2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఇటీవలే విడుదల చేసింది ఐసీసీ. ఇక భారత్ వేదికగా జరగనున్న ఈ వరల్డ్ కప్.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కు ఇంకా 100 రోజులు మాత్రమే ఉండటంతో.. జట్లు మెుత్తం ప్రాక్టీస్ పై ఫోకస్ పెట్టాయి. ఇక సొంత గడ్డపై జరగనున్న వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో ఉన్న అతిపెద్ద సమస్యను బయటపెట్టాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఈ వరల్డ్ కప్ లో ఆ ముగ్గురు టీమిండియా జట్టులో ఉండాలని సూచించాడు. మరి రవిశాస్త్రి సూచించిన ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
2023 వరల్డ్ కప్.. ఇప్పుడు అన్ని క్రికెట్ జట్ల చూపు ఈ మెగా టోర్నీమీదే. భారత్ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్ లో.. టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత్ కు ఇది మంచి అవకాశం. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే ప్రపంచ కప్ కు సిద్దం అవుతున్న టీమిండియా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. 2011 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు ఇప్పటి టీమిండియా జట్టుకు వ్యత్యాసం వివరించాడు. ప్రస్తుతం టాప్-5లో ఒక్క లెఫ్టాండర్ లేడని, రవీంద్ర జడేజా ఒక్కడే ఉన్నాడని తెలిపాడు.
అయితే గతంలో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా రూపంలో టాపార్డర్ లో లెఫ్టాండర్స్ ఉన్నారని రవిశాస్త్రి గుర్తుచేశాడు. వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని సూచించాడు. ఈ సమస్యను అధిగమించాలంటే వీలైనంత తొందరగా.. ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మలను జట్టులోకి తీసుకుని.. వారిని వరల్డ్ కప్ కు సిద్దం చేయాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వీరికోసం సీనియర్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టాలని కోరాడు. ఇక వరల్డ్ కప్ లో ఓపెనర్ గా సత్తా చాటగల ఆటగాడు యశస్వీ జైస్వాల్ అని, అతడు గౌతమ్ గంభీర్ పోషించిన పాత్రను పోషించగలడని చెప్పుకొచ్చాడు.
ఇక టాప్-5లో ఆడగలిగే మరో లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ అని, అయితే కేఎల్ రాహుల్ ను ఆడిస్తూ.. ఇషాన్ ను పక్కనపెడుతున్నారని శాస్త్రి తెలిపాడు. వికెట్ కీపర్ గా అతడికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. ఇక 2011లో సురేష్ రైనా పోషించిన పాత్రను తిలక్ వర్మ లేదా రింకూ సింగ్ పోషించగలరని ఆశాభావం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి. ముఖ్యంగా రింకూ సింగ్ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టుకు విజయాన్ని అందించాలనే పట్టుదల రింకూ సొంతం అని.. ఈ ముగ్గురు యువ ఆటగాళ్లను ప్రశంసించాడు. తిలక్ వర్మ సైతం అద్బుతమైన ఆటగాడని, కానీ మేనేజ్ మెంట్ మాత్రం సీనియర్స్ కే ఎక్కువ అవకాశాలు ఇస్తుందని రవిశాస్త్రి మండిపడ్డాడు. మరి రవిశాస్తి చెప్పుకొచ్చినట్లుగా.. జైస్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, తిలక్ వర్మలను జట్టులోకి తీసుకుంటారో? లేదో? చూడాలి.