iDreamPost

సంచలనం: చివరి 8 బంతుల్లో 5 వికెట్లు తీసి గెలిచిన టీమిండియా

  • Published Jul 12, 2023 | 8:58 AMUpdated Jul 12, 2023 | 8:58 AM
  • Published Jul 12, 2023 | 8:58 AMUpdated Jul 12, 2023 | 8:58 AM
సంచలనం: చివరి 8 బంతుల్లో 5 వికెట్లు తీసి గెలిచిన టీమిండియా

చివరి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఇది కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌. కానీ, టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగి.. విజయానికి చేరువై ఒత్తడికి గురైన బంగ్లాదేశ్‌ను వణికించారు. ఏకంగా చివరి 8 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి.. 5 వికెట్లు పడగొట్టి.. ఓడిపోయాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు సంచలన విజయం సాధించారు.

మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి రెండు టీ20ల్లో గెలిచి ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన 13, షఫాలీ వర్మ 19 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ కావడం కూడా భారత బ్యాటింగ్‌ వైఫల్యంపై ప్రభావం చూపించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు, టెయిలెంటర్లు కొన్ని పరుగులు చేయడంతో ఆ మాత్రమైన స్కోర్‌ వచ్చింది. మొత్తానికి టీమిండియా బంగ్లా ముందు 96 పరుగుల టార్గెట్‌ ఉంచింది.

లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ బ్యాటర్లను దీప్తి శర్మ వణికించింది. అయితే బంగ్లా కెప్టెన్‌ సుల్తానా 38 పరుగులతో రాణించడంతో బంగ్లా విజయం వైపు దూసుకెళ్లింది. చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరమైన దశలో.. దీప్తి శర్మ 19వ ఓవర్‌ ఐదో బంతికి బంగ్లా కెప్టెన్‌ సుల్తానాను అవుట్‌ చేసింది. ఇక చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన షఫాలీ వర్మ సంచలన గణాంకాలను నమోదు చేసింది. 6 బంతుల్లో కేవలం ఒక్క పరుగుల మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే తొలి బంతికే ఒక రనౌట్‌ కావడంతో.. ఆ ఓవర్లో బంగ్లా తమ చివరి 4 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక చివరి టీ20లో కూడా గెలిచి, సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని హర్మన్‌ సేన ఉత్సాహంతో ఉంది.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడు: యువరాజ్‌ తండ్రి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి