తొలి రోజు టీమిండియాదే! అదరగొట్టిన జైస్వాల్‌, రోహిత్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. ఇప్పటికే తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించి మంచి జోష్‌లో ఉన్న భారత్‌.. రెండో టెస్టులోనూ అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఈ టెస్టులోనూ బ్యాట్‌ ఝుళిపించారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలో రాణించారు. జైస్వాల్‌ 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసి హోల్డర్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఇక రోహిత్‌ 80 పరుగులు చేసి మరో సెంచరీ సాధిస్తాడు అనుకుంటే.. దురదృష్టవశాత్తు వార్రికాన్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 80 పరుగులు చేసి రాణించాడు. తొలి వికెట్‌కు జైస్వాల్‌-రోహిత్‌ జోడీ 139 పరుగులను జోడించింది.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 6 పరుగులకే అవుటైన గిల్‌.. ఇప్పుడు 10 పరుగులు చేసి వికెట్‌ పారేసుకున్నాడు. గిల్‌ అవుట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కింగ్‌ కోహ్లీ.. తన సీనియారిటీని ప్రదర్శిస్తూ విండీస్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 161 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేసి.. తన 76వ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. రెండో రోజు మరో 13 పరుగులు చేస్తే.. కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ వచ్చి పడుతుంది. ఇప్పటికే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ వరల్డ్‌ నంబర్‌ టూగా ఉన్నాడు. 100 సెంచరీలో సచిన్‌ మొదటి స్థానంలో ఉన్నా విషయం తెలిసిందే.

రోహిత్‌ అవుట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రహానే 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ(87 నాటౌట్‌)తో కలిసి జడేజా(36 నాటౌట్‌) మొదటి రోజును ముగించారు. మొత్తం మీద తొలి రోజు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, షానన్ గాబ్రియేల్, జోమెల్ వారికన్, జెసన్‌ హోల్డర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌, జైస్వాల్‌, కోహ్లీ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 21 ఏళ్లుగా ఇండియాపై గెలుపు లేదు! అయినా వారిదే పైచేయి

Show comments