యువీ కొట్టిన ఆరు సిక్సులు నా లైఫ్‌ని మార్చేశాయి: స్టువర్ట్‌ బ్రాడ్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తాజాగా అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ టెస్ట్‌ క్రికెట్‌లో టాప్‌ 5 బౌలర్లలో ఒకడిగా నిలిచిన బ్రాడ్‌.. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో అద్భుతమైన పేసర్‌గా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప టెస్ట్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే.. బ్రాడ్‌ పేరు విన్నా, అతని ఫొటో చూసినా.. భారత క్రికెట్‌ అభిమానులకు టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కొట్టిన ఆరు సిక్సులు కళ్ల ముందు కనిపిస్తాయి. ఎందుకంటే యువీ బాదుడికి బలైంది బ్రాడే.

సౌతాఫ్రికా వేదికగా 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సీనియర్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ నోటి దూలతో యువీతో గొడవపెట్టుకున్నాడు. దీంతో యువీకి ఆగ్రహం కట్టలుతెచ్చుకుంది. ఆ కోపాన్ని పాపం కుర్ర బౌలర్‌ అయిన స్టువర్ట్‌ బ్రాడ్‌పై చూపించాడు. గొడవ జరిగిన వెంటనే బౌలింగ్‌కు రావడం బ్రాడ్‌ దురదృష్టం. ఆ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకున్నాడు. దీంతో బ్రాడ్‌ కెరీర్‌కు అక్కడితోనే పుల్‌స్టాప్‌ పడిందని అంతా భావించారు. ఎందుకంటే ఆ దెబ్బకు అతను కోలుకోవడం కష్టం. ఆ టైమ్‌లో అతని ఫేస్‌ ఎవరికైనా పాపం అనిపించింది.

అలాంటి కఠిన పరిస్థితుల నుంచి బ్రాడ్‌ కోలుకున్న తీరు మాత్రం అద్భుతం. దాదాపు కెరీర్‌ ముగిసే స్థితి నుంచి ప్రపంచ టాప్‌ బౌలర్లలో ఒకడిగా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ నంబర్‌ 2 బౌలర్‌గా ఎదిగాడు. యువీ చేతిలో ఆరు సిక్సర్లు కొట్టించుకున్న బౌలర్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్టుతో గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. యువీ ఆరు సిక్సుల గురించి మాట్లాడిన బ్రాడ్‌.. ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని వెల్లడించాడు. మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌ అయ్యానని, యువీ ఆరు సిక్సుల వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ ఆరు సిక్సులు నాలోని పోటీతత్వాన్ని నిద్రలేపాయని అన్నాడు.

కాగా.. బ్రాడ్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ కూడా స్పందించడం విశేషం. ‘అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్‌లో భయపెట్టే బౌలర్లలో ఒకడిగా నిలిచావు. నిజమైన లెజెండ్. నీ ప్రయాణం, సంకల్పం చాలా స్ఫూర్తిదాయకం బ్రాడీ’ అంటూ ట్విట్టర్‌ వేదికగా బ్రాడ్‌కు రిటైర్మెంట్‌ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే.. ఆ రోజు అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని ఇప్పటికీ అనుకుంటానని పేర్కొన్నాడు. మరి బ్రాడ్‌ కెరీర్‌ గురించి, అలాగే యువీ కొట్టిన ఆరు సిక్సుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

Show comments