iDreamPost

ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్‌! కారణమేంటి?

  • Published Sep 28, 2023 | 11:20 AMUpdated Sep 28, 2023 | 11:20 AM
  • Published Sep 28, 2023 | 11:20 AMUpdated Sep 28, 2023 | 11:20 AM
ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్‌! కారణమేంటి?

వరల్డ్‌ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలిచింది. బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత ఓటమిపాలైనప్పటికీ అప్పటికే తొలి రెండు వన్డేలు గెలవడంతో సిరీస్‌ మన సొంతమైంది. తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో వన్డేలో గెలిచి ఊరట పొందింది. వరల్డ్‌ కప్‌కు ముందు ఈ గెలుపు వారికి కూడా బూస్ట్‌అప్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు. పైగా 352 పరుగుల భారీ స్కోర్‌ చేయడమే కాకుండా.. రోహిత్‌, కోహ్లీతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ను 300లోపే ఆలౌట్‌ చేయడం.. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

అయితే.. సిరీస్‌ విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ అందిస్తున్న క్రమంలో టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ కప్పును అందుకోకపోవడం గమనార్హం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ ట్రోఫీని అందుకున్నాడు. రోహిత్‌ శర్మను సైతం ట్రోఫీ అందుకునేందుకు పిలిచినా.. రోహిత్‌ ఆ ట్రోఫీని కనీసం తాకను కూడా తాకలేదు. కాగా, తొలి రెండు వన్డేల్లో రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం తొలి రెండు వన్డేలు ఆడలేదు. అయినా కూడా టీమిండియా అద్భుత విజయాలు సాధించింది.

ఇక చివరిదైన మూడో వన్డేలో ఈ ఇద్దరు హేమాహేమీలు బరిలోకి దిగడంతో.. ఇక ఆస్ట్రేలియాకు దబిడిదిబిడే అని అంతా భావించారు. రోహిత్‌, కోహ్లీ రాకతో మరింత బలపడిన టీమిండియా 3-0తో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్‌ చేస్తుందనుకుంటే.. ఆసీస్‌ అనూహ్యంగా పుంజుకుని టీమిండియాను దెబ్బతీసింది. తొలుత టాస్‌ గెలవడంతోనే సగం మ్యాచ్‌ గెలిచేసిన ఆసీస్‌.. అనంతరం బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే.. మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్‌, కోహ్లీ అంతగా నిరాశ పర్చలేదు. ఇద్దరు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కానీ, వాటిని పెద్ద స్కోర్‌గా మల్చడంలో విఫలం అయ్యారు.

వారిద్దరూ మరో 10 ఓవర్ల పాటు ఆడి ఉంటే.. ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. కానీ, బ్యాటింగ్‌లో విఫలమైన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. బాల్‌తో సత్తా చాటాడు. రోహిత్‌, కోహ్లీతో పాటు మరో ఇద్దరిని అవుట్‌ చేసి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో.. టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తన కెప్టెన్సీలో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలుకావడం, కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించడంతో.. ట్రోఫీని అందుకునేందుకు రోహిత్‌ శర్మ ఇష్టపడలేదని చెప్పాలి. కేఎల్‌ రాహుల్‌ ట్రోఫీని అందుకుని.. జట్టుతో ఉన్న స్టేట్‌ ప్లేయర్ల చేతుల్లో పెట్టాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే క్రికెట్​కు గుడ్​బై!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి