క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లోనే 238 పరుగుల భారీ తేడాతో నేపాల్ పై విజయం సాధించిన పాకిస్థాన్ ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ పంపించింది. అయితే ఆసియా కప్ లో అందరి దృష్టి సెప్టెంబర్ 2న జరిగే ఇండియా-పాక్ మ్యాచ్ పైనే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమవుజ్జీవుల సమరం కావడంతో.. మ్యాచ్ హోరాహోరిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. పాక్ తో మ్యాచ్ అనగానే ఎందుకో తెలీదు కోహ్లీకి పూనకాలు వస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఇక పాక్ బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాక్ తో మ్యాచ్ అనగానే కోహ్లీకి పూనకాలు వస్తాయని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 2న ఇండియా-పాక్ మ్యాచ్ నేపథ్యంలో అతడు స్పందించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో కైఫ్ మాట్లాడుతూ..”గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాక్ పై కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. కోహ్లీ పాక్ తో మ్యాచ్ అనగానే చెలరేగిపోతాడు. మెుత్తం బాధ్యతను తన భుజాలపైన వేసుకుని బ్యాటింగ్ చేస్తాడు. అతడు ఛేజింగ్ కింగ్ అని మనందరికి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికే పాక్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందనడం అతిశయోక్తికాదు” అంటూ విరాట్ పై ప్రశంసలు కురిపించాడు.
కాగా.. విరాట్ కోహ్లీకి పాక్ బౌలర్ల బలహీనతలు ఏంటో స్పష్టంగా తెలుసని కైఫ్ పేర్కొన్నాడు. పాక్ తో మ్యాచ్ లో కోహ్లీ ప్రమాదకారి అని పాక్ ఆటగాళ్లకు కూడా తెలుసని కైఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అతడిని ఔట్ చేస్తే మ్యాచ్ ని ఈజీగా గెలవొచ్చు అని వారికి తెలుసని పేర్కొన్నాడు. మరి విరాట్ కోహ్లీ పాక్ తో మ్యాచ్ అంటే చెలరేగి ఆడతాడు అన్న కైఫ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.