iDreamPost
android-app
ios-app

జాక్వెస్ కల్లిస్.. ఇద్దరు సచిన్ లతో సమానమైన క్రికెట్ దేవుడి కథ ఇది!

  • Published Aug 17, 2024 | 2:53 PM Updated Updated Aug 17, 2024 | 3:27 PM

Special Story on Jacques Kallis: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కల్లీస్‌ గురించి.. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. నిజానికి క్రికెట్‌ గాడ్‌ అంటే అతనే.. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

Special Story on Jacques Kallis: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కల్లీస్‌ గురించి.. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. నిజానికి క్రికెట్‌ గాడ్‌ అంటే అతనే.. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 17, 2024 | 2:53 PMUpdated Aug 17, 2024 | 3:27 PM
జాక్వెస్ కల్లిస్.. ఇద్దరు సచిన్ లతో సమానమైన క్రికెట్ దేవుడి కథ ఇది!

ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌.. సచిన్‌ టెండూల్కర్‌. వంద సెంచరీల వీరుడు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి రికార్డు ఉన్న ఏకైక క్రికెటర్‌. ఒక బ్యాటర్‌గా సచిన్‌ సాధించిన ఘనతలు, చేసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు ఆయనను భారత క్రికెట్‌కు దేవుడిని చేశాయి. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా మూడు విభాగాల కలయిగా ఉన్న క్రికెట్‌లో.. ఒక్క బ్యాటింగ్‌లోనే దిగ్గజంగా ఎదిగిన సచిన్‌ను క్రికెట్‌ దేవుడిగా కొలిస్తే.. మరి ఆ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చి.. ఒక ‘పరిపూర్ణ క్రికెటర్‌’గా నిలిచిన ఆటగాడిని ఏమనాలి. కచ్చితంగా అతను కూడా క్రికెట్‌ ఆరాధ్యుడే. బ్యాటింగ్‌ విషయంలో సచిన్‌ను మించి కాకపోయినా.. సచిన్‌కు పోటీ ఇస్తూ.. గొప్ప బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన ఆ ఆటగాడే.. ‘సాతాఫ్రికా క్రికెట్‌ గాడ్‌’ జాక్వెస్‌ కల్లిస్‌.

ఆల్‌రౌండర్‌ అనే మాటకు మరో రూపం అంటూ ఉంటే అది కల్లిసే. ఆల్‌రౌండర్లలో కూడా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉంటారు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అంటే.. బ్యాటింగ్‌ బాగా చేస్తూ.. బౌలింగ్‌ కూడా మేనేజ్‌ చేయగలరు. అలాగే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అంటే.. బౌలింగ్‌ పర్ఫెక్ట్‌గా వేస్తూ.. కాస్త బ్యాటింగ్‌ కూడా చేయగలరు. కానీ.. కల్లిస్‌ అలా కాదు. ఒక నిఖార్సయిన ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌ చేస్తే.. ఒక సచిన్‌లా! బౌలింగ్‌ చేస్తే.. ఒక మెక్‌గ్రాత్‌లా ఉంటుంది అతని ఆట. కల్లిస్‌లోని మరో గొప్ప విశేషం ఏంటంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగలడు. వికెట్లు పడిపోతే.. అడ్డుగోడలా నిలబడిపోగలడు. ఒక ఓవర్‌కు 20 రన్స్‌ కొట్టాలన్నా.. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేయగలడు. క్లాసి షాట్స్‌తో ఫోర్లు, విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సులు కొట్టే ఒక ఆల్‌ఇన్‌ వన్‌ బ్యాటర్‌.

