రికీ పాంటింగ్‌.. హీరోలని దాటి గెలిచిన విలన్ కథ! చరిత్ర అతనిని మర్చిపోదు!

Ricky Ponting Life Story: గొప్ప బ్యాటర్‌గా, గొప్ప కెప్టెన్‌గా.. ఆస్ట్రేలియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన పాంటింగ్‌.. ప్రపంచ క్రికెట్‌ దృష్టిలో ఒక విలన్‌గా ఎందుకు మారిపోయాడు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ricky Ponting Life Story: గొప్ప బ్యాటర్‌గా, గొప్ప కెప్టెన్‌గా.. ఆస్ట్రేలియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన పాంటింగ్‌.. ప్రపంచ క్రికెట్‌ దృష్టిలో ఒక విలన్‌గా ఎందుకు మారిపోయాడు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అతనో గొప్ప కెప్టెన్‌.. అంతకంటే అద్భుతమైన బ్యాటర్‌.. వాటితో పాటు సూపర్‌ ఫీల్డర్‌.. క్రికెట్‌లో ఒక దిగ్గజంగా ఎదిగేందుకు ఇంతకంటే ఏం కావాలి. అయితే.. ఇన్ని గుడ్‌ క్వాలిటీస్‌తో పాటు పొగరు, యూటిట్యూడ్‌, గొడవలతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక విలన్‌గా ఎదిగాడు రికీ పాంటింగ్‌. నైన్టీస్‌ కిడ్స్‌కి.. పాంటింగ్‌ అంటే వామ్మో వాడా? అనే భయం కలుగుతుంది. ఇండియాతో మ్యాచ్‌ అంటే చాలా శివాలెత్తేవాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌లోకి వచ్చి.. ఆటగాడిగా ఎదుగుతూ.. ఆసీస్‌ను తిరిగులేని శక్తిగా ప్రపంచ క్రికెట్‌లో దశాబ్దం పాటు నిలిపిన రింకీ థామస్‌ పాంటింగ్‌ గురించి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1992లో టాస్మానియా తరఫున.. రికీ పాంటింగ్‌ అనే కుర్రాడు ఆస్ట్రేలియా డొమెస్టిక్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పువ్వు పుట్టగానే వికసిస్తుంది అన్నట్లు.. పాంటింగ్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లోకి వచ్చీ రావడంతోనే తన సత్తా చూపించాడు. కానీ, అప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్‌లో షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, స్టీవ్‌ వా వంటి స్టార్లు ఉన్నారు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా.. పాంటింగ్‌ 1995 ఫిబ్రవరి 15న అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుర్రాడు ప్రపంచ క్రికెట్‌ను గెలికేసేందుకు వచ్చాడని, ఆస్ట్రేలియాను భయంకరంగా మార్చేస్తారని ఆ టైమ్‌లో ఎవ్వరికీ తెలియదు.

ఫస్ట్‌ మ్యాచ్‌లో 1 రన్ మాత్రమే..

ఎన్నో ఆశలతో సౌతాఫ్రికాపై తన తొలి ఇంటర్నేషనల్‌ వన్డే మ్యాచ్‌ ఆడిన పాంటింగ్‌.. ఫస్ట్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క రన్‌ మాత్రమే చేసి అవుట్‌ అవుతాడు. ఏ స్థాయికి వెళ్లాలన్నా.. ఒక్కటి తోనే మొదలుపెట్టాలనే సామెత.. పాంటింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. టన్నుల కొద్ది పరుగులు బాదిన పాంటింగ్‌.. తన కెరీర్‌ను ఒక్కటితోనే మొదలుపెట్టాడు. తొలి వన్డేలో విఫలమైనా.. పాంటింగ్‌ సత్తాపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు.. అతనికి టెస్టుల్లో కూడా అవకాశం ఇచ్చారు. వన్డేల్లో వచ్చిన బ్యాడ్‌ స్టార్ట్‌ను టెస్టుల్లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. అదే ఏడాది డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన శ్రీలంక బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొంటూ.. 96 పరుగులు చేశాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. క్రికెట్‌ ప్రపంచానికి విలన్‌ పరిచయం అయిపోయాడు.

