iDreamPost

IND vs PAK: మనసులు గెలుచుకున్న పాక్ క్రికెటర్ షాదాబ్!

IND vs PAK: మనసులు గెలుచుకున్న పాక్ క్రికెటర్ షాదాబ్!

భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇరు జట్లు చెరో పాయింట్ తో సరిపెట్టుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు స్టేడియం దాకా వెళ్లిన అభిమానులు సగం మ్యాచ్ తోనే సరిపెట్టుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లకు ఒకింత న్యాయం జరిగిందనే చెప్పాలి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో జట్టుకు తెలిసనట్లు అయింది. అలాగే పాక్ బౌలర్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నారు అనే విషయం భారత ఆటగాళ్లకు అర్థమైంది. సెప్టెంబర్ 4న నేపాల్ వేదికగా జరగబోయే మ్యాచ్ కు ఇది ముందస్తు సన్నద్ధతగా భావించవచ్చు.

ఇంక ఈ మ్యాచ్ లో చాలానే ఆసక్తికర విషయాలు జరిగాయి. ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా పార్టనర్ షిప్, జాస్ప్రిత్ బుమ్రా వీరోచిత బ్యాటింగ్, షాహీన్ అఫ్రీది, నసీమ్ షా, రౌఫ్ అద్భుతమైన బౌలింగ్ వంటివి చూశాం. అయితే ఇంకో విషయం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటనను మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అదే హార్దిక్ పాండ్యాకు పాక్ క్రికెటర్ షాదాబ్ షూ లేస్ కట్టడం. నిజానికి భారత్- పాక్ మ్యాచ్ అంటే వాతావరణం మొత్తం ఎంతో ఉద్రిక్తతగా ఉంటుందని. వాళ్లు ఉప్పు- నిప్పులా ఉంటారని అనుకుంటారు.

వాస్తవానికి క్రికెటర్లు ఎంతో సన్నిహింతగా ఉంటారు. వాళ్లంతా సోదర భావంతోనే మెలుగుతూ ఉంటారు. ఈ మ్యాచ్ కి ముందు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ సిరా, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రీది, రౌఫ్ అంతా కలిసి ముచ్చటించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఇలా హార్దిక్ పాండ్యాకి షూ లేస్ కట్టి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. అంతేకాకుండా.. టీమిండియా క్రికెట్ అభిమానులు కూడా షాదాబ్ చేసిన పనికి ఫిదా అయిపోయారు. శభాష్ షాదాబ్ అంటూ నెట్టింట ఈ ఫొటోని వైరల్ చేస్తున్నారు. క్రీడల్లో ఇలాంటి స్ఫూర్తి తప్పకుండా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక మ్యాచ్ రిజల్ట్ చూస్తే.. ఈ మ్యాచ్ టీమిండియాకి ఒక వేకప్ కాల్ అనే చెప్పాలి. టాపార్డర్ మరింత తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. రోహిత్ శర్మ(11), శుభ్ మన్ గిల్(10), విరాట్ కోహ్లీ(4), శ్రేయాస్ అయ్యర్(14) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా(87) రాణించకపోయి ఉంటే అత్యల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్ అయ్యి ఉండేది. రవీంద్ర జడేజా(14) కూడా ఆశించిన మేర రాణించలేకపోయాడు. టాపార్డర్ తో పోల్చుకుంటే బౌలర్ జాస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అప్పటికి వర్షం పడటం కారణంగా పిచ్ కాస్త స్వభావాన్ని మార్చుకుని ఉండచ్చు. కానీ, కారణం ఏదైనా బుమ్రా మాత్రం తన బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. 3 ఫోర్ల సాయంతో 14 బంతుల్లో 16 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు పాక్ బౌలర్లను కంగారు పెట్టేశాడు. పాకిస్తాన్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కేవలం ముగ్గురు బౌలర్లే 10 వికెట్లు సొంతం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి