కాళ్ళు తీసేసే స్థితి నుండి.. రీ-ఎంట్రీ వరకు! పంత్ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ స్టోరీ!

కాళ్ళు తీసేసే స్థితి నుండి.. రీ-ఎంట్రీ వరకు! పంత్ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ స్టోరీ!

Rishabh Pant Greatest Comeback Story: రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి కాంపిటీటివ్ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అలాంటి పంత్ లైఫ్ ఈ రెండేళ్లు ఏం జరిగాయో చూద్దాం.

Rishabh Pant Greatest Comeback Story: రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి కాంపిటీటివ్ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అలాంటి పంత్ లైఫ్ ఈ రెండేళ్లు ఏం జరిగాయో చూద్దాం.

రిషబ్ పంత్.. ఈ యంగ్ క్రికెటర్ గురించి వరల్డ్ క్రికెట్ కి పరిచయం అక్కర్లేదు. మైదానంలోకి అడుగుపెడితే ఎదురొచ్చే బాల్ ని బౌండరికీ పంపడం తప్ప వేరే విషయం తెలియదు. ఇతను బాదిన బౌలర్లు మళ్లీ చిన్నా చితకవాళ్లు కాదండోయ్.. వరల్డ్ క్రికెట్ లో తమకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నవాళ్లే. ప్రత్యర్థి ఎవరైనా.. బంతి ఎవరి చేతిలో ఉన్నా.. అతని టార్గెట్ మాత్రం ఒక్కటే.. కోడ్తే.. బంతి బౌండరీ అవతల పడాలి. అలాంటి పంత్ టీమిండియాలో నిలదొక్కుకుంటున్న సమయం, అప్పుడప్పుడే అసలైన క్రికెట్ మజాని ఆశ్వాదిస్తున్న క్షణం, క్రికెట్ అభిమానులకు యువ రక్తంలో ఉండే కసిని పరిచయం చేస్తున్న క్షణం.. గబ్బాలాంటి మైదానంలో ఆస్ట్రేలియాకి ఓటమి రుచిని చూపించిన క్షణం. కానీ, అంతా తలకిందులు అయిపోయింది. ఒక్క ప్రమాదంతో పంత్ కెరీర్ ముగిసిపోయింది అనుకున్నారు. క్రికెట్ ప్రపంచానికి ఓ టాలెంటెడ్ క్రికెటర్ దూరమయ్యాడని ఫిక్స్ అయిపోయారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ పంత్ పునరాగమనం అందరినీ ఆశ్చర్య పరచడమే కాకుండా.. స్ఫూర్తిని కూడా నింపుతోంది.

గబ్బాలో పంత్ గర్జన:

పంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే ఎవరైనా గబ్బా విన్ అనే చెప్తారు. ఒక్క పంత్ మాత్రమే కాదు.. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మొదలు రోహిత్ శర్మ వరకు ఎవరైనా గబ్బా గురించే మాట్లాడతారు. అలాంటి గబ్బాలో ఆస్ట్రేలియాని పంత్ ఒంటిచేత్తో ఓడించాడు. 28 ఏళ్లపాటు ది గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాని ఓడించిన టీమ్ లేదు. గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా తడబడింది లేదు. కానీ, అలాంటి కంగారూలను కంగారు పెట్టిన ఏకైక ప్లేయర్ రిషబ్ పంత్. గబ్బాలో విజయం తప్ప మరో విషయం తెలియని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఓటమి భయం అంటే ఏంటో చూపించాడు. విజయానందంతో గర్జించే వాళ్లకు ఓటమిలో ఉండే బాధను రుచి చూపించాడు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆస్ట్రేలియా జట్టుకు ఒక పీడకలను మిగిల్చాడు. ఇప్పటికీ పంత్ పేరు వింటే ఆస్ట్రేలియా జట్టు ఒక అడుగు వెనక్కి వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప విజయాన్ని అందించిన పంత్ కు ఆ విక్టరీ గొప్పతనం రోహిత్ శర్మా చెప్పే వరకు తెలియలేదు. పంత్ దానిని ఒక సాదాసీదా విజయం అనుకున్నాడు. ఓడిపోవాల్సిన సిరీస్ ను గెలిచాం అనుకున్నాడు. పంత్ అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే పంత్ అప్పుడు 23 ఏళ్ల కుర్రాడు. కెరీర్ లో అప్పుడప్పుడే పుంజుకుంటున్నాడు. అలాంటి రిషబ్ పంత్ జీవితంలో ఆ ప్రమాదాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. నిజానికి అది పంత్ కు మాత్రమే కాదు.. మొత్తం టీమిండియా అభిమానులకు కూడా ఒక పీడకల లాంటిదే. ఆ ప్రమాదం తర్వాత పంత్ తిరిగి టీమిండియాలోకి రావడం దాదాపుగా అసాధ్యం అనే అనుకున్నారు.

పంత్ రికవరీ:

ఆ ప్రమాదం నుంచి రిషబ్ పంత్ అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అతని కాళ్లు కూడా తీసేసే పరిస్థితి అది. ఇలాంటి సమయాల్లో ఎవ్వరైనా.. ఏ స్టార్ ప్లేయర్ అయినా.. కచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్తారు. పైగా పంత్ వయసు అప్పుడు 24 ఏళ్లు. క్రికెట్ తప్పితే అతనికి మరో లోకం కూడా తెలియదు. అలాంటి కుర్రాడు మానసికంగా ఒత్తిడికి లోనవ్వడం, తన జీవితంపై ఆశలు వదులుకోవడం పెద్ద విషయం కాదు. కానీ, పంత్ అంటే ఏంటో తన కుటుంబానికే కాదు.. ఈ ప్రపంచానికి కూడా అప్పుడే తెలిసొచ్చింది. మైదానంలో మొండిగా ఆడటమే కాదు.. జీవితంలో కూడా అంతే మొండి సమస్యలను ఎదిరించి నిలబడతాడు అనే నమ్మకం కలిగింది. రిషబ్ పంత్ ఆ ట్రాన్స్ నుంచి, ఆ ప్రమాదం నుంచి చాలా త్వరగా కోలుకున్నాడు. ఆస్పత్రి బెడ్ మీద కదలలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అతని మానసిక స్థితి ఎంతో నిశ్చలంగా ఉంది. ఎందుకంటే శారీరకంగా కోలుకోవడానికి అంటే ముందే మానసికంగా తనని తాను సంసిద్ధం చేసుకున్నాడు.

పంత్ గ్రేట్ కంబ్యాక్:

ఏ ప్రమాదం తనని- తనకు ప్రాణమైన క్రికెట్ ను వేరు చేయలేవని గ్రహించాడు. తాను తిరిగి క్రికెట్ ఆడాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. తనకు ఏం జరిగినా తిరిగి క్రికెట్ ఆడగలను అని నిరూపించాడు. ఆస్పత్రిలో చికిత్స, సర్జరీలకు తట్టుకున్నాడు. ఆ తర్వాత ఫిజియోథెరపీలు చేయించుకున్నాడు. NCAలో తన రికవరీని స్టార్ట్ చేశాడు. వైద్యలు పర్యవేక్షణలో తాను తిరిగి మైదానంలోకి రావడానికి ఏదైతే చేయాలో అదంతా చేశాడు. అప్పుడు రిషబ్ పంత్ మళ్లీ తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ లోకి అడుగు పెట్టడం అసాధ్యమని వైద్యులు కూడా భావించారు. మోకాలు డిస్ లొకేట్ అయిన ఒక వ్యక్తి ఇలాంటి ఫిట్ నెస్ సాధిస్తాడని వాళ్లు కూడా నమ్మలేదు. ఇప్పుడు పంత్ ఒక మిరాకిల్ మ్యాన్ అంటూ వైద్యులు కూడా ప్రశంసలు కురిపిచేస్తున్నారు.

పంత్ లైఫ్ లో ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. అతనికి ప్రమాదం జరగడం, క్రికెట్ కు దూరమవ్వడం, టీమిండియాలో చోటు కోల్పోవడం, ఐపీఎల్ మ్యాచులు ఆడలేకపోవడం, మైదానం వదిలి మంచానికే పరిమితం కావడం. ఇవన్నీ జరిగినా తనకి తన మీద ఉన్న నమ్మకం, తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ధృడ సంకల్పమే ఈరోజు పంత్ ఈ స్టేజ్ లో నిలబెట్టింది. ఇది ఒక్క పంత్ కుటుంబానికే కాదు.. ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి శుభవార్త అనే చెప్పాలి. అంతేకాదు.. పంత్ కంబ్యాక్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే యువతకు ఒక గొప్ప స్ఫూర్తి కూడా అవుతుంది. కాళ్లు తీసేసే స్టేజ్ నుచి ఇలాంటి కంబ్యాక్ ఇస్తున్న రిషబ్ పంత్ కు మనం ఏం చెప్పగలం? “హేట్సాఫ్ టూయూ.. వెలకమ్ బ్యాక్” అని తప్ప…

Show comments