వన్డే వరల్డ్ కప్-2023లో వరుస విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్ కోసం రోహిత్ సేన రెడీ అవుతోంది. అయితే ఈసారి ఎదుర్కోబోయేది చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ను కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే రెండు టీమ్స్ అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఫెయిలైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో తిరిగి గాడిన పడ్డారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ సెంచరీతో చెలరేగాడు.
భారత బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. డెంగ్యూ బారిన పడిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టడం మరో గుడ్ న్యూస్. అయితే బౌలింగ్ విభాగమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నా పేస్ యూనిట్ అనుకున్నంతగా రాణించడం లేదు. అందులోనూ మహ్మద్ సిరాజ్ ఏమాత్రం ఆక్టటుకోవడం లేదు. వికెట్లు తీయకపోగా ధారాళంగా రన్స్ ఇస్తున్నాడీ హైదరాబాదీ. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా కాంబినేషన్‌పై సీనియర్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో పేసర్‌గా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే బదులు మహ్మద్ షమీని ఆడించాలని సూచించాడు.
‘ఆఫ్ఘానిస్థాన్ లాంటి పసికూన టీమ్‌పై కూడా శార్దూల్ ఠాకూర్‌ను ఆడించడం ఆశ్చర్యపరిచింది. ఆ జట్టుతో కూడా ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అవసరమా? శార్దూల్ అంత గొప్ప బ్యాటరేం కాదు. అతడు బాల్‌కు ఓ రన్ మాత్రమే చేయగలడు. బ్యాటింగ్ డెప్త్ కోసం అతడ్ని ఆడిస్తున్నారు. కానీ శార్దూల్ కంటే షమీని ఆడించడం బెస్ట్. పాక్‌తో మ్యాచ్‌లోనైనా శార్దూల్‌కు బదులు షమీని తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు షమీ అవసరం ఎక్కువగా ఉంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న షమీకి అహ్మదాబాద్‌లో మంచి రికార్డు ఉంది. ఈ పిచ్ మీద ఆరంభంలో వికెట్లు తీయడం షమీకి తెలుసు. మరి.. పాక్‌తో మ్యాచ్‌లో షమి, శార్దూల్‌ల్లో ఎవర్ని ఆడిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పరువు పోగొట్టుకున్న ఆసీస్.. జింబాబ్వేని తలపించేలా క్యాచ్‌లు మిస్!