SNP
SNP
ప్రపంచ క్రికెట్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ ఎంత గొప్ప బౌలరో అందరికీ తెలిసిందే. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారా, రాహుల్ ద్రావిడ్, జయసూర్య లాంటి బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఎంతో సాదాసీదా బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ క్రికెట్‌ను దాదాపు 15 ఏళ్ల పాటు ఏకధాటిగా ఏలాడు. ఆస్ట్రేలియా దశాబ్దానికి పైగా క్రికెట్ లోకాన్ని ఏలిందంటే.. మెక్‌గ్రాత్ లాంటి బౌలర్ వాళ్ల టీమ్‌లో ఉండటమే. మెక్‌గ్రాత్ ప్రధాన బలం లైన్ అండ్ లెంత్. కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో గొప్ప గొప్ప బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పటికీ ఎప్పటికీ.. క్రికెట్‌లో లైన్ అండ్ లెంత్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. మెక్‌గ్రాత్ గురించే చెప్పుకోవాలి. కచ్చితమైన బౌలింగ్ ఎలా ఉండాలో చాటి చెప్పిన బౌలర్ అతను. అలాంటి బౌలర్ ఆస్ట్రేలియాలో పుట్టడం వాళ్లు చేసుకున్న అదృష్టమైతే.. మన దేశంలో పుట్టిన మెక్‌గ్రాత్‌ను మనం గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం. అతను మరెవరో కాదు.. ఇండియన్ మెక్‌గ్రాత్‌గా పిలవబడే.. వెంకటేశ్ ప్రసాద్.
ఆరడుగుల అందగాడు.. మృదుస్వభావి.. వివాదరహితుడు.. తన ఆటతో తప్ప మాటతో ఎన్నడూ సమాధానం చెప్పని జెంటిల్‌మెన్ క్రికెటర్. వెంకటేశ్ ప్రసాద్ పూర్తి పేరు బాపు కృష్ణారావు వెంకటేష్ ప్రసాద్. కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ప్రసాద్.. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబర్చి 1996లో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అప్పటికే జవగల్ శ్రీనాథ్ ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.
శ్రీనాథ్‌తో పోలిస్తే.. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో వేగం ఉండేది కాదు. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌నూ లేదు. దీంతో అతన్ని పేస్ బౌలర్‌గా పిలిచేందుకు కూడా చాలా మంది ఇష్టపడేవారు కాదు. కేవలం గంటకు 120 కిలో మీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేసేవాడు. అప్పుడప్పుడు 130ను అలా టచ్ చేసేవాడు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుండే వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో ఊహించినంత పేస్ ఉండకపోయేది. ఒక పేస్ బౌలర్‌కు హైట్ ఎంతో అడ్వాంటేజ్. ప్రసాద్ హైట్ చూసి బౌలింగ్ చాలా వేగంగా వేస్తాడేమో అని అంతా అనుకునేవారు. కానీ, వెంకటేశ్ ప్రసాద్ బలం వేగం కాదు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సత్తా అతని సొంతం. అలాగే ఇప్పుడు నకల్ బాల్ అని కొత్తగా చెప్పుకుంటున్న స్లోవర్ డెలవరీలు అప్పట్లోనే వెంకటేశ్ ప్రసాద్ తన బ్రహ్మాస్త్రంగా వాడేవాడు.
అయితే.. వెంకటేశ్ ప్రసాద్ దురదృష్టం ఏంటంటే.. అతను ఎక్కువగా ఉపఖండపు పిచ్‌లపైనే బౌలింగ్ చేయాల్సి రావడం. ఎందుకంటే అతని బౌలింగ్ విధానం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాల్లో అయితే అద్భుతంగా సెట్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడూ టీమిండియా ఆయా దేశాలకు వెళ్లినప్పుడు వెంకటేశ్ ప్రసాద్ మ్యాచ్ విన్నర్‌గా మారేవాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. స్లోవర్ డెలవరీతో వికెట్లు సంపాదించేవాడు. ఉపఖండం అవతల వెంకటేశ్ ప్రసాద్ అంటే హేమాహేమీ బ్యాటర్లకు సింహస్వప్నం. పైగా వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ యాక్షన్ చూడ్డానికి ఎంతో సాదాసీదాగా ఉండేది. చేతిని గుండ్రంగా 360 డిగ్రీ యాంగిల్‌లో తిప్పి బౌలింగ్ వేసేవాడు. విచిత్రమై బౌలింగ్ యాక్షన్‌తో గాయాల పాలవుతున్న బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలో వెంకటేశ్ ప్రసాద్‌ను చూసి నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్ బౌలింగ్ యాక్షన్‌కు అతనో టెక్ట్స్ బుక్.
