iDreamPost
android-app
ios-app

James Anderson: జేమ్స్ అండర్సన్‌.. 22 ఏళ్ల పాటు ఎలా ఆడగలిగాడు? ఓ స్వింగ్ సుల్తాన్ కథ!

  • Published Jul 13, 2024 | 5:35 PM Updated Updated Jul 23, 2024 | 2:54 PM

James Anderson, England: అంతర్జాతీయ క్రికెట్‌లో 22 ఏళ్ల కెరీర్‌.. 704 టెస్టు వికెట్లు.. టెస్టు క్రికెట్‌లో 40,001 బంతులేసిన ఏకైక బౌలర్‌.. రెండు దశాబ్దాల పాటు ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ భారాన్ని తన భుజంపై మోసిన దిగ్గజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

James Anderson, England: అంతర్జాతీయ క్రికెట్‌లో 22 ఏళ్ల కెరీర్‌.. 704 టెస్టు వికెట్లు.. టెస్టు క్రికెట్‌లో 40,001 బంతులేసిన ఏకైక బౌలర్‌.. రెండు దశాబ్దాల పాటు ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ భారాన్ని తన భుజంపై మోసిన దిగ్గజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 13, 2024 | 5:35 PMUpdated Jul 23, 2024 | 2:54 PM
James Anderson: జేమ్స్ అండర్సన్‌.. 22 ఏళ్ల పాటు ఎలా ఆడగలిగాడు? ఓ స్వింగ్ సుల్తాన్ కథ!

147 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ క్రికెట్‌లో తొలుత చాలా కాలం పాటు ఫాస్ట్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరుగా ఉండేది వెస్టిండీస్‌. ఆ తర్వాత పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా నుంచి గొప్ప గొప్ప ఫాస్ట్‌ బౌలర్లు వచ్చారు. కానీ, క్రికెట్‌కు పుట్టినిళ్లు అయిన ఇంగ్లండ్‌ జట్టులోకి ఓ గొప్ప బౌలర్‌ మాత్రం రెండు దశాబ్దాల క్రితం వచ్చాడు. అతని రాకకంటే ముందు కొంతమంది మంచి ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నా.. ఇంగ్లండ్‌ స్ట్రాంగ్‌ టీమ్‌గానే కనిపిస్తున్నా.. అతనొచ్చాకే ప్రత్యర్థి జట్లు ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ను ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడటం మొదలుపెట్టాయి. అతను వచ్చాక ఫాస్ట్ బౌలింగ్ అంటే అర్థాన్నే మార్చేశాడు. వేగంతో బ్యాట్స్‌మెన్‌కి భయం పుట్టించడం, రెప్పపాటు కాలంలో వికెట్స్‌ని గాల్లోకి లేపడం, ఒక్కడే సైన్యమై.. తన జట్టుకి విజయాన్ని కట్టబెట్టడం జెమ్స్‌ అండర్సన్‌ తన అలవాటుగా మార్చుకున్నాడు.

20 ఏళ్ల పాటు క్రికెట్‌ని కసితో శాసించడం, 20 మీటర్ల పిచ్‌పై రెండు దశాబ్దాల పాటు బంతి తాను చెప్పినట్లు నాట్యమాడటం.. ఇవన్నీ.. పుస్తకాల్లో ఓ బౌలర్‌ గురించి రాసిన నిర్వచనాలు కాదు! నిజంగానే ఒకడు సృష్టించిన బీభత్సం తాలూకు ఆనవాళ్లు! బ్యాటర్లపై కనీసం కనికరం లేని.. ఆ విధ్వంసం పేరు జేమ్స్ అండర్సన్. 1982 జులై 30న పుట్టిన అండర్సన్‌.. 20 ఏళ్లకే అంటే 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జిమ్మి.. 2003 మే 22న జింబాబ్వేతో ప్రారంభమైన టెస్టుతో సాంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో తన ఆగమనాన్ని అద్భుతంగా చాటాడు. అక్కడి నుంచి మొదలు పెడితే.. 21 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను తన బౌలింగ్‌తో శాసించాడు.

అండర్సన్‌ బౌలింగ్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ‘అడవిలో సింహం వేట భయంకరంగా ఉంటుంది. కానీ.., ఆ సింహాన్నే వేటాడే వేటగాడి పొగరు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అండర్సన్ బౌలింగ్’ అండర్సన్‌ కెరీర్‌లో సచిన్‌ టెండూల్కర్‌, బ్రియన్‌ లారా, రికీ పాంటింగ్‌, సనత్‌ జయసూర్య, కలిస్‌, రాస్‌ టేలర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ చాలా మంది గొప్ప గొప్ప బ్యాటర్లకు బౌలింగ్‌ చేశాడు. గాడ్ ఆఫ్ ది క్రికెట్.. సచిన్ ఫుట్ వర్క్‌ను చేధించిన అరుదైన బౌలర్ అతను. గ్రేట్ వాల్ ఆఫ్ ది క్రికెట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ని సైతం ముప్పతిప్పలు పెట్టిన టాలెంట్ అతనిది. గాడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ గంగూలీ ఆఫ్ స్టంప్‌ని గాల్లోకి లేపిన మెజీషియన్ ఎవరంటే ఒక్క అండర్సన్‌ పేరే చెప్పుకోవాలి. తన డిఫెన్స్‌తో బౌలర్లుకి చుక్కలు చూపించే పుజారాకి చెమటలు పట్టించిన.. డెవిల్, ఫుల్ షాట్స్ కింగ్ పాంటింగ్ చేత క్రీజ్‌లో నాగిని డ్యాన్స్ వేయించిన మాస్టర్, మైకేల్ క్లార్క్‌ని పిల్లాడిని చేసి ఆడించిన గేమ్ ఛేంజర్ అంటూ అండర్సన్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. గడచిన 20 ఏళ్ల కాలంలో తోపులని పేరు తెచ్చుకున్న బ్యాటర్స్ అంతా అండర్సన్ బాధితులంటే అతిశయోక్తి కాదు.

