Hardik Pandya: హార్దిక్​ పాండ్యా ప్లేస్​లో యంగ్ ఆల్​రౌండర్.. ఎవరీ అర్షిన్ కులకర్ణి?

  • Author singhj Published - 04:58 PM, Sat - 9 December 23

స్టార్ ఆల్​రౌండ్ హార్దిక్ పాండ్యా ప్లేస్​లో భారత జట్టులోకి దూసుకొచ్చేందుకు ఒక ఆటగాడు రెడీ అవుతున్నాడు.

స్టార్ ఆల్​రౌండ్ హార్దిక్ పాండ్యా ప్లేస్​లో భారత జట్టులోకి దూసుకొచ్చేందుకు ఒక ఆటగాడు రెడీ అవుతున్నాడు.

  • Author singhj Published - 04:58 PM, Sat - 9 December 23

ప్రస్తుతం టీమిండియాను వేధిస్తున్న సమస్యల్లో పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్ ఒకటి. ఇది ఇప్పుడే మొదలైన ప్రాబ్లమ్ కాదు. చాలా ఏళ్లుగా ఇది భారత్​ను ఇబ్బంది పెడుతోంది. ఇర్ఫాన్ పఠాన్​ తర్వాత ఆ స్థాయిలో ఆల్​రౌండర్​ మళ్లీ దొరకలేదు. పర్ఫెక్ట్ స్వింగ్, సీమింగ్ డెలివరీస్​తో వికెట్లు తీస్తూ.. బ్యాట్​తో విలువైన రన్స్ చేసేవాడు పఠాన్. అలాంటోడ్ని మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ వచ్చి చెడగొట్టాడు. ఇర్ఫాన్​ను ఓపెనింగ్​కు పంపాడు. దీంతో అతడి బ్యాటింగ్ దెబ్బతిన్నది. ఆ తర్వాత బౌలింగ్​లోనూ రిథమ్ కోల్పోయి క్రమంగా టీమ్​కు దూరమయ్యాడు. చాన్నాళ్ల తర్వాత హార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియాకు మంచి ప్రత్యామ్నాయం దొరికాడు. నిఖార్సయిన పేస్ బౌలింగ్​కు తోడు హార్డ్ హిట్టింగ్​తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు హార్దిక్.

బ్యాటింగ్, బౌలింగ్​లోనే గాక ఫీల్డింగ్​లోనూ అదరగొడుతూ టీమ్​లో నమ్మకమైన ప్లేయర్​ స్థాయికి ఎదిగాడు హార్దిక్ పాండ్యా. అయితే అతడ్ని గాయాలు ఒకదాని తర్వాత ఒకటి వేధిస్తూ వస్తున్నాయి. ఒక ఇంజ్యురీ నుంచి బయటపడేలోపే మరో ఇంజ్యురీతో టీమ్​కు దూరమవుతున్నాడీ ఆల్​రౌండర్. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్​లోనూ బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో గాయం బారిన పడి మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)లో అతడు ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. పాండ్యా ఇలా వరుస గాయాల బారిన పడుతుండటంతో అతడి ప్లేసులో ఎవరైనా యంగ్ ఆల్​రౌండర్ దొరికితే తీసుకోవాలనే ఆలోచనల్లో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఉందట.

హార్దిక్​కు రీప్లేస్​మెంట్​ కోసం వెతుకుతున్న బీసీసీఐకి ఒక మంచి ఆప్షన్ దొరికినట్లే కనిపిస్తోంది. అచ్చం పాండ్యా లాంటి బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్, అదే దూకుడైన కెప్టెన్సీతో ఓ ప్లేయర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అతడు మహారాష్ట్ర యంగ్ సెన్సేషన్, భారత జట్టు అండర్-19 కెప్టెన్ అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం ఆసియా కప్​లో అండర్-19 టీమ్​కు సారథ్యం వహిస్తున్న అతడు అరంగేట్ర మ్యాచ్​లోనే ఆకట్టుకున్నాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో కులకర్ణి సత్తా చాటాడు. బౌలింగ్​లో 3 వికెట్లు పడగొట్టిన అర్షిన్.. బ్యాటింగ్​లోనూ 70 రన్స్​తో నాటౌట్​గా నిలిచి టీమిండియాకు ఫస్ట్ విక్టరీని అందించాడు. ఎంతో ప్రతిభ ఉన్న ఈ యంగ్ ప్లేయర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని షోలాపూర్​లో పుట్టిన 18 ఏళ్ల అర్షిన్ తండ్రి పేరు అతుల్ కులకర్ణి. వృత్తి రీత్యా డాక్టర్ అయిన అతుల్ క్రికెటర్ అయ్యేందుకు చాలా విధాలుగా ప్రయత్నించాడు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని ఆయన డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అర్షిన్​కు చిన్నతనం నుంచే క్రికెట్ టెక్నిక్స్ నేర్పించాడు. మెరుగైన క్రికెట్ కోసం ఆయన తన మకాంను పూణేకు షిప్ట్ చేశాడు. అక్కడి కాడెన్స్ అకాడమీలోని అర్షిన్ కులకర్ణి తన స్కిల్స్​ను మెరుగుపర్చుకున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో టాప్ స్కోరర్​గా నిలిచిన అర్షిన్.. మహారాష్ట్ర సీనియర్ టీమ్​లో ప్లేస్ దక్కించుకున్నడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్​లోనూ దుమ్మురేపి అండర్-19 ఆసియా కప్ టీమ్​కు సెలక్ట్ అయ్యాడు. అతడు ఇలాగే రాణిస్తూ పోతే ఫ్యూచర్​లో హార్దిక్ పాండ్యా ప్లేస్​లో భారత సీనియర్ టీమ్​లోకి రావడం పక్కా అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. హార్దిక్​కు పోటీగా టీమ్​లోకి దూసుకురావాలని చూస్తున్న అర్షిన్​ పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీతో గొడవపై మళ్లీ రియాక్ట్ అయిన గంభీర్.. అది తన హక్కంటూ..!

Show comments