iDreamPost
android-app
ios-app

World Cup: కోహ్లీకి గోల్డ్‌ మెడల్‌! ఆసీస్‌పై బ్యాటింగ్‌ చేసినందుకు కాదు..

  • Author singhj Published - 12:01 PM, Mon - 9 October 23
  • Author singhj Published - 12:01 PM, Mon - 9 October 23
World Cup: కోహ్లీకి గోల్డ్‌ మెడల్‌! ఆసీస్‌పై బ్యాటింగ్‌ చేసినందుకు కాదు..

వన్డే వరల్డ్ కప్​-2023లో భారత్ ఆడాల్సిన ఫస్ట్ మ్యాచ్. ఎదురుగా ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థి. భీకరమైన ఫామ్​లో ఉన్న యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ టీమ్​లో లేడు. అనారోగ్యంతో బాధపడుతున్న గిల్ లేకపోవడంతో ఓపెనింగ్ పొజిషన్​లో ఇషాన్ కిషన్ ఆడటం ఖాయమైంది. అతడు ఎలా ఆడతాడోననే సందేహం. సొంతగడ్డపై ఒత్తిడిలో ప్లేయర్లు అందరూ ఎలా పెర్ఫార్మ్ చేస్తారోననే టెన్షన్. ఇలా కొన్ని సందేహాలు, మరికొన్ని అనుమానాల మధ్య ఆదివారం నాడు కంగారూ జట్టుతో జరిగిన మ్యాచ్​లో బరిలోకి దిగింది రోహిత్ సేన. కానీ ఎక్స్​పెక్టేషన్స్​కు మించి పెర్ఫార్మ్ చేసింది. స్టార్లతో నిండిన ఆసీస్ బ్యాటింగ్​ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​లో రెండు రన్స్​కే మూడు వికెట్స్ పడిపోయినా పట్టువదలకుండా ఆడి మ్యాచ్​ను చేజిక్కించుకుంది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 రన్స్​కు ఆలౌటైంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ కలసి ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. అనంతరం ఛేదనను మొదలుపెట్టిన టీమిండియా.. 41.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. భారత్ విజయంలో సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. రోహిత్, ఇషాన్, అయ్యర్​లు గోల్డెన్ డక్​గా  వెనుదిరగడంతో చిన్న టార్గెట్​ను కూడా భారత్ ఛేజ్ చేయలేదేమో అనే డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ టైమ్​లో గనుక మరో వికెట్ పడుంటే టీమిండియా చేతి నుంచి మ్యాచ్ చేజారేది.

క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ-రాహుల్​లు అసాధారణ బ్యాటింగ్​తో టీమ్​ను గట్టెక్కించారు. అయితే ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ కోహ్లీ అదరగొట్టాడు. బుమ్రా బౌలింగ్​లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్​ను అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఆ క్యాచ్​తో పాటు గ్రౌండ్​ ఫీల్డింగ్​లోనూ పాదరసంలా కదులుతూ విలువైన రన్స్ కాపాడాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్​లో కోచ్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్​మెంట్ అతడ్ని సత్కరించింది. కోహ్లీ ఫీల్డింగ్​ను మెచ్చుకుంటూ గోల్డ్ మెడల్​ను అందించారు. ఈ పతకాన్ని అందుకున్న విరాట్ ఫుల్ సెలబ్రేషన్స్​లో మునిగిపోయాడు. కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: వాళ్లిద్దరి వల్లే ఈ విజయం.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై రోహిత్ ప్రశంసలు!