టీమిండియా బౌలింగ్ యూనిట్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఇప్పుడు కనిపిస్తోంది. అటు పేస్‌తో పాటు ఇటు స్పిన్ యూనిట్ కూడా పటిష్టంగా తయారైంది. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి వైవిధ్యమైన స్పిన్నర్లు టీమ్‌లో ఉన్నారు. త్వరలో ఆరంభం కానున్న వరల్డ్ కప్‌లో వీళ్లను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కత్తి మీద సామే. పిచ్ కాస్త స్పిన్‌కు అనుకూలించినా వీళ్లు అవతలి టీమ్‌ను కుప్పకూల్చేస్తారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌తో పేస్ యూనిట్ కూడా బలంగా కనిపిస్తోంది.
శార్దూల్ ఠాకూర్ తప్పితే మిగతా పేసర్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ బౌలర్ షమీకి ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కడం లేదంటేనే జట్టులో ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా భారత పేస్ అటాక్ అంటే షమి, బుమ్రానే అందరికీ గుర్తుకొచ్చేవారు. కానీ సిరాజ్ రావడంతో ఇది పూర్తిగా మారిపోయింది. అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని జట్టులో తన ప్లేస్‌ను పక్కా చేసుకున్నాడు సిరాజ్. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌ను భారత్ గెలుచుకోవడంలో ఈ పేసర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో ఏకంగా 6 వికెట్లు తీసి లంకను దారుణంగా దెబ్బతీశాడీ హైదరాబాదీ.
వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న మహ్మద్ సిరాజ్ ఈ ఫార్మాట్లో నెంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. ఫ్లాట్ వికెట్ల మీద కూడా బ్యాటర్లను వణికిస్తున్నాడు సిరాజ్. పిచ్ స్వింగ్‌కు, సీమ్‌కు అనుకూలిస్తే ఇంకా చెలరేగిపోతున్నాడు. సిరాజ్ లేకపోతే మన పేస్ యూనిట్ లేదనే స్థాయిలో అతడి బౌలింగ్ ఉంది. దీంతో రెగ్యులర్ బౌలర్ షమి ప్లేసులో సిరాజ్ జట్టులో సెటిలైపోయాడు. బుమ్రా, హార్దిక్ ఎలాగూ టీమ్‌లో ఉండనే ఉన్నారు. నాలుగో పేసర్ కావాలనుకుంటే బ్యాటింగ్ ఆడే సామర్థ్యం ఉన్న శార్దూల్ ఠాకూర్ వైపు టీమ్ మేనేజెమెంట్ వెళ్తోంది. దీంతో షమీ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. సిరాజ్, బుమ్రాల్లో ఎవరో ఒకరు ఆడకపోతేనే షమీకి ఛాన్స్ వస్తోంది. సిరాజ్ వల్లే తనకు ప్లేస్ దొరకట్లేదని షమీ గిల్ట్‌గా ఫీల్ అవుతున్నాడని, సిరాజ్ అంటే అతడికి పడదంటూ ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ షమీకి చోటు దక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మొహాలీలో జరిగిన తొలి వన్డేలో అవకాశం దక్కడంతో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఏకంగా 5 వికెట్లతో రాణించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన షమీకి తరచూ జట్టు నుంచి తప్పించడంపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు అదిరిపోయే రీతిలో సమాధానం ఇచ్చాడు. ‘నేను రెగ్యులర్‌గా జట్టులో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బెంచ్‌పై కూర్చుంటారు కదా. నేనూ అంతే. ఇందులో బాధపడాల్సింది, గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. టీమ్ ప్రయోజనాలే ముఖ్యం. జట్టు ప్రణాళికలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. టీమ్ కూర్పు మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నాకు ఛాన్స్ వస్తే మంచిదే లేకపోతే ఆడేవారికి సపోర్ట్‌గా ఉంటా. మేనేజ్మెంట్ నాకు అప్పజెప్పిన పనిని పూర్తి చేసేందుకు రెడీగా ఉంటా’ అని షమీ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: 4 నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్న పాక్ క్రికెటర్లు!