ఆటగాళ్లు గాయాలపాలవ్వడం అనేది సహజమే. ఇది క్రికెట్లోనూ జరుగుతూనే ఉంటుంది. ఫీల్డింగ్ లేదా బౌలింగ్ చేస్తున్నప్పుడు లేదా వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నప్పుడు క్రికెటర్లు గాయాల పాలవ్వడం చూస్తూనే ఉంటాం. కొందరు ప్లేయర్లు మ్యాచ్‌ల్లో కాకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయాల బారిన పడి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంజ్యురీ నుంచి ఎంత త్వరగా కోలుకుంటారు, కమ్‌బ్యాక్‌లో ఎలా ఆడతారనేదే చాలా కీలకం. గాయం తర్వాత ఆటగాళ్లు మునుపటి లయను కోల్పోవడం, అంతకుముందులా ఆడని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం గాయం నుంచి కోలుకొని సూపర్బ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తారు.
భారత స్టార్ వికెట్ కీపర్/బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా అదిరిపోయే రేంజ్లో రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఆరు నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు రాహుల్. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ఈ బ్యాటర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో తానేంటో మరోమారు నిరూపించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో తన ఫామ్, ఫిట్‌నెస్‌పై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు. బలమైన పాక్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొంటూ సుదీర్ఘ సమయం ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్ చేశాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చక్కటి స్ట్రోక్ ప్లేతో కేఎల్ రాహుల్ మెప్పించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా బలహీనంగా కనిపిస్తున్న మిడిలార్డర్‌కు కూడా భరోసానిచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు పాక్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ కూడా చేసి ఆకట్టుకున్నాడు. కమ్‌బ్యాక్‌లో సెంచరీతో అదరగొట్టిన రాహుల్‌పై అతడి భార్య అతియా శెట్టి ప్రశంసల జల్లులు కురిపించింది. భర్త సెంచరీపై ఆమె ఎమోషనల్ అయ్యింది. ‘ఎంత అగాథమైన చీకటైనా సూర్యుడు ఉదయించగానే ముగుస్తుంది. మీరే నాకు సర్వస్వం’ అని సోషల్ మీడియాలో అతియో ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై భారత క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. రాహుల్ ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: శ్రీలంకతో మ్యాచ్.. భారత ప్లేయింగ్ 11లో మార్పులు?