SNP
SNP
సచిన్ టెండూల్కర్.. ఇండియన్ క్రికెట్ గాడ్. ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఆరాధ్యుడు, చాలా మంది గొప్ప క్రికెటర్లకు సైతం అతనే స్ఫూర్తి. సచిన్ అంత గొప్ప స్థాయికి ఊరికే వచ్చాడా? తన చెమటను, రక్తాన్ని గ్రౌండ్‌లో చిందించి, దేశంపై ప్రేమను గుండెల నిండా నింపుకొని, ఆటను ఊపిరిగా తీసుకుంటూ, సెంచరీలతో పరుగుల దాహం తీర్చుకుంటూ ప్రపంచంలోనే అతి గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. సచిన్ స్థాయిని చేరుకునేందుకు చాలా కాలంగా చాలా మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నా.. ఇప్పటికీ క్రికెట్ గాడ్ అంటే సచిన్ ఒక్కడే. సచిన్‌ను దాటాలంటే అతని రికార్డులు కొట్టడంకాదు.. అంతకుమించి ఏదో చేయాలి. అసలు సచిన్ ఆటగాడి స్థాయిని దాటి క్రికెట్ దేవుడిగా ఎదిగేందుకు కేవలం అతని అద్భుతమైన ఆట మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఆటపై అతనికున్న అంకితభావం, ప్రేమ.. దేశాన్ని గెలిపించాలనే కసి, తెగువ.. అందుకోసం చేసిన త్యాగాలే సచిన్‌ను క్రికెట్ దేవుడిగా నిలబెట్టాయి.
అందులోంచి మచ్చుకు ఒకదాని గురించి చెప్పుకోవాల్సి వస్తే.. వరల్డ్ కప్‌లో సచిన్ తన అండర్ వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని మ్యాచ్ ఆడిన సంఘటన గురించి చెప్పుకోవచ్చు. అదేదో సరదాగా చేసిన పని కాదు.. ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం సచిన్ చేసిన సాహసం. 2003 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్ 6లో శ్రీలంకతో భారత్‌కు కీలకమైన మ్యాచ్. కానీ, అప్పటికే సచిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విరేచనాలతో బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. అయినా సరే ఇండియాకు ఎంతో కీలకమైన మ్యాచ్ కావడంతో బరిలో దిగేందుకే సచిన్ నిర్ణయించుకున్నాడు. కానీ, డీహైడ్రేషన్‌తో సచిన్ మైదానంలో కనీసం నిలబడగలడా అనే అనుమానం జట్టు మొత్తంలో ఉంది.
ఐదు, పది నిమిషాలకు ఒకసారి మోషన్‌కు వెళ్తున్న సచిన్.. బ్యాటింగ్ చేస్తూ అలా పదేపదే బయటికి రాలేడు. దీంతో ఏంచేయాలో తెలియక.. వేరేదారి లేక తన అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ ఏకంగా 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆ రోజు సచిన్ చేసిన పని నవ్వులాటగా ఉన్నా.. అతను ప్రాణాలకు తెగించాడనే చెప్పాలి. సౌతాఫ్రికాలో ఎండకు తట్టుకుని, డీహైడ్రేట్ అయిన బాడీతో ఆటడం అంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవడమే. కానీ దేశంపై ప్రేమతో సచిన్ ప్రాణాలకు తెగించి టీమిండియాను గెలిపించాడు. నిజానికి ఈ ఒక్క సంఘటన చాలు సచిన్ ఎంత డెడికేషన్‌తో ఆడతాడో చెప్పడానికి. అందుకే సచిన్.. క్రికెట్‌కి దేవుడయ్యాడు.