iDreamPost
android-app
ios-app

మాజీ ఛాంపియన్లను వణికించిన ఆఫ్ఘనిస్థాన్‌! వాట్ ఏ మ్యాచ్‌

  • Published Sep 06, 2023 | 8:14 AM Updated Updated Sep 06, 2023 | 9:16 AM
  • Published Sep 06, 2023 | 8:14 AMUpdated Sep 06, 2023 | 9:16 AM
మాజీ ఛాంపియన్లను వణికించిన ఆఫ్ఘనిస్థాన్‌! వాట్ ఏ మ్యాచ్‌

ఆసియా కప్‌ 2023లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సైతం అందించలేని అసలు సిసలైన క్రికెట్‌ మజాను శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అందించింది. నరాలు తెగే ఉత్కంఠ, భారీ ట్విస్టులు.. అబ్బో ఓ భారీ థ్రిల్లర్‌ సినిమాను మించిపోయేలా సాగింది ఈ మ్యాచ్‌. ఆఫ్ఘనిస్థాన్‌ పోరాటానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంక.. ఈ ఆసియా కప్‌ టోర్నీ నుంచి ఇంటికి పోయేలా కనిపించింది. కానీ, ఒత్తిడికి లోనైన ఆఫ్ఘనిస్థాన్‌.. అద్భుతంగా పోరాడినా సూపర్‌ 4కి క్వాలిఫై కాలేకపోయింది. అయితే.. ఆఫ్ఘాన్‌ ఆడిన తీరుపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మొహమ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌ సృష్టించిన విధ్వంసం లంకేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చివర్లో మరో అవకాశం ఉన్నా.. దాని గురించి రషీద్‌కు అవగాహన లేకపోవడంతో క్వాలిఫై కాకపోగా.. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్. మొత్తానికి క్రికెట్‌ అభిమానులకు ఈ రెండు జట్లు. కలిసి ఓ సూపర్‌ డూపర్‌ మ్యాచ్‌ను అందించాయి.

శ్రీలంక మ్యాచ్‌ గెలిస్తే.. నేరుగా సూపర్‌ 4కు వెళ్తుంది. ఒకవేళ ఆఫ్ఘాన్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. ఇలాంటి ఈక్వేషన్స్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ 4కు క్వాలిఫై కావాలంటే.. 292 పరుగుల టార్గెట్‌ను 50 ఓవర్లలో కాకుండా 37.1 ఓవర్లలోనే ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా గెలిస్తేనే వాళ్ల నెట్‌ రన్‌రేట్‌ శ్రీలంక కంటే మెరుగవుతుంది. ఈ దశలో ఆరంభంలో ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది ఆఫ్ఘాన్‌. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్‌(4), ఇబ్రహీం జద్రాన్‌ (7) త్వరగానే అవుటైపోయారు. కొద్ది సేపటికి గుల్బుద్దీన్‌ నైబ్‌ సైతం 22 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్‌ షాహిదీతో కలిసి రహమత్‌ షా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 121 పరుగుల వద్ద షా అవుట్‌ అవ్వడంతో ఆఫ్ఘాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

ఈ టైమ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన నబీ.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లతో లంకేయులను వణికించాడు. సునామీ వేగంతో 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌ తరుఫున వన్డేల్లో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. నబీ ఉన్నంత సేపు ఆఫ్ఘానిస్థాన్‌ కచ్చితంగా సూపర్‌ 4కు క్వాలిఫై అవుతుందని అనిపించింది. అలా ఆడుతున్నాడు మరీ. పైగా వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 9వ నంబర్‌ బ్యాటర్‌ వరకు డెప్త్‌ ఉండటంతో శ్రీలంక టోర్నీ నుంచి ఇంటికి వెళ్లేలా కనిపించింది. కానీ, లంక కెప్టెన్‌ చేసిన అద్భుతమైన బౌలింగ్‌ మార్పులతో జట్టుకు ఊపిరిపోశాడు. ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌లో తీక్షణ బౌలింగ్‌లో నబీ అవుట్‌ అవ్వడంతో మ్యాచ్‌లో భారీ ట్విస్ట్‌ వచ్చింది. 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 65 పరుగులు చేసిన నబీ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జకత్‌ సైతం 13 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్సులతో 22 పరుగులు చేసి.. డేంజరస్‌గా మారాడు.

కానీ, 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్న బౌలర్‌ను అనూహ్యంగా ఎటాక్‌లోకి తెచ్చిన లంక కెప్టెన్‌ షనక.. ఊహించని ఫలితం రాబట్టాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే జకత్‌, హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్న కెప్టెన్‌ షాహీదీ ఇద్దరూ అవుట్‌ అయ్యారు. అయినా కూడా ఆఫ్ఘాన్‌ వద్ద ఇంకా బ్యాటింగ్‌ మిగిలే ఉంది. పైగా ఇద్దరూ డేంజర్‌ బ్యాటర్లు. నజీబ్‌ ఉల్లా జద్రాన్‌, రషీద్‌ ఖాన్‌.. అనుకున్నట్లే ఇద్దరూ భారీ సిక్సులతో లంకపై విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ 4కు క్వాలిఫై అవ్వాలంటే 13 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన సమయంలో రజిత బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ తొలి బంతికే బౌండరీ బాదాడు. రెండో బంతికి సింగిల్‌ తీసి జద్రాన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. మూడో బంతికి భారీ సిక్స్‌.. ఇంకేముంది.. ఆఫ్ఘాన్‌ క్వాలిఫై అయిపోయినట్లేనని అంతా భావించారు. కానీ, ఇక్కడ మళ్లో ట్విస్ట్‌ ఆ తర్వాతి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు జద్రాన్‌. ఆన్‌ సైడ్‌ ఆడిన బిగ్‌ షాట్‌ను బౌండరీ లైన్‌ వద్ద సబ్‌స్టిట్యూడ్‌ ఫీల్డర్‌ హేమంత్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో జద్రాన్‌ అవుట్‌ అయ్యాడు.

అయినా కూడా రషీద్‌ ఖాన్‌ ఉన్నాడుగా అనుకున్నారు. మొత్తానికి 7 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో రషీద్‌ ఖాన్‌ తర్వాత 6 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు. ఇక ఒక్క బంతికి మూడు పరుగులు కావాలి. స్ట్రైక్‌లో ముజీబ్‌ ఉర్‌ రహెమన్‌ ఉన్నాడు. ధనుంజయ్‌ డీసిల్వా బౌలింగ్‌లో ముజీబ్‌ బౌండరీ కోసం ప్రయత్నించాడు. కానీ, ఆ షాట్‌ నేరుగా లాంగ్‌ ఆన్‌లో ఉన్న కెప్టెన్‌ షనక చేతుల్లోకి వెళ్లింది. అంతే ఆఫ్ఘాన్‌ ఆటగాళ్లు ముఖాల్లో శోకం. లంక ఆటగాళ్ల కళ్లల్లో సంతోషం. రషీద్‌ ఖాన్‌ అయితే గ్రౌండ్‌లో అలా మొకాళ్లపై కూర్చుండిపోయాడు. అప్పటికే 37 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్థాన్‌ 289 పరుగులు చేసింది. ఇక మ్యాచ్‌ విజయానికి 77 బంతుల్లో 3 పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్‌ ఉంది. కనీసం మ్యాచ్‌ అయినా ఆఫ్ఘనిస్థాన్‌ గెలుస్తుందనుకుంటే.. చివరి బ్యాటర్‌గా వచ్చిన షారుఖీ పరుగులేమీ చేయకుండా వికెట్‌ సమర్పించుకున్నాడు.

అయితే.. 37.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపోయినా.. అదే ఓవర్‌లో ఒక్క సిక్స్‌ కొట్టినా ఆఫ్ఘాన్‌ మెరుగైన రన్‌రేట్‌తో సూపర్‌ ఫోర్‌కు చేరేది. విజయానికి మూడు పరుగులు అవసరమైన చోట.. షారుఖీ ఒక్క సింగిల్‌ తీసి.. రషీద్‌కు స్ట్రైక్‌ ఇచ్చి ఉంటే.. రషీద్‌ సిక్స్‌తో మ్యాచ్‌ గెలిపించినా ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌ గెలవడంతో పాటు సూపర్‌ 4కు క్వాలిఫై అయ్యేది. అయితే ఈ విషయం తెలియని రషీద్‌ ఖాన్‌. 37.1 ఓవర్లలో టార్గెట్‌ను కొట్టలేకపోయామనే బాధలోనే ఉండిపోయాడు. ఈ లోపు రెండు బంతులు ఆడిన ఫారూఖీ.. తాను ఎదుర్కొన్న మూడో బంతికి లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. క్వాలిఫై కాలేకపోయిన బాధలో ఉన్న ఆఫ్ఘాన్‌ బాధను రెట్టింపు చేస్తూ.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ చేజారింది. ఇలా అద్భుతమైన పోరాటం, ఉత్కంఠ, ట్విస్టులతో మ్యాచ్‌ సూపర్‌గా సాగింది. మొత్తానికి గ్రూప్‌ ఏ నుంచి పాకిస్థాన్‌, ఇండియా, గ్రూప్‌ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ సూపర్‌ 4కి చేరాయి. మరి లంక-ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: లక్ష్మణ్‌, రాయుడు.. ఇప్పుడు తిలక్‌! తరాలు మారినా అదే అన్యాయం!