iDreamPost
android-app
ios-app

200 వికెట్ల క్లబ్​లో జడేజా! అతడి కంటే ముందు ఎంతమంది ఉన్నారు?

  • Author singhj Published - 12:18 PM, Sat - 16 September 23
  • Author singhj Published - 12:18 PM, Sat - 16 September 23
200 వికెట్ల క్లబ్​లో జడేజా! అతడి కంటే ముందు ఎంతమంది ఉన్నారు?

ఆసియా కప్-2023లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో ప్రతిష్టాత్మక టోర్నమెంట్​లో ఫైనల్​కు చేరుకున్న టీమిండియా శుక్రవారం బంగ్లాదేశ్​తో జరిగిన ఆఖరి సూపర్-4 మ్యాచ్​లో 6 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ నామమాత్రపు మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్​ 50 ఓవర్లకు 256 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (85 బంతుల్లో 80), తౌహిడ్ హృదయ్ (81 బంతుల్లో 54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో నుసుమ్ అహ్మద్ (44), మెహదీ హసన్ (29 నాటౌట్) కూడా విలువైన రన్స్ చేశారు.

టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3/65) మూడు వికెట్లు తీశాడు. సీనియర్ పేసర్ మమ్మద్ షమి (2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 249 రన్స్​కు కుప్పకూలింది. ఓపెనర్ శుబ్​మన్ గిల్ (133 బంతుల్లో 121) సెంచరీ చేసినా లాభం లేకపోయింది. గిల్​ సెంచరీ వృథా అయింది. అక్షర్ పటేల్ (42) ఆఖరి వరకు పోరాడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/50), తంజిమ్ హసన్ షకీబ్ (2/27), మెహ్దీ హసన్ (2/50) రెండేసి వికెట్లు పడగొట్టారు. షకీబ్ అల్ హసన్, మెహ్దీ హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్​లో భారత బ్యాటర్లు ఘోరంగా ఫెయిలయ్యారు. భీకర ఫామ్​లో ఉన్న రోహిత్ శర్మ (0)తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మ (5), కేఎల్ రాహుల్ (19), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్ (26) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (7) కూడా మరోమారు ఫెయిలయ్యాడు. అయితే గిల్, అక్షర్ పోరాటంతో భారత్ విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఇక, బ్యాటింగ్​లో విఫలమైన జడేజా.. బౌలింగ్​లో మాత్రం ఆకట్టుకున్నాడు. ఓ మెయిడిన్ ఓవర్ వేసిన జడ్డూ.. ఒక వికెట్ కూడా తీశాడు.

ఈ మ్యాచ్​లో బంగ్లా బ్యాటర్ షమీమ్ హొస్సేన్​ను ఔట్ చేసిన జడేజా.. తద్వారా వన్డేల్లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. షమీమ్ వికెట్​​తో వన్డేల్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు జడ్డూ. అతడి కంటే ముందు 200 వికెట్లు పూర్తి చేసుకున్న భారత బౌలర్లు కొందరు ఉన్నారు. ఈ లిస్టులో టాప్ పొజిషన్​లో అనిల్ కుంబ్లే (334 వికెట్లు), జవగళ్ శ్రీనాథ్ (315 వికెట్లు), అజిత్ అగార్కర్ (288 వికెట్లు), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253) ఉన్నారు. జడ్డూ తర్వాతి స్థానాల్లో వెంకటేష్ ప్రసాద్ (196), ఇర్ఫాన్ పఠాన్ (173), మహ్మద్ షమి (165 వికెట్లు) ఉన్నారు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​కు ముందు ఆసీస్​కు షాక్!