iDreamPost
android-app
ios-app

కొడుకు టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఆడినా.. ఇంకా ఇళ్లలో పనికి వెళ్తున్న తల్లి!

  • Published Jul 06, 2024 | 6:31 PM Updated Updated Jul 06, 2024 | 6:31 PM

Nepal, Sompal Kami, Patiala, T20 World Cup 2024: కొడుకు టీ20 వరల్డ్‌ కప్‌లు ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతుంటే.. తల్లి ఇంకా నాలుగు ఇళ్లలో పనిచేస్తోంది. ఆ క్రికెటర్‌, అతని తల్లి ఎవరో? వాళ్ల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Nepal, Sompal Kami, Patiala, T20 World Cup 2024: కొడుకు టీ20 వరల్డ్‌ కప్‌లు ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతుంటే.. తల్లి ఇంకా నాలుగు ఇళ్లలో పనిచేస్తోంది. ఆ క్రికెటర్‌, అతని తల్లి ఎవరో? వాళ్ల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 06, 2024 | 6:31 PMUpdated Jul 06, 2024 | 6:31 PM
కొడుకు టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఆడినా.. ఇంకా ఇళ్లలో పనికి వెళ్తున్న తల్లి!

క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే దేశాల్లో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు వెళ్లేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, అందులో సక్సెస్‌ అయి జాతీయ జట్టు ఎంపికై, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం, అదృష్టం చాలా కొంతమందికి మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశం వస్తే.. వాళ్ల తలరాత మారిపోయినట్లే లెక్క. ఒక్కసారి జాతీయ జట్టుకు ఎంపికైతే.. పేరుకు పేరు, డబ్బుకు వచ్చిపడుతుంది. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత కాస్త మంచి ప్రదర్శన చేస్తే స్టార్‌డమ్‌ కూడా వచ్చేస్తుంది. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగి.. టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి ఐసీసీ మెగా టోర్నీల్లో ఓ క్రికెటర్‌ ఆడుతున్నాడంటూ.. అతని ఫ్యామిలీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లే.. కానీ, పదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నా, టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఓ క్రికెటర్‌ తల్లి ఇంకా నాలుగు ఇళ్లలో పనిచేస్తోంది.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో నేపాల్‌ జట్టు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా ఉన్న సోంపాల్‌ కమీకి ఇండియాతో సంబంధాలు ఉన్నాయి. అతని తల్లిదండ్రులు ఇండియాలోని పంజాబ్‌లో గల పటియాలలోనే నివశిస్తున్నారు. సోంపాల్‌ కమీ కూడా చిన్నతనంలో పటియాలలోనే చదువుకున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకుని.. తన మాతృదేశం నేపాల్‌ జాతీయ జట్టుకు ఎంపికై.. ఆ దేశానికి ఆడుతున్నాడు. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా ఆడాడు. అయితే.. సోంపాల్‌ 2014 నుంచే నేపాల్‌ టీమ్‌లో ఉన్నాడు. అయినా కూడా అతని తల్లి ఇప్పటికీ ధనికుల ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ.. జీవనం సాగిస్తోంది.

సోంపాల్‌ కమీ తండ్రి రామ్‌ బహదూర్‌, తల్లి జూనా దేవీ ప్రస్తుతం పటియాలలోనే ఉంటున్నారు. రామ్‌ బహదూర్‌ స్థానికంగా పనిచేస్తూ ముగ్గురు కుమారులను పెంచి పెద్ద చేసి.. చదువు చెప్పించారు. భర్తకు చేదోడు వాదోడుగా జూనా దేవీ సైతం నాలుగు ఇళ్లలో పనిచేస్తూ.. కుటుంబ పోషణకు తన వంత కృషి చేసింది. సోంపాల్‌ను గొప్ప క్రికెటర్‌ను చేయాలనే కల కోసమే తాము ఇంత కష్టపడ్డామని జూనా దేవీ తెలిపారు. సోంపాల్‌ క్రికెట్‌ కోచింగ్‌ కోసం తన సంపాదనతో పాటు అప్పులు కూడా చేశామని అన్నారు. తమ కుమారుడు క్రికెటర్‌ అని నేపాల్‌కు ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందని, అతను క్రికెటర్‌గా అయిన తర్వాత.. అమెరికాలో ఆడి డాలర్లు తేస్తే.. వాటిని భారత కరెన్సీలోకి మార్చి తమ అప్పులన్ని తీర్చేశామని ఆమె తెలిపారు.

అయితే.. సోంపాల్‌ను క్రికెటర్‌ను చేయాలని నేను కలలు కంటున్న సమయంలో చాలా మంది మీకు తినడానికే గతి లేదు.. పెద్ద పెద్ద కలలు ఎందుకని హేళన చేశారని, అయినా నేను నా కొడుకుని క్రికెటర్‌ను చేసి తీరుతానని వాళ్లతో చెప్పినట్లు దేవీ వెల్లడించారు. నీ కొడుకు క్రికెటర్‌ అయ్యాడు, చాలా బాగా ఆడుతున్నాడు, అతనికి పోలీసులు సెక్యురిటీగా ఉంటున్నారు.. అయినా నువ్వు ఇళ్లలో ఎందుకు పని చేస్తున్నావ్‌? నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని తనతో చాలా మంది చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. నేను ఇళ్లలో పనిచేయడానికి ఏం సిగ్గుపడటం లేదు అని స్పష్టం చేశారు సోంపాల్‌ తల్లి జూనా దేవి. మరి కొడుకు స్టార్‌ క్రికెటర్‌ అయినా.. ఇంకా ఇళ్లలో పనిచేస్తున్న ఈ తల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.