KL రాహుల్.. టీమిండియాలో క్లాసికల్ బ్యాటర్ గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా.. జట్టులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే గాయం కారణంగా కొన్ని నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు రాహుల్. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే అతడిని ఎలా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారని, పైగా అతడు మునుపటి ఫామ్ లో లేడని అందరూ విమర్శించారు. ఈ విమర్శలన్నింటికి తన బ్యాట్ తోనే తాజాగా సమాధానం ఇచ్చాడు రాహుల్. వరల్డ్ కప్ లో ఆసీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో అతడిని విమర్శించిన నోర్లే.. పొగుడుతున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. దీంతో నెటిజన్లు రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ రాహుల్ చేసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేఎల్ రాహుల్.. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో హీరో ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పాడు. దీంతో తనపై వచ్చిన విమర్శలన్నింటికీ బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు ఈ స్టార్ బ్యాటర్. మిడిలార్డర్ లో తానెంత ప్రమాదకారో మరోసారి రుజువుచేశాడు. ఇక రాహుల్ ఆటతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు రాహుల్. పేదరికంతో బాధపడుతున్న ఓ విద్యార్థినికి అండగా నిలిచి, ఆమె లక్ష్యానికి బాటలు వేశాడు.
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని సిద్దేశ్వర్ కాలనీకి చెందిన హనుమంతప్ప-సుమిత్ర దంపతులకు సృష్టి అనే కుమార్తె ఉంది. ఆ బాలిక డాక్టర్ అవ్వాలని కలలు కంది. కానీ చదువుకు పేదరికం అడ్డంకిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్.. బాలిక వివరాలను టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కు తెలియపరిచాడు. దీంతో ఆ అమ్మాయి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రాహుల్. గతంలో కూడా ఎంతో మందికి ఇలాంటి చేయూత అందించాడు రాహుల్. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చేసిన పని ఎంతో గొప్పది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాహుల్ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.