భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హిట్‌మ్యాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మతి లేనివని.. అవి చాలా వింతగా ఉన్నాయని అన్నాడు. కొన్ని రోజుల కింద ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం టీమిండియాను ప్రకటించారు. ఆ సమయంలో ప్రెస్మీట్లో పాల్గొన్నాడు రోహిత్. ఈ సందర్భంగా టీమ్‌లోని బ్యాటర్లు ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు రెడీ ఉండాలని అన్నాడు. ఫలానా స్థానంలోనే ఆడతానని, ఈ నెంబర్లోనే బాగా ఆడతానని ఎవరూ అనకూడదన్నాడు. ఏ పొజిషన్లోనైనా ఆడగలిగే ప్లేయర్లు తమకు కావాలన్నాడు రోహిత్.
భారత బ్యాటర్లను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై లెజెండరీ ఆల్‌రౌండర్, 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ స్పందించాడు. హిట్‌మ్యాన్ కామెంట్స్ తనకు వింతగా అనిపించాయన్నాడు. బ్యాటర్ల గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నాడు మదన్ లాల్. ఈ మాటలు అర్థం పర్థం లేనివని ఆయన అభిప్రాయపడ్డాడు. రోహిత్ అభిప్రాయంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని.. అతడివి మతి లేని వ్యాఖ్యలని మదన్ లాల్ మండిపడ్డాడు. టీమ్‌లో నిలకడ ముఖ్యమని, ఇలాంటి అనవసర ప్రయోగాలు కాదని సూచించాడు.
‘బ్యాటింగ్ ఆర్డర్‌ను పదేపదే మారిస్తే ఎవరికీ ఈ జన్మలో కాన్ఫిడెన్స్ రాదు. మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి ఒకరిద్దరి స్థానాలు మారిస్తే తప్పు లేదు. కానీ ప్రతి ప్లేయర్‌కు జట్టులో తన పాత్ర ఏంటో క్లారిటీ ఉండాలి. మ్యాచ్‌లో రన్స్ చేయడం గురించి బ్యాటర్లకు స్పష్టత ఉండాలి. టీ20ల్లో అయితే క్రీజులోకి వెళ్లాక అందరూ ఒకేలా బ్యాటింగ్ చేస్తారు, భారీ షాట్లు ఆడతారు. ఆ ఫార్మాట్లో అదే ముఖ్యం. కానీ వన్డేల్లో అది సాధ్యం కాదు. అందరూ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తారని రోహిత్ చెప్పడం చూసి నాకు మైండ్ బ్లాంక్ అయింది’ అని మదన్ లాల్ వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: ఆ ఇద్దరు చెలరేగితే టీమిండియాదే విజయం!