క్రికెట్​లో ఎన్ని రకాల ఔట్లు ఉన్నాయో తెలుసా? వీటి గురించి ఎప్పుడూ వినుండరు!

  • Author singhj Published - 04:23 PM, Tue - 7 November 23

వన్డే వరల్డ్ కప్​లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్​లో సీనియర్ క్రికెటర్​ ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్ ఔట్​గా అవ్వడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్​లో ఎన్ని రకాల ఔట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డే వరల్డ్ కప్​లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్​లో సీనియర్ క్రికెటర్​ ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్ ఔట్​గా అవ్వడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్​లో ఎన్ని రకాల ఔట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 04:23 PM, Tue - 7 November 23

క్రికెట్ వరల్డ్​ను ఇప్పుడో ఉదంతం ఊపేస్తోంది. అదే ‘టైమ్డ్ ఔట్’. వన్డే ప్రపంచ్ కప్-2023లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్​లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఔటైన తీరుపై పెద్ద డిస్కషనే నడుస్తోంది. క్రీజులోకి వచ్చిన అతను గార్డ్ తీసుకోకుండానే తిరిగి హెల్మెట్ కోసం వెయిట్ చేశాడు. దీంతో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. నిర్ణీయ సమయం (2 నిమిషాలు)లోపు బ్యాటింగ్ మొదలుపెట్టని కారణంగా మాథ్యూస్​ను అంపైర్లు ఔట్​గా ప్రకటించారు. దీంతో మాథ్యూస్-షకీబ్ మధ్య వివాదం రాజుకుంది. నెక్స్ట్ బంగ్లా బ్యాటింగ్​ టైమ్​లో షకీబ్​ను మాథ్యూస్ ఔట్ చేయడం.. తనకూ టైమ్ వచ్చిందని సైగలు చేయడం వైరల్​గా మారింది.

మాథ్యూస్-షకీబ్ కాంట్రవర్సీ ఇక్కడితో ముగియలేదు. దీని వల్ల మ్యాచ్ ముగిశాక శ్రీలంక-బంగ్లాదేశ్ ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. అంతేగాక మ్యాచ్ తర్వాత మాథ్యూస్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన పదిహేనేళ్ల కెరీర్​లో ఇలా దిగజారిపోయిన టీమ్​ను ఎప్పుడూ చూడలేదన్నాడు. తాను క్రీజులో ఉంటే లంక గెలిచేదని తాను చెప్పడం లేదని.. కానీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలంటూ మాథ్యూస్ తీవ్రంగా స్పందించాడు. అయితే షకీబ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. రెండు నిమిషాల్లోపు రెడీగా ఉండకపోతే బ్యాట్స్​మన్​ను ఔట్​గా ఇవ్వొచ్చని రూల్స్​లో ఉందని.. అందుకే అప్పీల్ చేశానని షకీబ్ వెల్లడించాడు.

ఇక, మాథ్యూస్ ఉదంతంతో ‘టైమ్డ్ ఔట్’ అనేది ఒకటి ఉందని అందరికీ తెలిసొచ్చింది. కానీ క్రికెట్​లో అనేక రకాల ఔట్లు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాట్

బ్యాట్స్​మన్ కొట్టిన బాల్ గ్రౌండ్​కు తగలకముందే గాల్లోనే ఫీల్డర్ పట్టుకుంటే దాన్ని కాట్​గా లేదా క్యాచ్ ఔట్​గా ప్రకటిస్తారు. బ్యాటర్ కొట్టిన బాల్​ను వికెట్ల వెనుక ఉన్న కీపర్ లేదా స్లిప్స్​లో ఉన్న ఫీల్డర్ పట్టుకుంటే కాట్ బిహైండ్​గా ఇస్తారు. అదే బౌలర్ డైరెక్ట్​గా క్యాచ్ పట్టుకుంటే కాట్ అండ్ బౌల్డ్​గా ప్రకటిస్తారు.

