iDreamPost
iDreamPost
IPL 2022, లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ క్రీడా పండితులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది పరుగుల గురించి, వికెట్ల గురించో కాదు, ఈ రెండు జట్ల వ్యూహాల గురించి. తలపండిన ఆటగాళ్లే ఈ రెండు జట్ల వ్యూహాలతో అదిరిపోయారు. ఇది వ్యూహాల మధ్య పోరు. ఐపీఎల్ సంప్రదాయ పద్ధతులను దాటి, మరో అడుగు ముందుకేసిందనడానికి సాక్ష్యం.
ఆరోనెంబర్ ఆటగాడిగా దిగిన రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 23 బంతుల్లో 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్ ఔట్ అయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్ అశ్విన్. స్పిన్నర్ చాహల్ ఓవర్లను ఎదుర్కోవడం కోసం, రియాన్ పరాగ్‌కు హిట్టింగ్ అవకాశం ఇవ్వడం కోసం, అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
రిటైర్డ్ ఔట్ అంటే ఏంటి? అంపైర్ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు. మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. అదే రిటైర్డ్ హర్ట్ అంటే గాయపడినప్పుడు మాత్రం ఆ బ్యాట్స్‌మన్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికే అవకాశం. రిటైర్డ్ ఔట్ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాదు.
ఇదో కొత్త ఎత్తుగడ. స్ట్రయిక్ బౌలర్ నుంచి కీలక ఆటగాన్ని తప్పించడానికి ముందుగా అశ్విన్, బ్యాటింగ్ కు దిగాడు. మ్యాచ్ కీలక స్థితికి చేరినప్పుడు బ్యాటింగ్ నుంచి తప్పుకున్నాడు. ఇది ముందుగానే హెడ్ కోచ్, అశ్విన్ కలసి తీసుకున్న నిర్ణయం. ఇకపై ఇది కొత్త ధోరణి కాబోతోంది. ఒకవేళ ఒక బ్యాట్స్ మెన్ బాగా ఆడటంలేదు. బాల్స్ తినేస్తున్నాడు,మరొకరు బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు, అలాంటి సమయంలో, ఔట్ అయ్యేవరకు బాల్స్ వేస్ట్ చేయడం ఎందుకు? రిటైర్డ్ ఔట్ అయితే సరిపోతుంది. ఐపిఎల్ కనిపెట్టిన మరో ఎత్తుగడ ఇదే.
టి20 క్రికెట్‌లో రిటైర్డ్ ఔట్ అయిన నాలుగో బ్యాటర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇంతకముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది, భూటాన్‌కు చెందిన ఎస్ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్ ఇస్లామ్‌లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు.