iDreamPost
android-app
ios-app

ఐర్లాండ్‌ టీమ్‌లో జూనియర్ జహీర్ ఖాన్! అతనితో జర జాగ్రత్త!

  • Published Aug 18, 2023 | 4:29 PM Updated Updated Aug 18, 2023 | 4:29 PM
  • Published Aug 18, 2023 | 4:29 PMUpdated Aug 18, 2023 | 4:29 PM
ఐర్లాండ్‌ టీమ్‌లో జూనియర్ జహీర్ ఖాన్! అతనితో జర జాగ్రత్త!

పసికూన ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఐరిష్‌ కంట్రీకి వెళ్లింది. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 18) రాత్రి 7 గంటలకు ఐర్లాండ్‌-భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. టీమిండియా సీనియర్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీలో యంగ్‌ ఇండియన్‌ టీమ్‌.. ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. చాలా కాలంగా జట్టుకు దూరమైన బూమ్‌ బూమ్‌ బుమ్రా.. ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో సత్తా చాటేందుకు ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌లా వాడుకోకున్నాడు.

అయితే.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఐర్లాండ్‌పై కూడా అనూహ్య ఫలితం రాకుండా ఉండాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, ఒక విషయం మాత్రం టీమిండియాను కలవరపెడుతోంది. అదేంటంటే.. ఐర్లాండ్‌లో జూనియర్‌ జహీర్‌ ఖాన్‌ ఉండటమే. అతను టీమిండియాకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ఎవరీ ఐర్లాండ్‌ జహీర్‌ ఖాన్‌? నిజంగానే అంత డేంజర్‌ బౌలరా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఐర్లాండ్‌లో జోషువా లిటిల్‌ అనే ఓ 23 ఏళ్ల యువ బౌలర్‌ ఉన్నాడు. నిజానికి ఇతను ఐర్లాండ్‌లాంటి పసికూన టీమ్‌లో ఉండాల్సిన బౌలర్‌ కాదు. ఎందుకంటే అతని ఆట తీరు ఆస్ట్రేలియా పేసర్లతో పోటీ పడేలా ఉంటుంది. ఈ పేసర్‌ బలం స్వింగ్‌. వేగంతో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్‌ చేయగలడు. ఇన్‌ స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌తో బ్యాటర్లకు చెమటలు పట్టిస్తాడు. బౌలింగ్‌ వేస్తుంటే.. చూసేందుకు బాల్‌ చాలా ఈజీగా బ్యాట్‌పైకి వస్తున్నట్లే ఉంటుంది కానీ, సరిగ్గా బ్యాట్‌ దగ్గరికి వచ్చేసరికీ అనూహ్యంగా స్వింగ్‌ అయి వికెట్లను గిరాటేస్తుంది. పైగా అతని బౌలింగ్‌ యాక్షన్‌ కూడా చాలా చూడముచ్చటగా ఉంది.

టీమిండియా మాజీ దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ సైతం స్వింగ్‌తో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లను ఎలా వణికించాడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ లిటిల్‌ జహీర్‌ ఖాన్‌ సైతం తన స్వింగ్‌తో బ్యాటర్లను భయపెడుతున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఏకంగా న్యూజిలాండ్‌ జట్టుపైనే హ్యాట్రిక్‌ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. కేన్‌ విలియమ్సన్‌ లాంటి ప్రపంచ మేటీ బ్యాటర్‌ను కూడా అవుట్‌ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌తో సిరీస్‌కు సిద్ధమైన టీమిండియాలో అంతా యంగ్‌ బ్యాటర్లే ఉండటం.. ఐర్లాండ్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం వారికి లేకపోవడంతో జోషువా లిటిల్‌ మరింత ప్రమదకారిగా మారే అవకాశం ఉంది. లిటిల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. టీమిండియాకు ఇక తిరుగులేనట్లే. మరి ఐర్లాండ్‌ జహీర్‌ ఖాన్‌గా పేరుతెచ్చుకున్న జోషువా లిటిల్‌ బౌలింగ్‌పై, అలాగే టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐర్లాండ్‌తో తొలి టీ20.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే! టీమ్‌ అదిరిపోయిందిగా..