ఏ ఆటగాడైనా ఎప్పటికైనా రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. ఎంతటి ప్లేయర్ అయినా సరే.. ఏదో ఒక రోజు గేమ్ నుంచి నిష్క్రమించాల్సిందే. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం ఈ విషయంలో అనూహ్యంగా నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. జట్టుకు ఇంకా సేవలు అందించే సత్తా తమలో ఉన్నా కూడా కొనసాగకుండా షాక్‌కు గురిచేస్తారు. ఇప్పడో స్టార్ క్రికెటర్ ఇదే పని చేశాడు. బంగ్లాదేశ్ వన్డే టీమ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌కు ఇంకా 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ టైమ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడతను.
తమీమ్ ఇక్బాల్ అనూహ్య నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కెరీర్‌కు సంబంధించిన ఇంత కీలక నిర్ణయాన్ని ఇలా హఠాత్తుగా తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ ఇవ్వడం అంటే జట్టును మధ్యలో వదిలేసి వెళ్లిపోవడమేనని చెబుతున్నారు. తమీమ్ చేసింది కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక, 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు తమీమ్ ఇక్బాల్. 16 ఏళ్ల కెరీర్లో బంగ్లాదేశ్ తరఫున 69 టెస్టులతో పాటు 238 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 10 సెంచరీలు సహా 5,082 రన్స్ చేశాడు.
వన్డేల్లో తమీమ్ ఇక్బాల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో 14 సెంచరీలతో 8,224 రన్స్ చేశాడతను. పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 1,758 రన్స్ చేశాడు. బంగ్లా టీమ్ కెప్టెన్‌గా 2020లో బాధ్యతలు తీసుకున్నాడు తమీమ్. సారథిగా 15 మ్యాచుల్లో నేతృత్వం వహించి, జట్టుకు 8 విజయాలు అందించాడు. గతేడాది జనవరిలో టీ20ల నుంచి ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకున్నాడు తమీమ్. ఆ తర్వాత జూన్‌లో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ జట్టు తరఫున 10 వేలకు పైగా రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు తమీమ్ ఇక్బాల్. అలాగే 14 వేలకు పైగా ఇంటర్నేషనల్ రన్స్ చేసిన ఏకైక బంగ్లా బ్యాటర్‌గానూ ఉన్నాడు. ఆ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ కూడా తమీమ్ కావడం విశేషం.
🚨 JUST IN: Tamim Iqbal has announced his retirement from international cricket pic.twitter.com/hyJ7XfhQ2R
— Cricbuzz (@cricbuzz) July 6, 2023