మన దేశంలో స్పోర్ట్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రికెటే అని చెప్పడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇది మన సొంతాట కాకపోయినా అనధికారిక జాతీయ క్రీడగా మారిపోయింది. భారత్ అంటే క్రికెట్, క్రికెట్ అంటే భారత్ అనేలా పరిస్థితి తయారైంది. జెంటిల్మన్ గేమ్‌కు ఇండియాలో ఉండే క్రేజ్ వేరు. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. ఏ గల్లీలో చూసినా, ఏ మైదానంలో చూసినా పిల్లలు, యువకులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అంతలా ఈ ఆట మనలో కలిసిపోయింది. క్రికెట్‌ను ఓ మతంగా, క్రికెటర్లను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్‌కు ఇక్కడ కొదువే లేదు.
భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత పాపులారిటీ మరే ఇతర క్రీడకూ లేదనేది విస్పష్టం. కానీ ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లీగ్‌ల నిర్వహణ ద్వారా కబడ్డీ, కుస్తీ, హాకీ, ఫుట్‌బాల్ లాంటి ఆటలకు ఈమధ్య ప్రాచుర్యం బాగా పెరిగింది. వీక్షకాదరణ కూడా ఎక్కువగా ఉండటంతో ఈ లీగ్‌ల హవా నడుస్తోంది. ఇదే టైమ్‌లో ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేదికల మీద కొందరు అథ్లెట్లు తమ సత్తా చాటుతూ స్టార్లుగా మారారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. గత ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ అందించి ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు నీరజ్. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడు రజత పతకాన్ని సాధించాడు. డైమండ్ లీగ్‌లో విన్నర్‌గా నిలిచాడు.
ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఆసియా క్రీడాకారుడు నీరజ్ చోప్రానే కావడం విశేషం. అలాంటి నీరజ్ ఓ పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్‌ను మెచ్చుకున్నాడు. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిన మహ్మద్ యాసిర్‌కు నీరజ్ ఫోన్ కాల్ చేశాడు. కాంస్యం గెలిచినందుకు యాసిర్‌ను అభినందించిన నీరజ్.. ఫ్యూచర్ ఈవెంట్లలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. నీరజ్ అభినందనలతో యాసిర్ సంబరపడుతున్నాడు. నీరజ్ పెర్ఫార్మెన్స్ను, అతడి ప్రాక్టీస్‌ను తాను బాగా పరిశీలిస్తానని చెప్పాడు. ఇండియన్ అథ్లెట్స్‌కు ఉన్నన్ని సౌకర్యాలు తమకు లేవని.. సరైన పరికరాలు కూడా లేవని, విదేశీ కోచ్లూ లేరని మహ్మద్ యాసిర్ చెప్పాడు.