iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ బలాలు, బలహీనతలు! తొలి కప్ గెలిచే ఛాన్స్?

  • Author singhj Published - 02:34 PM, Mon - 2 October 23
  • Author singhj Published - 02:34 PM, Mon - 2 October 23
వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ బలాలు, బలహీనతలు! తొలి కప్ గెలిచే ఛాన్స్?

వరల్డ్ కప్​-2023కి అంతా రెడీ అయిపోయింది. మరో మూడ్రోజుల్లో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈసారి కప్​ ఎగరేసుకుపోవాలని చాలా జట్లు ఫిక్స్ అయ్యాయి. అయితే వాటిల్లో నాలుగైదు టీమ్స్ మాత్రం ఫేవరెట్స్​గా కనిపిస్తున్నాయి. అలాంటి జట్లలో ఒకటి న్యూజిలాండ్. గత రెండు వరల్డ్ కప్స్​లో రన్నరప్​గా నిలిచిన ఈ జట్టు ఈసారైనా టైటిల్​ను అందుకొని ఛాంపియన్​గా నిలవాలని అనుకుంటోంది. కెప్టెన్ కేన్ విలియమన్స్ నేతృత్వంలోని టీమ్ చాలా విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. భారత గడ్డ మీద ఐపీఎల్​లో ఆడిన అనుభవం పలువురు కివీస్ ప్లేయర్లకు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్ కప్​లో న్యూజిలాండ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అసలు ఆ టీమ్ బలం ఏంటి? బలహీనత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గత రికార్డులు

ప్రస్తుత క్రికెట్​లో అత్యంత బలమైన టీమ్స్​లో న్యూజిలాండ్ ఒకటి. సూపర్ స్టార్లు లేకపోయినా ఉన్నవారితోనే సమష్టిగా ఆడటం ఆ జట్టు బలం. చివరి వరకు పోరాడటం, ఓటమిని ఒప్పుకోకపోవడం కివీస్​లో చూడొచ్చు. అలాంటి న్యూజిలాండ్ జట్టుకు వరల్డ్ కప్స్​లో మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా 12 సార్లు వన్డే వరల్డ్ కప్ జరగ్గా.. 8 సార్లు సెమీస్​కు వెళ్లిన ఘనత కివీస్​కు ఉంది. దీన్ని బట్టే ఆ జట్టు ఎంత కన్​సిస్టెన్స్​గా రాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి కూడా కివీస్ ప్రపంచ కప్​ను ముద్దాడలేకపోయింది. 2015, 2019 వరల్డ్ కప్స్​లో రన్నరప్​గా నిలిచింది. గత వరల్డ్ కప్​లోనైతే సూపర్ ఓవర్ తర్వాత బౌండరీ కౌంట్ అనే రూల్ వల్ల న్యూజిలాండ్ తృటిలో కప్పును కోల్పోయింది.

జట్టు కూర్పు

న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు కూర్పును చూసుకుంటే.. కెప్టెన్​గా కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. అతడితో పాటు మెయిన్ బ్యాటర్లుగా గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్ టీమ్​లో ఉన్నారు. వికెట్ కీపర్లుగా టామ్ లాథమ్, డెవాన్ కాన్వే.. పేసర్లుగా ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ ఉన్నారు. సీమ్ ఆల్​రౌండర్లుగా జిమ్మీ నీషమ్, డ్యారెల్ మిచెల్.. స్పిన్​ ఆల్​రౌండర్లుగా మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర, మార్క్​ చాప్​మన్ రూపంలో సత్తా కలిగిన ప్లేయర్లు న్యూజిలాండ్​లో ఉన్నారు. ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్​గా ఇష్ సోధి వ్యవహరించనున్నాడు.

బలాలు

న్యూజిలాండ్ టీమ్​లో విలియమ్సన్, బౌల్ట్ లాంటి ఒకరిద్దన్ని మినహాయిస్తే పెద్దగా స్టార్లు కనిపించరు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియాలా పేపర్​పై చూసేందుకు ఆ జట్టు బలంగా కనిపించదు. అయినా ప్లేయర్లు అందరూ ఐకమత్యంతో ఆడటం కివీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. ప్రతిసాకి కనీసం సెమీఫైనల్​కు చేరుకోవడం ఆ టీమ్​కు ఆనవాయితీగా వస్తోంది. మిగతా జట్లతో పోల్చుకుంటే టీమ్​ వర్క్​తో ఆడటం, ఫీల్డింగ్ అద్భుతంగా చేయడం న్యూజిలాండ్​కు పెద్ద ప్లస్ పాయింట్. మ్యాచ్​ను చివరి వరకు తీసుకెళ్లడం, ఒక్కో రన్​ చేస్తూ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించే విలియమ్సన్ లాంటి బ్యాటర్ ఉండటం మరో బలమని చెప్పాలి.

