SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా అతని పేరు వింటే క్రికెట్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఐపీఎల్‌లో అతని ఆట చూసేందుకు స్టేడియాలు నిండిపోతాయి. దేశంలో ఏ మూలన మ్యాచ్ జరిగినా.. ధోని ఆడుతున్నాడంటే చాలు అభిమాన సంద్రం పొటెత్తుంది. ఇండియాలో ధోని రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ రోజు(జూలై 7) ధోని పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్‌ల జడివాన కురుస్తోంది.
చాలా చోట్ల ధోని అభిమానులు భారీ కటౌట్లు సైతం ఏర్పాటు చేసి ధోనిపై తమకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనిపై అభిమానం చూపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ధోని అభిమానులు పోటీ పడుతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ధోని పుట్టిన రోజు సందర్భంగా ఇటు హైదరాబాద్‌లోనూ అలాగే అటూ ఏపీలోనూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు భారీ కటౌట్లు నిన్నటి నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు చోట్ల ధోని అభిమానులే వీటిని ఏర్పాటు చేసినా.. చివరికి ఇది ఏపీ వర్సెస్ తెలంగాణ అభిమానుల మధ్య కటౌట్ ఫైట్‌లా మారింది.
హైదరాబాద్‌లో 52 అడుగుల ధోని కటౌట్ ఏర్పాటే చేస్తే.. ఏపీలో 77 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో టీమిండియా జెర్సీలో బ్యాటింగ్‌కు వెళ్తున్న ధోని కటౌట్‌ను పెట్టారు. ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జెర్సీలో ఉన్న కటౌట్ పెట్టారు. ఈ రెండు భారీ కటౌట్లు ధోని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలో మరెక్కడా కూడా ఇంత భారీ కటౌట్లు ఇప్పటి వరకు ధోనికి పెట్టలేదు. కాగా.. ఈ కటౌట్ వార్‌ను గతంలో సినిమా హీరోల విషయంలో జరిగేదని, ఇప్పుడు ఒకే క్రికెటర్‌కు సంబంధించిన రెండు రాష్ట్రాల అభిమానుల మధ్య జరుగుతుందని నెటిజన్లు సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.