1996 వన్డే వరల్డ్‌ కప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్‌లో పాంటింగ్‌ కూడా సభ్యుడయ్యాడు. మిడిల్డార్‌ బ్యాటర్‌గా మంచి స్కోర్లు చేశాడు. వెస్టిండీస్‌పై తన తొలి వరల్డ్‌ కప్‌ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ, ఆ వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌లో ఓడిపోయింది. ఆ ఫైనల్‌ ఓటమి బాధ పాంటింగ్‌ను కుంగదీసింది. మళ్లీ ఇలాంటి బాధను అనుభవించొద్దని ఫిక్స్‌ అయిపోయాడు. 1997లో తన తొలి యాషెస్‌ సిరీస్‌ ఆడిన పాంటింగ్‌.. నాలుగో టెస్ట్‌లో సెంచరీ చేసి.. ఇంగ్లండ్‌ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

1999 నుంచి అసలైన డామినేషన్‌

చూస్తుండగానే.. పాంటింగ్‌ తన రెండో వన్డే వరల్డ్‌ కప్‌కి రెడీ అయిపోయాడు. ఆ వరల్డ్‌ కప్‌లో మార్క్‌ వా, స్టీవ్‌ వా సూపర్‌ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలిపాడు. వారితో పాటు పాంటింగ్‌ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. స్టీవ్‌ వా, మార్క్‌ వా రిటైర్మెంట్‌ వయసుకి వచ్చేయడంతో పాంటింగ్‌ రూపంలో ఆస్ట్రేలియాకు ఒక హీరో.. ప్రపంచానికి ఒక విలన్‌ దొరికాడు. మ్యాచ్‌లు గెలవడమే పనిగా పెట్టుకున్నాడు.. అది ఎలాగైనా సరే. మాటతో రెచ్చగొట్టడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ చేయడం, అంపైర్లను బెదిరిస్తూ.. వాళ్ల నిర్ణయాలను ప్రభావితం చేయడం లాంటి ఎన్నో కాంట్రవర్సీలతో సహవాసం చేశాడు పాంటింగ్‌.

కెప్టెన్‌ అయిన అయ్యాక మరింత కసిగా..

స్టీవ్‌ వా తర్వాత.. ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్‌ పగ్గాలు అందుకున్న పాంటింగ్‌. 2002 వన్డే, 2004లో టెస్ట్‌ కెప్టెన్‌ అయ్యాడు. కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో ఒక మ్యాచ్‌ విన్నర్‌లా మారిపోయాడు. అతనితో పాటు.. షేన్‌ వార్న్‌, మెక్‌గ్రాత్‌, హేడెన్‌, గిల్‌క్రిస్ట్‌, సైమండ్స్‌, బ్రెట్‌ లీతో కూడిన ఆస్ట్రేలియా టీమ్‌ అంటే.. ప్రపంచ క్రికెట్‌ భయపడేలా మారిపోయింది పరిస్థితి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే ఆట పరంగా స్ట్రాంగ్‌గా ఉంటే సరిపోదు.. మానసికంగా కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే.. ఆసీస్‌ మాటల దాడిని ఎదుర్కొవాలి, పాంటింగ్‌ స్లెడ్జింగ్‌ను తట్టుకుంటూ నిలబడాలి. అది అంత సులువైన పని కాదు.. ఇలా ఆటతో పాటు స్లెడ్జింగ్‌తో.. ప్రపంచ క్రికెట్‌కు పూర్తిగా ఒక విలన్‌లా మారిపోయాడు పాంటింగ్‌. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌ను పాంటింగ్‌ ఎన్నిసార్లు అతిక్రమించాడో లెక్కేలేదు.

ఇండియా అంటే రెచ్చిపోయేవాడు..