షోయబ్ అక్తర్ లాంటి బౌలర్లు ఎంత చించుకొని గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసినా.. ఎక్కువ సేపు బౌలింగ్ చేయలేరు. త్వరగా అలసిపోయి చెమలు కక్కుతూ.. డీలా పడిపోతారు. కానీ వెంకటేశ్ ప్రసాద్ అలా కాదు. టెస్ట్ క్రికెట్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లు ఎంత విసిగించినా.. ఎన్ని ఓవర్లు వేసినా, ఎన్ని గంటల పాటు బౌలింగ్ వేసిన సేమ్ ఎనర్జీ సేమ్ లైన్ అండ్ లెంత్‌తో బౌలింగ్ వేసేవాడు. అది అతని సత్తా. వెంకటేశ్ ప్రసాద్ ఆస్ట్రేలియాలో పుట్టి ఉంటే.. కచ్చితం మెక్‌గ్రాత్‌ను మించిపోయేవాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అతని పదేళ్ల కెరీర్‌లో ఎక్కువగా ఉపఖండంలోనే ఆడటం పెద్ద మైనస్.
ఇక ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే వెంకటేశ్ ప్రసాద్ ఎన్నడూ కూడా ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకున్న దాఖలాలు లేవు. ఏం చేసిన అది ఆటతోనే తప్ప మాటతో కాదు. అది వెంకటేశ్ ప్రసాద్‌కు ఉన్న గొప్ప వ్యక్తిత్వం. వికెట్ పడినా కూడా ఎంతో హుందాగా సెలబ్రేట్ చేసుకుంటాడు తప్పా.. ఎప్పుడు అతి చేసేవాడు కాదు. ఇలాంటి వ్యక్తికి కూడా ఓసారి పాకిస్థాన్ బ్యాటర్ అమీర్ సోహైల్ కోసం తెప్పించాడు. అప్పుడు కూడా వెంకటేశ్ ప్రసాద్ తన వ్యక్తిత్వాన్ని వదులుకుని సహనం కోల్పోలేదు. కానీ, సోహైల్‌కు మాత్రం దిమ్మతిరిగేలా గుణపాఠం అయితే చెప్పాడు. 1996 వన్డే వరల్డ్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయర్ అమీర్ సోహైల్ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి ఊపు మీద ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి అయిందన్న అహంతో.. వెంకటేశ్ ప్రసాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటాడు. అతన్ని రెచ్చగొట్టి ఏకగ్రాతను దెబ్బతీయాలనేది సోహైల్ ప్లాన్. కానీ.. ఎంత రెచ్చగొట్టినా.. తన లైన్ అండ్ లెంగ్ తప్పని ప్రసాద్.. సోహైల్ రెచ్చగొట్టిన మరుసటి బంతికే అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి.. బుద్ధిచెప్పాడు. ఈ సంఘటనతో శాంతంగా ఉండే వారిని గెలికితే ఎలా ఉంటుందో మరోసారి తెలుసొచ్చింది.
ఆ వరల్డ్ కప్ తర్వాత 2001 వరకు ఇండియన్ క్రికెట్ టీమ్‌కు వెంకటేశ్ ప్రసాద్ పేస్ బౌలింగ్‌కు వెన్నుముకలా నిలబడ్డాడు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. నమ్మకం పెట్టుకోగల బౌలర్‌గా మారిపోయాడు. కానీ.. ఆ సమయంలో టీమిండియా ఎక్కువగా ఉపఖండపు పిచ్‌లపైనే ఆడటం వెంకటేశ్ ప్రసాద్‌కు శాపమైపోయింది. మన పిచ్‌లు కూడా ఆస్ట్రేలియాలా ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లుగా ఉండి ఉంటే.. వెంకటేశ్ ప్రసాద్‌ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాకపోయేది. 2001లో శ్రీలంక పర్యటన తర్వాత.. జట్టులో చోటు కోల్పోయిన వెంకటేశ్ ప్రసాద్ మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయలేకపోయాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కోచ్‌గా సెంకడ్ ఇన్నింగ్స్ ఆరంభించి సక్సెస్‌ఫుల్ అయ్యాడు. వెంకటేశ్ ప్రసాద్ తన కెరీర్‌లో 33 టెస్టులు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. అందులో 10 వికెట్ల హల్ ఒకసారి, 5 వికెట్ల హల్ 7 సార్లు సాధించాడు. ఇక 161 వన్డేలు ఆడి 196 వికెట్లు కూల్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 361, లిస్ట్ ఏలో 295 వికెట్లు పడగొట్టిన ఘనత వెంకటేశ్ ప్రసాద్ సొంతం. టీమిండియా క్రికెట్ చరిత్రలో వెంకటేశ్ ప్రసాద్ లాంటి పర్ఫెక్ట్ బౌలింగ్ లైన్ అండ్ లెంత్‌తో వేసే బౌలర్ మరొకరు లేరు.. రారు. అతనో చరిత్ర గుర్తించని లెజెండ్. పాత తరం క్రికెట్ అభిమానులకు అతనో ఇండియన్ మెక్‌గ్రాత్.
Happy birthday to one of the finest produced by India, Venkatesh Prasad!
Throwback to the time he gave a perfect reply to Aamir Sohail, what a moment that was! pic.twitter.com/QOffZhEOtO
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2023
ఇదీ చదవండి: తిలక్ వర్మ బాగానే ఆడుతున్నాడు కానీ.. ఇదొక్కటే పెద్ద మైనస్!