iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో భారత్ విజయానికి 5 కారణాలు ఇవే..!

  • Author singhj Published - 07:39 AM, Mon - 9 October 23
  • Author singhj Published - 07:39 AM, Mon - 9 October 23
ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో భారత్ విజయానికి 5 కారణాలు ఇవే..!

సొంతగడ్డ మీద జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా శుభారంభం చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఆడిన ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాను భారత్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ గెలుపు అంత ఈజీగా రాలేదు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన కంగారూ జట్టు 49.3 ఓవర్లలో 199 రన్స్​కే ఆలౌటైంది. ఆ టీమ్​లో స్టీవ్ స్మిత్ (46), డేవిడ్ వార్నర్ (41) మాత్రమో రాణించారు. వీళ్లు కూడా తమకు దొరికిన మంచి స్టార్ట్​ను భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిలయ్యారు. పిచ్​ స్పిన్​కు సహకరిస్తుండటం, భారీ షాట్లు కొట్టడం కష్టంగా మారడంతో ఛేజింగ్​కు దిగిన భారత్​కు సవాళ్లు ఎదురయ్యాయి.

ఛేదనకు దిగిన టీమిండియాకు షాక్​ల మీద షాక్​లు తగిలాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెలె స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్​లో ఆఫ్ సైడ్ అవతల పడిన బంతిని వెంటాడిన ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) స్లిప్​లో దొరికిపోయాడు. ఆ తర్వాతి ఓవర్​లో జోష్ హేజిల్​వుడ్ (3/38).. మరో ఓపెనర్​ రోహిత్ శర్మ(0) తో పాటు శ్రేయస్ అయ్యర్ (0) ​లను ఔట్ చేసి డబుల్ షాక్ ఇచ్చాడు. భారత మొదటి ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్​గా వెనుదిరగడం గమనార్హం. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97) అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్​కు 165 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో కోహ్లీ ఔటైనా హార్దిక్ పాండ్యా (11)తో కలసి మ్యాచ్​ను ముగించాడు రాహుల్. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి ఐదు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బౌలింగ్

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో భారత బౌలింగ్ యూనిట్ సక్సెస్ అయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా (2/35), మహ్మద్ సిరాజ్​ (1/26)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆఖర్లోనూ బుమ్రా, సిరాజ్​లు వికెట్లు తీసి ఆసీస్​ను త్వరగా ఆలౌట్ చేశారు. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా (1/28)తో కలసి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (1/34), కుల్దీప్ యాదవ్ (2/42), రవీంద్ర జడేజా (3/28)లు చెలరేగి బౌలింగ్ చేశారు. రన్స్ చేయాల్సిన దశలోనే వరుసగా వికెట్లు పడటంతో ఆసీస్ కోలుకోలేకపోయింది.

ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం

స్పిన్​కు అనుకూలిస్తుందనే సంకేతాల మధ్య చెపాక్ పిచ్​పై ముగ్గురు స్పిన్నర్లతో దిగడం టీమిండియాకు కలిసొచ్చింది. స్పిన్ వ్యూహంతో ఆసీస్​ను చుట్టేయాలని ప్లాన్ చేసిన కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ఫార్ములా సక్సెస్ అయింది. జడేజా, కుల్దీప్, అశ్విన్​లు కలసి 6 వికెట్లు తీసి కంగారూ టీమ్ పతనాన్ని శాసించారు. మన జట్టులో ఉన్న ముగ్గురూ ప్రధాన స్పిన్నర్లే కావడం విశేషం. అదే ఆసీస్​లో మాత్రం ఆడమ్ జంపా ఒక్కడే మెయిన్ స్పిన్నర్. అతడు కూడా ఫెయిలవ్వడం ఆసీస్​ను దారుణంగా దెబ్బతీసింది.

మెరుగైన ఫీల్డింగ్

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో భారత ఫీల్డర్లు రాణించారు. ఒక్కో రన్ కోసం ఆసీస్ బ్యాటర్లను శ్రమించేలా చేశారు. క్యాచులు పట్టడంతో పాటు బౌండరీలను కాపాడారు. దాదాపు 10 నుంచి 15 రన్స్ కాపాడారు. దీని వల్ల ఛేజింగ్​లో భారత్​పై ఒత్తిడి తగ్గింది. ఫీల్డర్లతో పాటు ప్రధానంగా చెప్పుకోవాల్సింది వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గురించే. చెన్నైలో తీవ్ర ఉక్కపోత మధ్య అతడు కీపింగ్ చేసిన తీరు అద్భుతం. ఒక బౌండరీని కాపాడిన రాహుల్.. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ ఆకట్టుకున్నాడు.

కోహ్లీ-రాహుల్ పార్ట్​నర్​షిప్

ప్రపంచ కప్ వేటను భారత్ విజయంతో ఆరంభించడంలో ప్రధాన కారణాల్లో ఒకటిగా కోహ్లీ-రాహుల్ భాగస్వామ్యమని చెప్పొచ్చు. 2 రన్స్​కే 3 వికెట్లు పడిన టైమ్​లో క్రీజులోకి దిగిన ఈ స్టార్ బ్యాటర్స్ తమ ఎక్స్​పీరియెన్స్​ మొత్తాన్ని బయటికి తీశారు. టెస్ట్ క్రికెట్ స్టైల్​లో మంచి బంతుల్ని డిఫెన్స్ చేస్తూ, స్ట్రైక్ రొటేషన్ సాగిస్తూ.. చెత్త బంతులను బౌండరీలకు తరిలించారు. వీళ్ల పార్ట్​నర్​షిప్ మ్యాచ్​కు టర్నింగ్ పాయింట్​గా చెప్పొచ్చు.

టాస్ ఓడిపోవడం

వరల్డ్ కప్ మొదటి మ్యాచ్​లో టాస్ ఓడిపోవడం భారత్​కు కలిసొచ్చింది. ఒకవేళ ఆసీస్ ప్లేస్​లో టీమిండియా తొలుత బ్యాటింగ్​కు దిగి తక్కువ స్కోరుకే పరిమితమైతే గెలుపు కష్టమయ్యేదేమో. కానీ టాస్ ఓడిపోవడం, పిచ్ స్పిన్​కు సహకరించడం, పేసర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కంగారూ టీమ్​ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఛేజింగ్​లో మూడు వికెట్లు త్వరగా పడినా.. కోహ్లీ, రాహుల్ బాధ్యత తీసుకొని ఆఖరి వరకు క్రీజులో నిలిచారు. కోహ్లీ ఎప్పటిలాగే తనను ఎందుకు ఛేజ్ మాస్టర్ అని అంటారో మరోమారు ప్రూవ్ చేశాడు. వీళ్లిద్దరూ తీవ్ర ఒత్తిడిలోనూ ఏమాత్రం అలసత్వానికి తావివ్వకుండా తమ ప్లాన్​కు అనుగుణంగా ఆడుతూ టీమ్​ను విజయతీరాలకు చేర్చారు.

ఇదీ చదవండి: జడేజా క్లాస్ డెలివరీకి స్మిత్​కు దిమ్మతిరిగింది.. కోహ్లీ రియాక్షన్ వైరల్!