రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. జెంటిల్మన్ గేమ్‌కు భారత్ అందించిన అతి గొప్ప ప్లేయర్లలో ఒకడు ద్రవిడ్. బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా, కెప్టెన్‌గా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు ద్రవిడ్. ముఖ్యంగా టెస్టుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఔట్ చేయడం ఎవరి వల్లా అయ్యేది కాదు. లెజెండరీ బౌలర్లు కూడా ద్రవిడ్‌ను ఔట్ చేయడానికి అష్టకష్టాలు పడేవారు. ఓపిక, సహనంతో క్రీజులో నిలబడి గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ టాలెంట్‌తో ఎన్నో సందర్భాల్లో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు ద్రవిడ్.
టీమిండియాకు కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించిన ద్రవిడ్.. యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. రిటైర్మెంట్ అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టుకు పలువురు యువ క్రికెటర్లను తయారు చేసి ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నాడు ద్రవిడ్. అలాంటి ది వాల్, మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్ అడుగుజాడల్లోనే అతడి కుమారులు నడుస్తున్నారు. ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ అండర్-14 కర్ణాటక క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ ఆ రాష్ట్ర అండర్-19 జట్టులో ప్లేస్ దక్కించుకున్నాడు.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తాజాగా వినూ మన్కడ్ దేశవాళీ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సెలెక్ట్ చేసింది. ఈ జట్టులో ద్రవిడ్ తనయుడు సమిత్‌కు చోటు దక్కింది. ఈ టీమ్‌కు ధీరజ్ జె.గౌడ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ధృవ్ ప్రభాకర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. కాగా, ద్రవిడ్ రెండో కొడుకు అన్వయ్ కూడా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. రెండేళ్ల కింద అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో కర్ణాటక టీమ్‌కు కెప్టెన్‌గా సెలెక్టయిన అన్వయ్.. అన్న సమిత్‌తో కలసి మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు పొందాడు.
ఇది కూడా చదవండి: రోహిత్ అంటే భయం.. కోహ్లీ మాటలు లీక్ చేసిన అశ్విన్!