ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు. వరల్డ్ కప్‌కు ముందు చాలా విధాలుగా ఉపయోగపడిన వన్డే సిరీస్‌ను మన జట్టు ఓటమితో ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 352/7 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74), మార్నస్ లబుషేన్ (58 బంతుల్లో 72), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఛేదనలో రోహిత్ శర్మ (57 బంతుల్లో 81), విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 56), శ్రేయాస్ అయ్యర్ (43 బంతుల్లో 48) రాణించినా ఫలితం లేకపోయింది. భారత్ 49.4 ఓవర్లలో 286 రన్స్‌కే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ ( 4/40) తన స్పిన్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడ్నే వరించింది. భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ఆసీస్‌తో ఆఖరి వన్డేలో భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. చివరి వన్డేకు ఆతిథ్యం ఇచ్చిన రాజ్‌కోట్ పిచ్‌పై బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు. ఎక్స్‌ప్రెస్ హైవే లాంటి ఈ పిచ్ పూర్తిగా బ్యాటర్లకు సహకరించింది. దీంతో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, మార్ష్ అయితే బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌లో చెలరేగి ఆడారు. వరుసగా బౌండరీలు, సిక్సులు కొడుతూ స్కోరు బోర్డును రాకెట్ స్పీడులో పరిగెత్తించారు. ముఖ్యంగా బుమ్రా అయితే తన ఫస్ట్ స్పెల్‌లో 40కి పైగా రన్స్ ఇచ్చుకున్నాడు. సిరాజ్ కూడా కంగారూలను అడ్డుకోలేకపోయాడు. మొదట్లోనే వికెట్ పడితే ఆసీస్ కాస్త బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లేదేమో. కానీ మన బౌలర్లు అందులో ఫెయిల్ అయ్యారు.
స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చివరి వన్డేలో ప్రభావం చూపలేకపోయాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ 6 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రన్స్ పెద్దగా ఇవ్వనప్పటికీ భారత్‌కు బ్రేక్ త్రూను అందించలేకపోయారు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే 5 ఓవర్లలో ఏకంగా 45 రన్స్ ఇచ్చుకున్నాడు. సిరాజ్, బుమ్రాలు ఆఖర్లో రన్స్‌ను కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు. కానీ అప్పటికే భారత్ పనైపోయింది. ఆసీస్ భారీ స్కోరు చేసేసింది. పిచ్ సహకరించకున్నా స్లో డెలివరీస్, యార్కర్లు వేస్తూ నియంత్రించే ఛాన్స్ ఉన్నప్పటికీ అందులో మన బౌలర్లు ఫెయిల్ అయ్యారు.
భారత ఓటమికి రెండో కారణం స్పిన్ కాంబో సెట్ అవ్వకపోవడం. గత మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌ను చివరి వన్డేలో బరిలోకి దింపలేదు. కుల్దీప్కు తోడుగా అశ్విన్ ఉండుంటే పరుగులు కట్టడి చేయడంతో పాటు మరిన్ని వికెట్లు పడే ఛాన్స్ ఉండేది. క్యారమ్ బాల్, ఆఫ్ స్పిన్ అంటూ వేరియేషన్స్‌తో ఆసీస్ బ్యాటర్లను అశ్విన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండేది. వరల్డ్ కప్ మ్యాచ్‌లో డైరెక్ట్‌గా తేల్చుకుందామనే ఉద్దేశంతో అశ్విన్-కుల్దీప్ కాంబోను బహుశా ఎక్స్పోజ్ చేయొద్దని టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇక, మూడో వన్డేలో భారత ఓటమికి మూడో కారణంగా రోహిత్ ఔట్ అని చెప్పొచ్చు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 81 రన్స్ చేసిన హిట్‌మ్యాన్ సెంచరీ చేసేలా కనిపించాడు.
రోహిత్ మెరుపు బ్యాటింగ్ చూస్తే భారత్‌దే మ్యాచ్ అని అంతా అనుకున్నారు. కానీ సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపాడు మ్యాక్స్‌వెల్. దీంతో ఛేదనలో భారత్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయానికి నాలుగో కారణంగా విరాట్ కోహ్లీ ఔట్ అని చెప్పొచ్చు. ఛేజింగ్ కింగ్‌గా విరాట్‌ను అందరూ పిలుస్తారు. ఛేదనలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడే కోహ్లీ.. ఎన్నోసార్లు భారత్‌ను గెలిపించాడు. చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసే కోహ్లీ (56)ని కూడా మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు.
విరాట్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ మనమే గెలిచేవాళ్లమేమో. ఇక, ఈ మ్యాచ్‌లో ఓటమికి ఐదో కారణంగా టీమ్ సెలెక్షన్ అని చెప్పొచ్చు. కొందరు ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం, వరల్డ్ కప్‌కు ముందు ప్రయోగాలు చేసేందుకు చివరి మ్యాచ్ కావడంతో భారత్ కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో గ్రౌండ్లోకి దిగింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, సూర్యలు ఆ ఐదుగురు బ్యాట్స్‌మెన్. అందులో రాహుల్ (26) రాణించలేదు. సూర్య అయితే (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండుంటే ఛేజ్ చేయడం టీమిండియాకు సులువయ్యేది. ఓటమి ఎదురైనా కానీ ఈ సిరీస్‌లో భారత్‌కు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. మరి.. చివరి వన్డేలో భారత్ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్ కొంపముంచిన క్యాచ్.. వీడియో వైరల్!