పాంటింగ్‌ ఎంత గొప్ప బ్యాటరో అతని గణాంకాలే చెబుతాయి. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌ అతనే. కోహ్లీ రానంత వరకు నంబర్‌ టూగా ఉన్నాడు. వన్డేలు, టెస్టుల్లో టన్నుల కొద్ది పరుగులున్నాయి. తన ప్రైమ్‌ టైమ్‌లో ఏకంగా.. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ను కూడా పూర్తిగా డామినేట్‌ చేశాడు పాంటింగ్‌. అతను ఆడే ఫుల్‌ షాట్లకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. 2003 వన్డే వరల్డ్‌ కప్‌ను గుర్తు తెచ్చుకుంటూ.. భారత క్రికెట్‌ అభిమానులకు పాంటింగ్‌ అనే భూతం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని భారత జట్టు ఎన్నో అడ్డంకులు దాటి.. ఫైనల్‌ వరకు చేరుకుంది. కానీ, ఫైనల్‌లో పాంటింగ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా బౌలింగ్‌ను చీల్చిచెండాడు. 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులతో 140 పరుగులు చేసి.. టీమిండియా ముందు 359 పరుగులు కొండంత లక్ష్యం ఉంచాడు. పాంటింగ్‌ సునామీలో భారత వరల్డ్‌ కప్‌ ఆశలు కొట్టుకొపోయాయి.

గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఇన్‌ క్రికెట్‌ హిస్టరీ..

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో మరే కెప్టెన్‌ సాధించలేని విధంగా.. తన హయాంలో వరుసగా 4 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు పాంటింగ్‌. 2003లో వన్డే వరల్డ్‌ కప్‌, 2006లో ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2007లో వన్డే వరల్డ్‌ కప్‌, 2009లో ఛాంపియన్స్‌ ట్రోఫీని.. ఆస్ట్రేలియా పాంటింగ్‌ కెప్టెన్సీలో గెలిచింది. రెండు వరల్డ్‌ కప్‌లు, రెండు ఛాంపియన్స్‌ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌.. వరల్డ్‌ క్రికెట్‌ హిస్టరీలో ఒక్క పాంటింగ్‌ మాత్రమే. అలాగే వరుసగా మూడు వన్డే వరల్డ్‌ కప్‌లు గెలిచిన ఆసీస్‌ టీమ్‌లో పాంటింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. అయితే.. 1996 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమితో మొదలైన పాంటింగ్‌ ఎరా.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ క్వార్డర్‌ ఫైనల్‌తో ముగిసింది. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. పాంటింగ్‌ కెప్టెన్సీని వదిలేశాడు.

షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, గిల్‌క్రిస్ట్‌, హేడెన్‌ల రిటైర్మెంట్లతో ఆస్ట్రేలియా కాస్త బలహీనపడింది. కానీ, పాంటింగ్‌ అనే విలన్‌.. తన వారసత్వాన్ని.. రాబోయే తరానికి బలంగా అప్పజెప్పాడు. 1999 నుంచి 2007 వరకు ఆసీస్‌ వరల్డ్‌ కప్‌ వేటకు 2011లో టీమిండియా బ్రేక్‌ వేసింది. కానీ, షేన్‌ వాట్సన్‌, మైఖేల్‌ క్లార్‌తో పాంటింగ్‌ నిర్మించి యంగ్‌ టీమ్‌.. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ విజయంతో మరోసారి.. ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యం ప్రదర్శించాయి. మొత్తంగా తన కెరీర్‌ 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లు ఆడి పాంటింగ్‌ తన కెరీర్‌ను ముగించాడు. టెస్టుల్లో 13378, వన్డేల్లో 13704, టీ20ల్లో 401 రన్స్‌ చేశాడు. 41 టెస్ట్‌ సెంచరీలు, 30 వన్డేల సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఇలా.. ఆస్ట్రేలియాను ఓ దశాబ్దకాలం పాటు తిరుగులేని శక్తిగా నిలిపి.. ఆసీస్‌కి హీరో అయ్యాడు.. కానీ, తన అగ్రెసివ్‌ బిహేవియర్‌.. గెలుపుకోసం ఏదైన చేసే వ్వక్తిత్వంతో ప్రపంచ క్రికెట్‌లో ఒక విలన్‌గా ముద్ర వేస్తున్నాడు. మరి పాంటింగ్‌ క్రికెట్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments