iDreamPost
android-app
ios-app

భారత్​కు రిజర్వ్ డే ఫోబియా! గతమంతా బ్యాడ్ సెంటిమెంట్!

  • Author singhj Published - 01:35 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 01:35 PM, Mon - 11 September 23
భారత్​కు రిజర్వ్ డే ఫోబియా! గతమంతా బ్యాడ్ సెంటిమెంట్!

భారత్, పాకిస్థాన్ జట్లతో వర్షం ఆటాడుకుంటోంది. ఈ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్​ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా ఈ ఇరు దాయాదుల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. వాన ఆటంకం కలిగించడంతో సూపర్-4 దశ మ్యాచ్​ కూడా ఆగిపోయింది. అయితే రిజర్వ్ డే ఉండటంతో ఆదివారం మ్యాచ్ ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచే సోమవారం నాడు కొనసాగించనున్నారు. మ్యాచ్​లో భారత్ మంచి ఊపు మీదున్న సమయంలో వరుణుడు అడ్డు తగిలాడు. షాహిన్ షాతో పాటు ఇతర పాక్ బౌలర్ల బౌలింగ్​లో చెలరేగి బ్యాటింగ్ చేశారు భారత ఓపెనర్లు శుబ్​మన్ గిల్ (58), రోహిత్ శర్మ (56).

గిల్, రోహిత్ తక్కువ వ్యవధిలోనే పెవిలియన్​కు చేరడంతో భారత్ కాస్త కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. కానీ విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో నిలదొక్కుకున్నారు. ఈ సమయంలో వాన వల్ల ఆట నిలిచిపోయింది. ఆదివారం ఆడినట్లే పాజిటివ్ దృక్పథంతో పాక్ పేసర్లను భారత్ బ్యాట్స్​మెన్ ఎదుర్కొంటే భారీ స్కోరును సాధించొచ్చు. ఆట ఆగిపోయే టైమ్​కు టీమిండియా స్కోరు 147/2తో ఉంది. 280 రన్స్ వరకు చేస్తే మ్యాచ్ భారత్​దేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లడం అభిమానుల్ని కలవరపరుస్తోంది. ​ఎందుకంటే భారత్​కు రిజర్వ్ డే పెద్దగా కలసిరాలేదు.

టీమిండియాకు రిజర్వ్ డే అంటే ఒక బ్యాడ్ సెంటిమెంట్ అనే చెప్పాలి. ఇలా రిజర్వ్ డే నాడు ఆడిన రెండు కీలకమైన మ్యాచుల్లో భారత్ ఓటమిపాలైంది. ఆ రెండు మ్యాచ్​లు న్యూజిలాండ్​తోనే ఆడినవి కావడం గమనార్హం. 2019 వన్డే వరల్డ్ కప్​లో కివీస్​తో సెమీఫైనల్లో తలపడింది టీమిండియా. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఈ స్కోరును అలవోకగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ భారత్ 49.3 ఓవర్లలో 221 రన్స్​కు ఆలౌట్ అయింది. కీలక సమయంలో ఎంఎస్ ధోని రనౌట్ కావడంతో ఇండియాకు మ్యాచ్ చేజారింది. తను ఔట్ కాగానే ధోని కన్నీళ్లు పెట్టుకోవడంతో అప్పట్లో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ధోని కెరీర్​లో ఇదే ఆఖరి వన్డే కావడం గమనార్హం.

భారత్​పై సెమీఫైనల్లో న్యూజిలాండ్ గెలిచినప్పటికీ తుది సమరంలో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయింది. దీన్ని పక్కనబెడితే.. టీమిండియాకు రిజర్వ్ డే నాడు మరో ఓటమి ఎదురైంది 2021లో. ఆ ఏడాది ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి కప్​ను చేజార్చుకుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో భారత్ 217 రన్స్​కే కుప్పకూలింది. కివీస్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్​లో 249కు అన్ని వికెట్లు కోల్పోయింది. అయితే రెండో ఇన్నింగ్స్​లో భారత్ 170కు పరిమితమవ్వడంతో న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది. 140 రన్స్ టార్గెట్​ను కేవలం 2 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది కివీస్. రెండు కీలకమైన మ్యాచుల్లో రిజర్వ్ డే నాడు ఓడిన భారత్.. ఇవాళ పాక్​తో జరగనున్న మ్యాచ్​లోనూ అదే రిపీట్ చేస్తుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: బుమ్రాకు షాహీన్ అఫ్రిది సర్​ప్రైజ్ గిఫ్ట్!