iDreamPost
android-app
ios-app

IND vs ENG: కోహ్లీ లేకే టీమిండియా ఓడిందా? అసలు లోపాలేంటి? పూర్తి విశ్లేషణ!

  • Published Jan 29, 2024 | 11:17 AM Updated Updated Jan 29, 2024 | 4:34 PM

Virat Kohli, India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే.. కోహ్లీ ఉంటే ఇలా జరిగేది కాదని కొంతమంది అంటున్నారు. అయితే.. అందులో నిజమెంతా.. కోహ్లీ లేకపోవడం ఒక్కటే ఇప్పుడు జట్టుకి మైనసా? లేక ఇంకా లోపాలు ఉన్నాయా? ఒకసారి చూద్దాం..

Virat Kohli, India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే.. కోహ్లీ ఉంటే ఇలా జరిగేది కాదని కొంతమంది అంటున్నారు. అయితే.. అందులో నిజమెంతా.. కోహ్లీ లేకపోవడం ఒక్కటే ఇప్పుడు జట్టుకి మైనసా? లేక ఇంకా లోపాలు ఉన్నాయా? ఒకసారి చూద్దాం..

  • Published Jan 29, 2024 | 11:17 AMUpdated Jan 29, 2024 | 4:34 PM
IND vs ENG: కోహ్లీ లేకే టీమిండియా ఓడిందా? అసలు లోపాలేంటి? పూర్తి విశ్లేషణ!

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆరంభం నుంచి ఇంగ్లండ్‌పై ఆధిపథ్యం చెలాయించిన భారత్‌.. ఓడిపోతుందని ఎవరూ అనుకోని ఉండరు. కానీ, ఇంగ్లండ్‌ అద్భుత పోరాటంతో గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 246 పరుగులకే ఆలౌట్‌ చేసి.. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగుల భారీ స్కోర్‌ చేసిన తర్వాత కూడా టీమిండియా ఓడిపోయిందంటే.. జట్టులో లోపాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ మొత్తాన్ని ఓ ఆట ఆడుకున్న భారత బౌలర్లు.. ఒక్క ఓలీ పోప్‌ను మాత్రం పడగొట్టలేకపోయారు. అలాగే చివరి ఇన్నింగ్స్‌లో సాధారణమైన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొలేక మ్యాచ్‌ వాళ్ల చేతుల్లో పెట్టారు. ఇలా తొలి మ్యాచ్‌ చూసిన తర్వాత.. చాలా మంది భారత క్రికెట్‌ అభిమానులు.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ లేకపోవడంతోనే టీమిండియా ఓటమి పాలైందని, కోహ్లీ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు. అయితే.. కోహ్లీ ఒక్కడు లేకపోవడంతోనే ఓటమి ఎదురైందా? లేక జట్టులో ఇంకా ఎలాంటి లోపాలు ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా విశ్లేషిద్దాం..

ముందుగా విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. కోహ్లీ లాంటి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్లేయర్‌ టీమ్‌లో లేకపోవడం కచ్చితంగా పెద్ద మైనస్‌. దాన్ని ఎవరూ కాదనడానికి లేదు. పైగా ఈ మ్యాచ్‌లో టీమిండియా చివరి ఇన్నింగ్స్‌లో 231 పరుగులను ఛేజ్‌ చేస్తూ ఓడిపోయింది. కోహ్లీ ఉంటే ఛేజింగ్‌ బాగా చేసేవాడు. పైగా ఒక ఎండ్‌లో వికెట్లు పడుతుంటే.. మరో ఎండ్‌లో కాస్త టైమ్‌ తీసుకోని అయినా వికెట్‌ కాపాడే వాడు. ఒత్తిడికి గురవుతున్న ఇతర యువ క్రికెటర్లతో మాట్లాడుతూ.. మ్యాచ్‌ పరిస్థితిని, చేయాల్సిన పనిని అర్థం అయ్యేలా వివరిస్తూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే వాడు. పైగా కోహ్లీ టీమ్‌లో ఉంటే ఆ ధైర్యమే వేరు. క్రికెట్‌ అభిమానులు అంటున్నట్లుగా కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో ఉంటే కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. కానీ, కోహ్లీ లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం..

If Kohli was there

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్రధాన లోపం.. మూడో స్థానంలో ఆడే ప్లేయర్‌. ప్రస్తుతం ఈ ప్లేస్‌లో యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆడుతున్నాడు. ఓపెనర్లలో ఏ ఒక్కరి వికెట్‌ తర్వగా పడినా.. వన్‌డౌన్‌లో వచ్చే బ్యాటర్‌ పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. బ్యాటింగ్‌ లైనప్‌లో మూడో స్థానం అనేది ఎంతో ముఖ్యం. కానీ, గిల్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అలాంటి ఆటగాడిని మూడో స్థానంలో ఆడించడం టీమిండియాను దెబ్బతీసింది. తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ లాంటి బ్యాక్‌బోన్‌ ఆటగాడు దూరమైతే.. అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిని తీసుకోవాలి కానీ, బెంచ్‌కి పరిమితం అయ్యే రజత్‌ పటీదార్‌ లాంటి యువ ఆటగాడిని తీసుకుని, టీమ్‌లో కోహ్లీ కీ ప్లేయర్‌ కాదన్నట్లు వ్యవహరించారు. కోహ్లీ లాంటి సీనియర్‌ ప్లేయర్‌ లేనప్పుడు చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె లాంటి సీనియర్‌ టెస్ట్‌ స్పెషలిస్ట్‌లను తీసుకుని ఉండాల్సింది. కానీ, సెలెక్టర్లు ఆ పనిచేయలేదు. టీమిండియా ఆడుతోంది టెస్ట్‌ సిరీస్‌ అనే సంగతి బహుషా వాళ్లు మర్చిపోయినట్లు ఉన్నారా? లేక ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేశారా? అనేది అర్థం కాని ప్రశ్న.

కర్ణుడి చావుకు వేయి కారణాలు అన్నట్లు.. తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి కూడా చాలానే కారణాలు ఉన్నాయి. జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు లేరనే విషయం పైన చెప్పుకున్నాం. అలాగే మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఇండియాకి-విజయాని​కి అడ్డుగోడ కట్టిన ఓలీ పోప్‌ 110 పరుగుల వద్ద ఉన్న సమయంలో జడేజా బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, దాన్ని అక్షర్‌ పటేల్‌ నేలపాలు చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌ అనే కాదు.. ఏ మ్యాచ్‌లోనైనా క్యాచ్‌లు చాలా ముఖ్యం. క్యాచెస్‌ విన్స్‌ మ్యాచెస్‌ అనే ఇంగ్లీష్‌ సేయింగ్‌ ఉండనే ఉంది. క్యాచ్‌లు వదిలేస్తే.. మ్యాచ్‌లు వదిలేసినట్లే. అక్షర్‌ ఆ క్యాచ్‌ పట్టి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. జట్టులోని యువ క్రికెటర్లు టెస్ట్‌ క్రికెట్‌ను ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రోజో రెండు రోజులో ఆధిపత్యం చెలాయిస్తే సరిపోదు.. పైచేయి ఉంది కదా అని రిలాక్స్‌ అయిపోయినా కూదరదు. మ్యాచ్‌ గెలిచే వరకు గెలవాలనే కసి తగ్గొద్దు.

కానీ, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో టీమిండియా బౌలర్లు, ఫీల్డర్లు కాస్త రిలాక్స్‌ అయిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. అదే టీమిండియాను దెబ్బకొట్టింది. టెస్ట్‌ క్రికెట్‌లో ఆధిపత్యం చేతులు మారేందుకు ఒక్క సెషన్‌ చాలు. ఒక్క అద్భుమైన ఇన్నింగ్స్‌, స్పెల్‌ సరిపోతుంది. ఓలీ పోప్‌ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్సే ఇంగ్లండ్‌కు విజయం అందించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కోహ్లీ లేకపోవడం కారణం కాదు.. గెలిచేశాం అనే అతివిశ్వాసం ప్లేయర్లకు రావడం. అదే టీమిండియా కొంపముంచింది. ఒక వేళ టీమ్‌లో కోహ్లీ ఉన్నా.. మిగతా పది మంది ప్లేయర్లు ఇదే విధంగా ఆడి ఉంటే.. ఫలితంలో మార్పు ఉండకపోయేది. అందుకే టీమ్‌లోని ఆటగాళ్ల మైండ్‌సెట్‌ మారాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.