అక్కడున్నవారికి తెలియదు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వీరేందర్‌ సెహ్వాగ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

Sehwag

బంగ్లాదేశ్‌ బౌలర్‌ సైఫుల్‌ ఇస్లామ్‌ వేసిన ఫస్ట్‌ బాల్‌ను బౌండరీ కొట్టి.. తన ఉద్దేశం క్లియర్‌గా చెప్పేశాడు సెహ్వాగ్‌. తాను ఈ మ్యాచ్‌ గెలవడానికి మాత్రమే రాలేదని.. బంగ్లాదేశ్‌ను చీల్చిచెండాడేందుకు వచ్చాననే విషయాన్ని ఫస్ట్‌బాల్‌తోనే స్పష్టం చేశాడు. తొలి ఓవర్‌లోనే 12 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్‌లో కూడా 12 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్‌లో సచిన్‌ రెండు ఫోర్లతో 3 ఓవర్లలోనే 32 రన్స్‌ చేసింది ఇండియా. 29 బంతుల్లో 28 రన్స్‌ చేసి సచిన్‌ అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గౌతమ్‌ గంభీర్‌ 39 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇలా ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో వీరేందర్‌ సెహ్వాగ్‌ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుర్రాడు విరాట్‌ కోహ్లీ, సెహ్వాగ్‌కు జతకలిశాడు. ఇద్దరు కలిసి.. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. సెహ్వాగ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ మార్క్‌ దాటేశాడు. మొత్తంగా 140 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సులతో 175 పరుగులు చేసి.. బంగ్లా బౌలర్ల కళ్ల నుంచి నీళ్లు కాదు.. రక్తం కారేలా చేశాడు.

Sehwag

సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు.. 25 వేల మంది బంగ్లా అభిమానులతో నిండిన మీర్‌పూర్‌ స్టేడియం సైలెంట్‌గా ఉండిపోయింది. సెహ్వాగ్‌ విజృంభణతో 222 యావరేజ్‌ స్కోర్‌ ఉండే గ్రౌండ్‌లో టీమిండియా ఏకంగా 370 పరుగులు చేసి.. బంగ్లాదేశ్‌ ఓ ‘పసికూన’ అనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అదే మ్యాచ్‌లో సెహ్వాగ్‌తో పాటు విరాట్‌ కోహ్లీ సైతం సెంచరీ చేసి.. సెహ్వాగ్‌ ప్రతీకారంలో పాలు పంచుకున్నాడు. 83 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేశాడు. సెహ్వాగ్‌ చెప్పిమరీ బంగ్లాదేశ్‌ను ఊచకోత కోశాడు. కానీ, ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌ మూడో బంతికి అవుట్‌ అయ్యాడు. అప్పటికే టీమిండియా స్కోర్‌ 350 దాటేసింది. తర్వాత భారత బౌలర్లు.. బంగ్లాను 283 పరుగులకే పరిమితం చేయడంతో.. 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. ఆ ప్రతీకారంలో సింహభాగం సెహ్వాగ్‌దే. 4 ఏళ్లుగా అనుభవిస్తున్న బాధను.. విధ్వంసకర బ్యాటింగ్‌తో తీర్చుకున్నాడు. అప్పటి నుంచి సెహ్వాగ్‌ పేరు వింటేనే.. బంగ్లాదేశ్‌ క్రికెటర్లు, అభిమానులు ఉలిక్కిపడుతుంటారు. ఒక అవమానం.. కఠిన పరిస్థితులు దాటి.. ప్రతీకారం తీర్చుకున్న సెహ్వాగ్‌ స్టోరీ ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి. అందుకే అంటూ ఉంటారు.. సెహ్వాగ్‌ ఆట, పెద్దపులి వేటలా ఉంటుందని. మరి 2007 నుంచి 2011 వరకు సెహ్వాగ్‌ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.