iDreamPost
android-app
ios-app

ఐర్లాండ్​తో తొలి టీ20 ఇవాళే.. అందరి కళ్లూ ఆ ఒక్క ఆటగాడి పైనే!

  • Author singhj Published - 10:01 AM, Fri - 18 August 23
  • Author singhj Published - 10:01 AM, Fri - 18 August 23
ఐర్లాండ్​తో తొలి టీ20 ఇవాళే.. అందరి కళ్లూ ఆ ఒక్క ఆటగాడి పైనే!

పసికూన ఐర్లాండ్​తో టీ20 సిరీస్ ఇవాళే మొదలుకానుంది. ఈ టీమ్​తో ఇప్పటిదాకా ఆడిన ఐదు టీ20ల్లోనూ టీమిండియాదే విజయం. ఈసారి కూడా సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలనే ఉద్దేశంతోనే భారత్ బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్​ చాలా మంది యువ ఆటగాళ్లకు మంచి అవకాశమనే చెప్పాలి. ఇటీవల వెస్టిండీస్​తో సిరీస్​లో సత్తా చాటలేకపోయిన సంజూ శాంసన్​కు ఇది గోల్డెన్ ఛాన్స్. నెక్స్ట్ ఆడబోయేవి అన్నీ ప్రధాన టోర్నీలే కాబట్టి చివరి అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఈ సిరీస్​తో ఐపీఎల్ హీరో రింకూ సింగ్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.

విండీస్​తో సిరీస్​లో అదరగొట్టిన హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు ఐర్లాండ్​తో సిరీస్​లోనూ రాణిస్తే, వరల్డ్ కప్​ సెలెక్షన్ పోటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. పునరాగమనం చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ, శివమ్ దూబేతో పాటు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్​కూ ఈ సిరీస్ కీలకం కానుంది. అయితే అందరి కళ్లూ ఒక్క ప్లేయర్ మీదే ఉన్నాయి. ఆ ఆటగాడే పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా. వెన్నెముక గాయం, సర్జరీ కారణంగా దాదాపు 11 నెలలు బుమ్రా క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. ఆ ప్రభావం జట్టు ప్రదర్శన మీద కూడా పడింది. ఈ సంవత్సరం స్వదేశంలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ ఆసక్తికరంగా మారింది.

ఐర్లాండ్​తో సిరీస్​లో బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడనేది కీలకమనే చెప్పాలి. అతడి ఫిట్​నెస్, బౌలింగ్ లయ ఎలా ఉందనే దానిపై సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అతడు మునుపటిలా రాణిస్తే ఆసియా కప్​ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. ఈ ఛాలెంజ్​ను బుమ్రా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. బుమ్రా వ్యాఖ్యలు చూస్తే మాత్రం అతడి టార్గెట్ వన్డే వరల్డ్ కప్ అని స్పష్టంగా అర్థమైపోతుంది. తాను టీ20ల కోసం కాదు.. ప్రపంచ కప్ కోసమే సన్నద్ధమయ్యానని బుమ్రా అన్నాడు. ఎన్​సీఏలో 10 నుంచి 15 ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. తాను పాత బుమ్రానేనని.. ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదని తెలిపాడు.