iDreamPost
android-app
ios-app

VIDEO: మరో సెంచరీ! కసిగా ఆడుతున్న పృథ్వీ షా..

  • Published Aug 14, 2023 | 11:11 AMUpdated Aug 14, 2023 | 11:11 AM
  • Published Aug 14, 2023 | 11:11 AMUpdated Aug 14, 2023 | 11:11 AM
VIDEO: మరో సెంచరీ! కసిగా ఆడుతున్న పృథ్వీ షా..

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్నాడు. భారత జట్టులోకి ఓ పెను సంచలనంలా దూసుకొచ్చిన ఈ యువ కెరటం.. ఎక్కువ కాలం జట్టులో ఉండలేకపోయాడు. టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా.. ఎందుకో ఈ జూనియర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌కు కాలం కలిసిరాలేదు. దాంతో టీమిండియాలో పాతుకుపోవాల్సిన వాడు.. చోటు కోసం పరితపిస్తున్నాడు. అయితే.. తాజాగా ఇంగ్లండ్‌ గడ్డపై కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇటీవల డబుల్‌ సెంచరీతో దుమ్ములేపి.. ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిన షా.. తాజాగా మరో సెంచరీతో సంచలనం సృష్టించాడు. అది కూడా సాదాసీదా సెంచరీ కాదు.. 68 బంతుల్లోనే అందుకున్న సూపర్‌ సెంచరీ.

ఇంగ్లండ్‌ డొమెస్టిక్‌ వన్డే కప్‌ 2023లో భాగంగా ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కేవలం 199 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నార్తాంప్టన్‌షైర్‌ టీమ్‌కు కేవలం 25.4 ఓవర్లలోనే విజయాన్ని అందించాడంటేనే అర్థం అవుతుంది.. పృథ్వీ షా ఊచకోత ఏ రేంజ్‌లో సాగిందో. టీ20 మ్యాచ్‌లా ఆడి.. టార్గెట్‌ను ఊదిపడేశాడు. పైగా మ్యాచ్‌ గెలిపించేంత వరకు క్రీజ్‌లో ఉండి.. నాటౌట్‌గా మ్యాచ్‌ను ముగించాడు. మొత్తం మీద కేవలం 76 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 సిక్సులతో 125 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. గత మ్యాచ్‌లో సోమర్‌సెట్‌పై 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో 244 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో వరుస సెంచరీలతో తాను సూపర్‌ ఫామ్‌లోకి వచ్చినట్లు షా చెప్పకనేచెబుతున్నాడు.

మరి ఈ ఇన్నింగ్స్‌లతో టీమిండియా చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. ఆసియా కప్‌ 2023లో పృథ్వీ షాకు చోటు దక్కింతే.. అతనున్న ఫామ్‌ను చూస్తే.. వరల్డ్‌ కప్‌ 2023 కూడా అవకాశం ఉంది. కానీ, ముందు ఆసియా కప్‌ కోసం ఎంపిక కావాలి. అది దాదాపు కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హామ్‌ జట్టు 43.2 ఓవర్లలో కేవలం 198 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. నార్తాంప్టన్‌షైర్‌ బౌలర్లలో ప్రోక్టర్‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తాంప్టన్‌ షైర్‌కు పృథ్వీ షా సులువైన విజయం అందించాడు. కేవలం 25.4లోనే ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. షా 125 పరుగులతో చెలరేగితే.. రోబ్‌ 42 పరుగులతో రాణించాడు. మొత్తం మీద 4 వికెట్లు నష్టపోయి నార్తాంప్టన్‌షైర్‌ టార్గెట్‌ను ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విండీస్‌దే సిరీస్‌! చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి 4 ప్రధాన కారణాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి