Shakib Al Hasan: వ్యక్తిగత రికార్డులు ఏం చేసుకోడానికి? రోహిత్‌ శర్మనే చూడండి: షకీబ్‌

వ్యక్తిగత రికార్డులు ఏం చేసుకోడానికి? రోహిత్‌ శర్మనే చూడండి: షకీబ్‌

వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయకపోవడంపై వివాదం నెలకొంది. గతంలోనే మూడు ఫార్మాట్లకు తమీమ్‌ ఇక్బాల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించి షాక్‌ ఇచ్చాడు. అయితే.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో సమావేశం తర్వాత తమీమ్‌ తన నిర్ణయం మార్చుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడాడు. అయితే.. గాయం నుంచి తమీమ్‌ పూర్తిగా కోలుకోలేదనే కారణంతో అతన్ని వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయలేదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

కానీ, తమీమ్‌ ఇక్బాల్‌ మాత్రం.. తనను వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోకపోవడంపై సీరియస్‌ అయ్యాడు. తాను ఫిట్‌గా ఉన్నా కూడా తనను కావాలనే వరల్డ్ కప్‌ టీమ్‌ నుంచి తప్పించారని, వరల్డ్‌ కప్‌ కోసం టీమ్‌ ఎంపిక చేసే ముందు బంగ్లా క్రికెట్‌ బోర్డు నుంచి ఓ అధికారి తనకు ఫోన్‌ చేసి.. ఒక వేళ వరల్డ్‌ కప్‌లోకి తీసుకోవాలంటే.. తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాల్సి వస్తుందని తనతో అన్నట్లు వివరించాడు. అయితే.. తాను దాదాపు 17 ఏళ్లుగా ఓపెనర్‌గానే ఆడుతున్నానని, తనకు 3, 4 స్థానాల్లో ఆడే అలవాటు లేదని తమీమ్‌ పేర్కొన్నాడు. దీంతో తనను వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోలేదని తమీమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే.. తమీమ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్ మాట్లాడుతూ.. ఏ ఆటగాడైనా జట్టు కోసం ఆడాలని, వ్యక్తిగత రికార్డుల కోసం కాదని అన్నాడు. రోహిత్‌ శర్మ లాంటి ప్లేయర్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. అతను కెరీర్‌ ఆరంభంలో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడని, తర్వాత ఓపెనర్‌గా 10 వేలకు పైగా పరుగులు చేశాడు. అనేక సార్లు 4, 5 స్థానాల్లో కూడా బ్యాటింగ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. నేను ఒక స్థానంలోనే ఆడతాను అని అనడం చిన్నపిల్లల మనస్తత్వం అని అన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఏ ఆటగాడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని, జట్టు కోసం ఆడాలి కానీ, వ్యక్తిగత రికార్డులు ఏం చేసుకుంటామని పేర్కొన్నాడు. మరి షకీబ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్‌! కారణమేంటి?

Show comments