బౌల్డ్

బౌలర్ వేసిన బాల్ లీగల్ డెలివరీ అయి బ్యాట్స్​మెన్​ను దాటుకొని వికెట్లను తాకితే దాన్ని బౌల్డ్ అంటారు. నేరుగా వికెట్లను తాకినా లేదా బ్యాటర్ బాడీకి తగిలి స్టంప్స్​ను గిరాటేసినా బౌల్డ్​గా ప్రకటిస్తారు.

లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ)

వికెట్ల ముందు బ్యాటర్ దొరికిపోతే దాన్ని ఎల్బీడబ్ల్యూ అంటారు. బ్యాట్​ను గానీ బ్యాటర్ గ్లౌవ్​ను గానీ తగలకుండా నేరుగా బ్యాట్స్​మన్ శరీరంలోని ఏ పార్ట్​ను టచ్ అయినా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయొచ్చు. అయితే ఆ బాల్ బ్యాటర్ శరీరం లేదా ప్యాడ్స్ తగిలే లైన్, స్టంప్స్​కు నేరుగా ఉందా లేదా లాంటి కొన్ని విషయాలను బట్టి ఔట్​గా ప్రకటిస్తారు.

రనౌట్

షాట్ కొట్టాక రన్ తీసేందుకు ప్రయత్నించే క్రమంలో బ్యాటర్ తిరిగి క్రీజులోకి చేరుకోవాలి. ఒకవేళ క్రీజుకు దూరంగా ఉన్నప్పుడే ఫీల్డర్, కీపర్ లేదా బౌలర్ బాల్​తో వికెట్లను గిరాటేస్తే రనౌట్​గా ఇస్తారు. ఒక్కోసారి బాల్ బాడీకి తగిలినా, అసలు దేనికీ తగలకపోయినా రన్ తీస్తారు. ఈ టైమ్​లో కూడా క్రీజులోకి చేరేలోపు రనౌట్ చేయొచ్చు.

స్టంప్డ్

బ్యాట్స్​మెన్ క్రీజును విడిచి బాల్​ను కొట్టేందుకు ముందుకు వస్తుంటారు. ఒకవేళ షాట్ మిస్సయిందంటే తిరిగి వెనక్కి చేరుకోవాలి. ఒకవేళ కీపర్ బాల్​తో వికెట్లను పడేసే లోపు బ్యాటర్ క్రీజులోకి రాకపోతే దాన్ని స్టంప్డ్​గా ప్రకటిస్తారు.

రిటైర్డ్ ఔట్

ఒక బ్యాట్స్​మన్ అనారోగ్యం, ఇంజ్యురీ కాకుండా ఇతర ఏ కారణం వల్లనైనా క్రీజును వీడాలంటే అంపైర్లకు సమాచారం ఇవ్వాలి. అలాగే ప్రత్యర్థి టీమ్ కెప్టెన్​ దీనికి ఒప్పుకోవాలి. అలా చేస్తేనే తిరిగి ఇన్నింగ్స్​ను కొనసాగించొచ్చు. ఒకవేళ తిరిగి క్రీజులోకి రాకపోతే ఆ బ్యాటర్​ను రిటైర్డ్ ఔట్​గా ప్రకటిస్తారు.

హిట్ ద బాల్ ట్వైస్

ఒకవేళ బ్యాటర్ బాల్​ను రెండుసార్లు కొడితే దాన్ని ఔట్​గా ప్రకటిస్తారు. బాడీతో గానీ బ్యాట్​తో కానీ బాల్​ను కావాలనే రెండోసారి కొట్టేందుకు ప్రయత్నిస్తే హిట్ ద బాల్ ట్వైస్ కింద ఔట్​గా ఇవ్వొచ్చు.

హిట్ వికెట్

బ్యాట్స్​మన్ షాట్ కొట్టే క్రమంలో వికెట్లను బ్యాట్​తో గానీ బాడీతో కానీ పడేస్తే దాన్ని హిట్​ వికెట్​గా ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: ‘TIMED OUT’​ నుంచి తప్పించుకున్న గంగూలీ.. షకీబ్​లా గ్రేమ్ స్మిత్ చేసుంటే..?

Show comments