jacques kallis special story

ఇక బౌలింగ్‌లో అతనికి ఉన్న వేరియేషన్స్‌.. చాలా మంది గొప్ప గొప్ప బౌలర్లలో కూడా ఉండవు. బౌన్స్‌, ఇన్‌ స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌, స్లోవర్‌ డెలవరీ, యార్కర్‌ ఇలా తన బౌలింగ్‌లో లేని వేరియేషన్‌ అంటూ లేదు. పైగా.. సాధారణ ఆల్‌రౌండర్‌లా నామమాత్రపు పేస్‌ కాదు. బ్యాటర్లను భయపెట్టే వేగం. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కల్లిస్‌ టీమ్‌లో ఉన్నాడంటే.. ఆ టీమ్‌ 12 మంది ఉన్నట్లే లెక్క. ఎందుకంటే.. కల్లిస్‌ అంటే ఒక్కడు కాదు.. ఇద్దరు. ఒక క్లాసిక్‌ బ్యాటర్‌, ఒక వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌. కల్లీస్‌ అంటే.. టీమ్‌లో ఒకడిగా కనిపించే ఇద్దరు ఆటగాళ్లకు సమానం. ఇక ఫీల్డింగ్‌ విషయంలోనూ కల్లిస్‌ తోపే. స్లిప్స్‌లో కల్లిస్‌ క్యాచ్‌ మిస్‌ చేసిన దాఖలాలు చాలా అరుదు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. మూడు విభాగాల్లోనూ రాణిస్తూ.. ఏకంగా 18 ఏళ్ల కెరీర్‌ను అద్భుతంగా కొనసాగించాడు కల్లిస్‌. నిజానికి కల్లిస్‌ ఆడిన సమయం.. సౌతాఫ్రికా క్రికెట్‌కు గోల్డెన్‌ ఎరా. అలాంటి ఆటగాడు.. యుగానికి ఒక్కడే పుడతాడు. ఆఫ్రికన్ల అదృష్టం కొద్ది అతను వారిదేశంలో పుట్టాడు. ఒక బ్యాటర్‌గా కల్లిస్‌ సాధించిన రికార్డులు, చేసిన పరుగులు.. ఎంతో మంది బ్యాటర్లకు అందని, అందుకోలేనివి ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లోనూ అంతే.. కల్లిస్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య.. బౌలింగ్‌ మాత్రమే తెలిసిన చాలా మంది బౌలర్ల వికెట్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్ల లిస్ట్‌లోనూ ఉంటాడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్‌లోనూ ఉంటాడు. ఫిట్‌నెస్‌ విషయంలోనూ కల్లిస్‌ను కొట్టే క్రికెటర్‌ లేడు. టెస్టు క్రికెట్‌లో క్రీజ్‌లో పాతుకుపోయి ఒక రోజంతా బ్యాటింగ్‌ చేసినా.. మరుసటి రోజు 30 ఓవర్లు వేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు.

మైండ్‌ బ్లోయింగ్‌ స్టాట్స్‌..!

1995లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కల్లిస్‌.. 2013 వరకు కొనసాగాడు. ఈ 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అతని గణాంకాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లకు మైండ్‌బ్లాంక్‌ అవుతుంది. ఎందుకంటే.. కల్లిస్‌ బ్యాటింగ్‌ స్టాట్స్‌ చూస్తే.. అతనో అద్భుతమైన బ్యాటర్‌ అని, అతని బౌలింగ్‌ నంబర్స్‌ చూస్తే.. ఇంత గొప్ప బౌలరా? అని అనిపించకమానదు. టెస్టుల్లో కల్లిస్‌ యావరేజ్‌.. ది గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌ కంటే ఎక్కువ. టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ 53.78 కాగా.. కల్లిస్‌ది 55.37. ఈ ఒక్క విషయంలో కల్లిస్‌ ఎక్కువైనంత మాత్రమా సచిన్‌ కంటే గొప్ప ఆటగాడు కాలేడు, కానీ.. ఒక ఆల్‌రౌండర్‌గా ముద్రపడిన బ్యాటర్‌ యావరేజ్‌ క్రికెట్‌ గాడ్‌ యావరేజ్‌ కంటే ఎక్కువగా ఉందంటే.. అది చాలా పెద్ద విషయమే కదా. ఒక వేళ కల్లీస్‌ ఇండియాలో పుట్టి ఉంటే.. క్రేజ్‌లో సచిన్‌, ధోని, కోహ్లీని దాటేసేవాడని కూడా క్రికెట్‌ అభిమానులు అంటూ ఉంటారు.

jacques kallis special story

తన కెరీర్‌లో మొత్తం 166 టెస్టులు ఆడిన కల్లిస్‌.. 280 ఇన్నింగ్స్‌ల్లో 13289 పరుగులు చేశాడు. అందులో 45 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే.. కల్లిస్‌ టెస్టు క్రికెట్‌లో ఒక గొప్ప బ్యాటర్‌ అని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అలాగే వన్డేల విషయానికి వస్తే.. 328 మ్యాచ్‌ల్లో 314 ఇన్నింగ్స్‌ల్లో 44.36 సగటుతో 11579 పరుగులు.. అందులో 17 సెంచరీలు, 86 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌ లెక్కల గురించి మాట్లాడుకుంటే.. అదో అద్భుతం. ఒక గొప్ప క్రికెటర్‌గా కీర్తించబడేందుకు పై లెక్కలు సరిపోతాయి. కానీ.. కల్లిస్‌ కేవలం బ్యాటర్‌ మాత్రమే కాదు.. పై పేరాల్లో చెప్పుకున్నట్లు అతనో నిఖార్సయిన క్రికెటర్‌. అందుకే.. 166 టెస్టుల్లో 292, 328 వన్డేల్లో 273.. టీ20ల్లోనూ 12 వికెట్లు పడగొట్టాడు కల్లిస్. ఇక యువ క్రికెటర్ల రాజ్యంగా చెప్పుకుంటున్న టీ20 ఫార్మాట్లో కూడా కల్లిస్‌ తన మార్క్‌ను చూపించాడు. 25 ఇంటర్నేషనల్‌ టీ20లు ఆడిన కల్లిస్‌.. 666 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌, కరేబియన్‌ లీగ్‌, బిగ్‌బాష్‌ లాంటి వాటిల్లోనూ కల్లిస్‌ను హాట్‌కేక్‌ను కొన్నట్టు కొనేవారు. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరఫున కల్లీస్‌ ది బెస్ట్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌ ఆరంభంలో ఆర్సీబీ తరఫున ఆడాడు.

