Nicholas Pooran: సౌతాఫ్రికాపై పూరన్ సిక్సర్ల వర్షం.. పిచ్చకొట్టుడు కొట్టాడు!

Nicholas Pooran, SA vs WI: విండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పూరన్.. సిక్సుల వర్షం కురిపించాడు. అతడి దెబ్బకు బౌలింగ్ వేయాలంటేనే ప్రొటీస్ బౌలర్లు భయపడిపోయారు.

Nicholas Pooran, SA vs WI: విండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పూరన్.. సిక్సుల వర్షం కురిపించాడు. అతడి దెబ్బకు బౌలింగ్ వేయాలంటేనే ప్రొటీస్ బౌలర్లు భయపడిపోయారు.

ఈ జనరేషన్ లో టాప్ హిట్టర్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు వెస్టిండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టే పూరన్.. చూస్తుండగానే అవతలి జట్టు నుంచి మ్యాచ్ ను లాగేసుకుంటాడు. అతడు ఉన్నంత సేపు స్కోరు బోర్డు బుల్లెట్ స్పీడ్ తో పరుగులు పెట్టాల్సిందే. ఏ టీమ్, బౌలర్లు ఎవరనేది పట్టించుకోకుండా ఊచకోతకు దిగే పూరన్ చేతిలో ఈసారి సౌతాఫ్రికా బలైంది. ఆ టీమ్ తో జరిగిన తొలి టీ20లో విండీస్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రొటీస్ విసిరిన 176 పరుగుల టార్గెట్ ను మరో 3 వికెట్లు ఉండగానే ఛేదించింది. కరీబియన్ ఇన్నింగ్స్ లో పూరన్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్ గా నిలిచింది. బౌలర్లను టార్గెట్ చేసి సిక్సుల వర్షం కురిపించాడతను.

సౌతాఫ్రికాపై 26 బంతుల్లోనే 65 పరుగులతో విధ్వంసం సృష్టించాడు పూరన్. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఈ చిచ్చరపిడుగు మొదట్నుంచే బాదుడు మొదలుపట్టాడు. 2 బౌండరీలతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు కొట్టాడు పూరన్. 250 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ప్రొటీస్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అతడికి బంతులు వేయాలంటేనే అపోజిషన్ టీమ్ బౌలర్లు భయపడిపోయారు. ఎలా వేసినా బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. బర్గర్ సహా మిగతా బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. అగ్నికి ఆయువు తోడైనట్లు పూరన్ కు జతగా షై హోప్ (36 బంతుల్లో 51) కూడా చెలరేగిపోయాడు.

పూరన్-హోప్ ఆడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపించింది. ఏమాత్రం భయపడకుండా స్వేచ్ఛగా షాట్లు కొట్టారు. బంతి వచ్చిందే తడవు బాదిపారేశారు. 14వ ఓవర్ లో హోప్ ఔట్ అయినా పూరన్ చివరివరకు నాటౌట్ గా ఉండి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఇంకో 13 బంతులు ఉండగానే విండీస్ లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ టీమ్ లో ట్రిస్టన్ స్టబ్స్ (42 బంతుల్లో 76), ప్యాట్రిక్ క్రూగర్ (32 బంతుల్లో 44) రాణించారు. వీళ్లిద్దర్ని మినహాయిస్తే మిగతా వాళ్లంతా ఫెయిలయ్యారు. రీజా హెండ్రిక్స్ (4), కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (14), వాండర్ డస్సెన్ (5) విఫలమవడం జట్టును దెబ్బతీసింది. స్టబ్స్, క్రూగర్ ఆడకపోతే సౌతాఫ్రికా స్కోరు 150 కూడా దాటేది కాదు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ (3 వికెట్లు), షమర్ జోసెఫ్ (2 వికెట్లు) అదరగొట్టారు.

Show comments