iDreamPost

లక్ష్మణ్‌, రాయుడు.. ఇప్పుడు తిలక్‌! తరాలు మారినా అదే అన్యాయం!

  • Published Sep 05, 2023 | 3:10 PMUpdated Sep 05, 2023 | 3:10 PM
  • Published Sep 05, 2023 | 3:10 PMUpdated Sep 05, 2023 | 3:10 PM
లక్ష్మణ్‌, రాయుడు.. ఇప్పుడు తిలక్‌! తరాలు మారినా అదే అన్యాయం!

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో బీసీసీఐ 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించింది. ఆసియా కప్‌లో ఆడుతున్న జట్టునే పెద్దగా మార్పులు లేకుండా వరల్డ్‌ కప్‌ కోసం కూడా ఎంపిక చేశారు. ఆసియా కప్‌కు ఎంపికైన తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ, సంజు శాంసన్‌(స్టాండ్‌బై)కు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. వరల్డ్‌ కప్‌ కోసం సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయడంతో పాటు, చాహల్‌, అశ్విన్‌లను ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

తెలుగువాళ్లకు అన్యాయం..
వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కని ప్లేయర్లలో ముఖ్యంగా తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మ గురించి మాట్లాడుకోవాలి. భారత జట్టులోకి వచ్చీ రావడంతోనే అద్భుత ప్రదర్శన కనబర్చిన తిలక్‌ వర్మ.. టీమ్‌కు ఎంతో కీ ప్లేయర్‌గా మారే టాలెంట్‌ ఉన్నోడు. పైగా జట్టులో లెఫ్ట్‌ హ్యాండర్ల కొదవ ఉండటంతో తిలక్‌ వర్మకు కచ్చితంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కుతుందని, అందుకే ఆసియా కప్‌కి కూడా ఎంపిక చేశారని అంతా భావించారు. ఆసియా కప్‌కు తిలక్‌ ఎంపికను సైతం అంతా సమర్థించారు. కానీ, అనూహ్యంగా అతన్ని వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోలేదు.

ఈ నిర్ణయంతో క్రికెట్‌ అభిమానులతో పాటు క్రికెట్‌ నిపుణులు సైతం షాక్‌ అవుతున్నారు. అయినా తెలుగు క్రికెటర్లకు ఇప్పుడే కాదు.. తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని అంటున్నారు. 2003 వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు లెజెండరీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వన్డేల్లో లక్ష్మణ్‌ ఆట నుంచి కచ్చితంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటాడని అంతా భావించారు. కానీ, లక్ష్మణ్‌ను వరల్డ్‌ కప్‌లోకి తీసుకోలేదు. అప్పుడు లక్ష్మణ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందనే వాదన బలంగా వినిపించినా.. టీమిండియా ఫైనల్స్‌ వరకు వెళ్లడంతో లక్ష్మణ్‌కు జరిగిన అన్యాయం పెద్దగా ఎలివేట్‌ కాలేదు.

అలాగే 2019 వన్డే వరల్డ్‌ కప్‌ కోసం మరో తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడుని ఎంపిక చేయకపోవడం కూడా పెను దుమారమే రేపింది. అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ అయిన ఎంఎస్‌కే ప్రసాద్‌పై రాయుడు సోషల్‌ మీడియా వేదికగా యుద్ధాన్నే ప్రకటించాడు. తన స్థానంలో ఎంపికైన విజయ్‌ శంకర్‌ను ప్రసాద్‌ త్రీడీ ప్లేయర్‌గా పేర్కొనడం, ఆ త్రీడీ ఆట చూసేందుకు త్రీడీ కళ్లాద్దాలు ఆర్డర్‌ ఇచ్చానంటూ రాయుడు సెటైర్లు వేయడం, ఆ తర్వాత విజయ శంకర్‌ అత్యంత దారుణంగా విఫలం కావడం అందరికీ తెలిసిందే. ఆ వరల్డ్‌ కప్‌ టీమ్‌లో రాయుడు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఇలా రెండు తరాల తెలుగు క్రికెటర్లకు జరిగిన అన్యాయం.. ఇప్పుడు తిలక్‌ వర్మ విషయంలో కూడా కొనసాగింది. అద్భుతమైన టాలెంట్‌తో పాటు క్లిష్ట పరిస్థితుల్లో ఆడే నైపుణ్యం ఉన్న ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌ టీమ్‌లో ఉంటే జట్టుకు ఎంతో మేలు జరిగేది. కానీ, సెలెక్టర్లు మాత్రం ఫామ్‌లోలేని సూర్యకుమార్‌ యాదవ్‌ వైపే మొగ్గు చూపారు. ఇలా మూడు తరాల తెలుగు క్రికెటర్ల(వీవీఎస్‌ లక్ష్మణ్‌, అంబటి రాయుడు, తిలక్‌ వర్మ)కు అన్యాయం జరిగింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BREAKING: వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి