iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికా కొంపముంచిన లబుషేన్‌! కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏంటి?

  • Published Sep 08, 2023 | 8:57 AM Updated Updated Sep 08, 2023 | 8:57 AM
  • Published Sep 08, 2023 | 8:57 AMUpdated Sep 08, 2023 | 8:57 AM
సౌతాఫ్రికా కొంపముంచిన లబుషేన్‌! కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏంటి?

సౌతాఫ్రికాతో గురువారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గెలిచింది అనేకంటే.. మార్నస్‌ లబుషేన్‌ గెలిపించాడు అనే చెప్పాలి. 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో 8వ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి, 80 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియాకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. అతనికి అష్టన్‌ అగర్‌ 48 పరుగులతో మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి అసాధారణ బ్యాటింగ్‌తో ఓటమి కోరల్లో చిక్కుకున్న ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెలరేగుతుంటే.. 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. 223 పరుగుల టార్గెట్‌ను ఛేదించి 3 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్ టెంబా బవుమా 142 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్(32) విలువైన పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమవ్వడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయింది. లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియాను సఫారీ బౌలర్లు వణికించారు. రబడా నిప్పులు చిమ్ముతుంటే.. ఆసీస్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేవిడ్ వార్నర్(0), మిచెల్ మార్ష్(17), జోష్ ఇంగ్లీస్(1), అలెక్స్ క్యారీ(3), మార్కస్ స్టోయినీస్(17), సీన్ అబాట్(9) దారుణంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్(0) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆసీస్‌కు ఘోర పరాజయం తప్పదని అంతా భావించారు.

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌..
కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తీవ్రంగా గాయపడిన కామెరూన్ గ్రీన్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటం, కావాల్సినన్ని ఓవర్లు మిగిలి ఉండటంతో కూల్‌గా లబుషేన్‌ తన టెస్ట్‌ స్పెషాలిటీ చూసిస్తూ.. 93 బంతుల్లో 8 ఫోర్లతో 80 పరుగులు చేసి.. జట్టును ఓటమి నుంచి తప్పించి.. గెలుపుబాట పట్టించాడు. ఇక కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏంటంటే.. క్రికెటర్ల తలకు బలమైన గాయమైనప్పుడు అతని సామర్థ్యానికి సరిపడే ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ రూల్‌. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే తీవ్రంగా గాయపడిన కామెరూన్ గ్రీన్ స్థానంలో లబుషేన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ప్లాన్‌ ప్రకారం అతన్ని 8వ స్థానంలో బ్యాటింగ్ పంపారు. అది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. మరి ఈ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ రూల్‌తో పాటు లబుషేన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇదికదా బ్యాటింగ్ అంటే.. బవుమా వన్ మ్యాన్ షో! హ్యాట్సాఫ్..