శ్రీలంకపై విశ్వరూపం..

2012లో శ్రీలంకతో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో కల్లిస్‌ తన విశ్వరూపం చూపించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 224 పరుగులు బాది తన కెరీర్‌లోనే అత్యధిక టెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేశాడు. ఆ టెస్టులో 224 పరుగులు చేసిన కల్లిస్‌.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. ఏకంగా 6 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక వన్డే క్రికెట్‌లో 2004 ఫిబ్రవరి 4న వెస్టిండీస్‌తో జరిగిన 5వ వన్డేలో.. కల్లిస్‌ చెలరేగిపోయాడు. 11 ఫోర్లు, 3 సిక్సులతో విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడి.. తన కెరీర్‌లోనే వన్డేల్లో హైఎస్ట్‌ స్కోర్‌ 139 బాదేశాడు. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌లతో పాటు కల్లిస్‌ ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. పార్టనర్‌షిప్‌లు నెలకొల్పడంలో అతనికి అతనే సాటి. అందుకే కల్లిస్‌ లాంటి ఆల్‌రౌండర్‌ను చూపిస్తే.. లైఫ్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఇస్తామనే క్రికెట్‌ అభిమానులు కూడా ఉన్నారు.

సచిన్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా 100కు పైగా వికెట్లు పడగొట్టినా.. కల్లిస్‌ గణాంకాలతో సరిపోవు. అలాగే శ్రీలంక ఆటగాడు జయసూర్య సైతం బౌలింగ్‌లో భారీగానే వికెట్లు పడగొట్టినా.. అతన్ని కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్‌గానే పరిగణిస్తారు. కానీ.. ఒక్క కల్లిస్‌ను మాత్రమే బౌలింగ్‌ చేసే సమయంలో డేంజరస్‌ బౌలర్‌గా, బ్యాటింగ్‌ చేసే టైమ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ బ్యాటర్‌గా చూస్తారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ అంటే కల్లిస్‌తోనే మ్యాచ్‌లా ఉండేది అప్పట్లో పరిస్థితి. ఇండియా బ్యాటింగ్‌ చేస్తుంటే.. బౌలింగ్‌ వేస్తూ కనిపించేవాడు. ఇండియా బౌలింగ్‌ చేస్తుంటే.. బ్యాట్‌తో రన్స్‌ చేస్తూ.. గంటకొద్ది క్రీజ్‌లో పాతుకుపోయి విసిగించేవాడు. అలా సౌతాఫ్రికా క్రికెట్‌ గురించి ఒక పుస్తకం రాయాల్సి వస్తే.. అందులో అందరి కంటే ఎక్కువ పేజీలు కల్లిస్‌ గురించే నిండిపోతాయి. అంతటి అసాధారణమైన ఆటగాడు కాబట్టే.. ఇప్పటికీ చాలా మంది యువ క్రికెటర్లు కల్లిస్‌ను తమ రోల్‌మోడల్‌గా భావిస్తారు. అందులో పక్కా బ్యాటర్లు ఉంటారు, పక్కా బౌలర్లు ఉంటారు. ఎందుకంటే ఆ రెండింటిలోనూ కల్లిస్‌ గొప్పొడు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్ని తరాలు గడిచిపోయినా.. ఎన్ని జట్లు వచ్చినా.. ఆల్‌రౌండర్‌ అంటే కల్లిస్‌ ఫొటో చూపించాల్సిందే. కల్లీస్‌ అంటే క్రికెటర్‌ మాత్రమే కాదు.. సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రకు ముఖచిత్రం. మరి కల్లీస్‌ క్రికెట్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.