4 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న పాక్‌ క్రికెటర్లు! వరల్డ్‌ కప్‌ ముందు..

వరల్డ్‌ కప్‌ మహాసంగ్రామం ఆరంభానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే నెల 5 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీకి టాస్‌ పడనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన జట్లన్నీ సంసిద్ధంగా ఉంటే.. పాకిస్థాన్‌ టీమ్‌ మాత్రం జీతాల సమస్యతో ఇబ్బంది పడుతోంది. బాబర్‌ సేనకు దాదాపు నాలుగు నెలలుగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నయా పైసా చెల్లించలేదట. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీకి ముందు జీతాలు లేక పాక్‌ క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. వరల్డ్‌ కప్‌ ప్రమోషన్స్‌తో పాటు టీమ్‌ స్పాన్సర్‌ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని పాక్‌ క్రికెటర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆర్థికంగా పటిష్టంగానే ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు.. నాలుగు నెలలుగా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులతో పాటు ఇతర బకాయిలను ఎందుకు చెల్లించలేకపోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఈ వివాదాని కంటే ముందు.. పాకిస్థాన్‌ ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసిందే. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయని, అందుకే షాదాబ్‌ బహిరంగంగా కెప్టెన్‌ బాబర్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు షాదాబ్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కూడా నిర్ణయించినట్లు కొంతమంది చెప్పుకొచ్చారు.

కానీ, తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించిన టీమ్‌లో వైస్‌ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో.. విభేదాలు సద్దుమణిగినట్లు అంతా భావించారు. అలాగే షాహీన్‌ షా అఫ్రిదీ వివాహానికి బాబర్‌ అజమ్‌ హాజరు కావడంతో.. వారిద్దరి మధ్య కూడా గొడవలు ఏం లేవని తేలిపోయింది. వరల్డ్‌ కప్‌కి ముందు ఆటగాళ్ల మధ్య గొడవలన్నీ చల్లారడంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఊపరి పీల్చుకున్నారు. కానీ, వెంటనే జీతాల సమస్యతో ఆటగాళ్లు నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలిసి.. అసలు పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఏం జరుగుతోందంటూ.. సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి 4 నెలలుగా పాక్ క్రికెటర్లకు జీతాలు ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్​లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!

Show comments