విలియమ్సన్ తన బ్యాటింగ్ ఎబిలిటీస్​తో పాటు కెప్టెన్​గా టీమ్​ను కూల్​గా ముందుండి నడిపిస్తాడు. ఎంఎస్ ధోనీలా ఎంత ఒత్తిడి ఉన్నా బయటకు కనిపించకుండా బాగా హ్యాండిల్ చేస్తాడు కేన్ మామ. అలాంటి కెప్టెన్ ఉండటం కివీస్​కు బిగ్ ప్లస్. బౌల్ట్ రూపంలో వరల్డ్ క్లాస్ లెఫ్టార్మ్ పేసర్ ఉండటం మరో అడ్వాంటేజ్. అద్భుతమైన పేస్​తో బౌలింగ్ వేసే ఫెర్గూసన్​ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపగలడు. పేస్​తో పాటు మంచి స్పిన్ ఎటాక్ న్యూజిలాండ్​ సొంతమని చెప్పాలి. స్పిన్నర్లు మిషెల్ శాంట్నర్, ఇష్ సోధీని ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్​మెన్​కైనా కష్టమే. విలియమ్సన్, బౌల్ట్, కాన్వే, ఫెర్గూసన్​, నీషమ్​కు ఐపీఎల్​లో ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉంది. ఇవి కివీస్ బలాలుగా చెప్పొచ్చు.

బలహీనతలు

మంచి గేమ్ ఛేంజర్ లాంటి ప్లేయర్ టీమ్​లో లేకపోవడం న్యూజిలాండ్​కు మైనస్​గా చెప్పొచ్చు. గ్లెన్ ఫిలిప్స్ రూపంలో అలాంటి ఒక ఆటగాడు ఉన్నా.. అతడు భారత పిచ్​లపై ఆ స్థాయిలో క్లిక్ కాలేదు. విలియమ్సన్ ఉన్నా అతడు ఎక్స్​ ఫ్యాక్టర్ అని చెప్పలేం. కేన్ మామ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లగలడు. కానీ రాస్ టేలర్ మాదిరిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సాలిడ్ మ్యాచ్ విన్నర్స్ కివీస్ టీమ్​లో కనిపించడం లేదు. ఆ జట్టుకు ఇంజ్యురీ భయం కూడా ఉంది. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న విలియమ్సన్ ఎలా ఆడతానేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

టామ్ లాథమ్ లాంటి బ్యాటర్లతో న్యూజిలాండ్ టాపార్డర్ బలంగా కనిపిస్తోంది. ఇండియాలో అతడి స్ట్రైక్ రేట్ 55గా ఉంది. అయితే మిడిలార్డర్ ఎలా రాణిస్తుందనే దాని మీదే కివీస్ సక్సెస్ ఆధారపడి ఉంది. కేన్ విలియమ్సన్ గనుక ఫెయిలైతే మిడిలార్డర్​లో ఆ స్థాయి ప్లేయర్ మరొకరు లేకపోవడం న్యూజిలాండ్​కు మైనస్​గా చెప్పొచ్చు. టిమ్ సౌథీ గాయం కూడా కివీస్​ను ఇబ్బంది పెడుతోంది. ఇంగ్లండ్​తో సిరీస్​లో అతడి బౌలింగ్ హ్యాండ్​కు ఇంజ్యురీ అయింది. ఈ నేపథ్యంలో అతడు ఎప్పుడు ఫిట్ అవుతాడు, అసలు మెగాటోర్నీలో ఆడతాడా లేదా అనేది క్లారిటీ లేదు. సౌథీ లేకపోతే పవర్​ప్లేలో వికెట్లు తీయడం కష్టమైపోతుంది. అప్పుడు బౌల్ట్ మీద మరింత ఒత్తిడి పడటం ఖాయం. ఈ బలహీనతల్ని అధిగమిస్తే కివీస్​కు తిరుగుండదు. ఆ జట్టు బలాబలాల్ని గమనిస్తే సెమీస్​కు చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. కానీ ఎప్పటిలాగే సమిష్టిగా ఆడితే కప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ఈసారి ప్రపంచ కప్​లో కివీస్ ఎంతవరకు వెళ్లగలదని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​తో మ్యాచ్ అంటే పాక్ ప్లేయర్లు భయపడుతున్నారు: మాజీ క్రికెటర్