హేమాహేమీ బ్యాటర్ల పరిస్థితి ఇలా ఉంటే.. జస్ట్‌ అండర్సన్ కలలో బాల్ పట్టుకుని కనిపించినా.. పక్కలు తడిపేసుకున్న బ్యాటర్స్ చాలా మంది ఉన్నారు. అయితే.. అండర్సన్‌ తన 22 ఏళ్ల కెరీర్‌లో ఏకంగా 10 మంది కెప్టెన్సీలో ఆడాడు. తన తొలి టెస్ట్‌ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్ నుంచి చివరి టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వరకు ప్రతి కెప్టెన్‌కు ప్రధాన ఆయుధం అండర్సనే. ఎప్పుడు వికెట్‌ కావాలన్నా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ చూసేంది అతని వైపే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అండర్సన్‌ ఎంట్రీ ఇచ్చిన సయమంలో అప్పటి కెప్టెన్‌ నాసర్‌ చెప్పిన మాట.. ‘ఇంగ్లండ్‌ భవిష్యత్తు ఇతనే. రాబోయే కాలంలో ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌కు చిరునామాగా నిలుస్తాడు’ అని అతను చెప్పిన మాట అక్షర సత్యమైంది. 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అలుపెరగని పోరాట యోధుడిలా సాగిపోయాడు.

James anderson life story

క్రికెట్ ఆట స్వింగ్ కింగ్‌లని చూసింది.. స్వింగ్ సుల్తాన్‌లని చూసింది. కానీ.., క్రికెట్‌కి నిజమైన స్వింగ్ బౌలింగ్ అంటే రుచి చూపించిన దిగ్గజం మాత్రం అండర్సన్ మాత్రమే. స్వింగ్‌ బౌలింగ్‌కు మారుపేరుగా ఉన్న పాక్‌ బౌలర్లను ఒకానొక దశలో డామినేట్‌ చేస్తూ.. బెస్ట్ స్వింగ్‌ బౌలర్‌గా నిలిచాడు అండర్సన్‌. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెష్‌ యుద్ధంలో.. ఎన్నో మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలో ఆస్ట్రేలియాని వణికించిన ఏకైక బౌలర్‌ అతనే. 2010-11లో జరిగిన యాషెష్‌ సిరీస్‌లో అండర్సన్‌ ఏకంగా 24 వికెట్లతో చెలరేగాడు. కేవలం 2.93 ఎకానమీతో ఆస్ట్రేలియాను వణికించాడు.

దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాను 3-1తో మట్టికరిపించి.. యాషెష్‌ సిరీస్‌ను నెగ్గిందంటే ఒకే ఒక్కడు కారణం.. అతనే జెమ్స్‌ అండర్సన్‌. పేస్‌ బౌలర్‌గా తాను అద్బుతాలు చేయడమే కాదు.. తన తరంలో ఇంగ్లండ్‌ పేస్‌ యూనిట్‌కు లీడర్‌గా ఉంటూ.. మిగతా పేసర్లను ముందుకు నడిపించాడు. ఏళ్ల పాటు క్రికెట్‌ ఆడుతున్నా.. నిత్య విద్యార్థిగా ఉంటూ.. తనకు తెలియని విషయాలను ఇతర బౌలర్ల నుంచి నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు పదునెక్కేవాడు. టీమిండియా స్టార్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ నుంచి రివర్స్‌ స్వింగ్‌ నేర్చుకోవడం అందులో భాగమే. తన టెస్టు కెరీర్‌లో ఏకంగా 40,001 బంతులు వేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇన్ని లీగల్‌ డెవలరీస్‌ వేసిన మరో పేసర్‌ లేడు.

మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 188 టెస్టుల్లో 704 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. తన కంటే ముందు ముత్తయ్య మురళీధరణ్‌(800), షేన్‌ వార్న్‌(708) ఉన్నారు. వాళ్లిద్దరు స్పిన్నర్లు. కానీ, ఫాస్ట్‌ బౌలర్లలో అండర్సనే అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు తన సేవలు అందించిన అండర్సన్‌.. వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో ఈ నెల 12న ముగిసిన టెస్ట్‌తో రిటైర్‌ అయిపోయాడు. చివరిగా ఒక్క మాట.. గన్ నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌కి ఒక దిశ ఉంటుంది. నింగిలోకి దూసుకెళ్లే రాకెట్‌కి లక్ష్యం మాత్రమే ఉంటుంది. అండర్సన్ చేతి నుంచి వచ్చే బాల్ కూడా అలాంటి రాకెట్ లాంటిదే.. దాని లక్ష్యం వికెట్లను విచ్ఛిన్నం చేయడం, ప్రత్యర్థి బ్యాటర్‌ను పడగొట్టడం, తన టీమ్‌ను గెలిపించడం.